మెదక్‌కు పూర్తిస్థాయి జిల్లా న్యాయస్థానం

ABN , First Publish Date - 2022-05-29T05:15:03+05:30 IST

మెదక్‌కు పూర్తిస్థాయి జిల్లా కోర్టు మంజూరైంది.

మెదక్‌కు పూర్తిస్థాయి జిల్లా న్యాయస్థానం
ప్రస్తుతం మెదక్‌లో ఉన్న కోర్టు భవనం

ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు 

జూన్‌ 2న జిల్లా కోర్టు ప్రారంభం 

సంగారెడ్డి కోర్టు నుంచి బదిలీ చేయనున్న కేసులు

మెదక్‌ అర్బన్‌, మే 28: మెదక్‌కు పూర్తిస్థాయి జిల్లా కోర్టు మంజూరైంది. రాష్ట్రంలో నూతన జిల్లాల ప్రాతిపదికన పూర్తిస్థాయి జిల్లా న్యాయస్థానాల ఏర్పాటుకు గతంలోనే హైకోర్టు అనుమతి మంజూరు చేయగా...గత గురువారం రాష్ట్ర హోం శాఖ కొత్త జిల్లాల వారీగా జిల్లా కోర్టులను మంజూరు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు ఉమ్మడి మెదక్‌ జిల్లాకు సంబంధించి సంగారెడ్డి పరిధిలో ఉన్న న్యాయస్థానమే మెదక్‌కు కూడా న్యాయస్థానంగా కొనసాగింది. మెదక్‌కు ప్రత్యేకంగా పూర్తిస్థాయి జిల్లా కోర్టు మంజూరు కావడంతో జూన్‌ 2 నుంచి ఇక్కడే కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.


కేసుల బదలాయింపు

ఇన్నాళ్లూ సంగారెడ్డిలో ఉమ్మడి జిల్లా కోర్టులో మెదక్‌ జ్యుడీషియల్‌ కేసులకు సంబంధించి కేసులు అక్కడి నుంచి మెదక్‌కు బదిలీ చేయనున్నారు. ఈ నెలలో కేసుల బదిలీ ప్రక్రియను పూర్తి చేయడానికి న్యాయాధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర ఆవిర్భావం రోజైన జూన్‌ 2 నుంచి కొత్త జిల్లాల్లో పూర్తిస్థాయి జిల్లా కోర్టులు పని చేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు జిల్లాస్థాయి కోర్టు కేసులకు దూరంగా ఉన్న సంగారెడ్డి ఉమ్మడి కోర్టుకు పలు కేసుల నిమిత్తం తిరిగే కక్షిదారులకు ఇకపై ఊరట లభించనున్నది. మెదక్‌ జిల్లా కోర్టుకు ప్రస్తుతం ఉన్న కోర్టు సముదాయంలోనే అందుబాటులో ఉన్న గదులను కేటాయించనున్నట్లు తెలిసింది. జిల్లా కోర్టుకు శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు ప్రస్తుతం ఉన్న కోర్టు పక్కనే ఉన్న 9 ఎకరాల 2 గుంటల స్థలాన్ని కేటాయించారు. 


న్యాయ సేవల్లో పురోగతి: బాలయ్య, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మెదక్‌

మెదక్‌కు పూర్తిస్ధాయి జిల్లా కోర్టు మంజూరు కావడం హర్షణీయం. ఎంతో కాలం నుంచి కోరుకుంటున్నవిధంగా జిల్లా కోర్టు ఏర్పాటు కానుండటంతో కక్షిదారులకు  సంగారెడ్డి ఉమ్మడి కోర్టుకు వెళ్లే వ్యయ ప్రయాసలు తప్పుతాయి. జిల్లా కోర్టు ఏర్పాటుతో ఎస్టీ, ఎస్సీ కేసుల విచారణ, కుటుంబ తగాదాలు, ఇతర క్రిమినల్‌ కేసులను ఇక్కడే విచారించునున్నారు.   

Updated Date - 2022-05-29T05:15:03+05:30 IST