మెదక్‌, సిద్దిపేటల్లో.. ఆర్‌ఆర్‌ఆర్‌ సర్వే షురూ

Jan 15 2022 @ 03:04AM

  • 4 మండలాల్లో మార్కింగ్‌.. తుది అలైన్‌మెంట్‌కు ఓకే
  • భూసేకరణకు ఎన్‌హెచ్‌ఏఐ రంగం సిద్ధం!


గజ్వేల్‌/తూప్రాన్‌/నర్సాపూర్‌, జనవరి 14: హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) పనులకు సంబంధించి మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో తొలి అడుగు పడింది. నర్సాపూర్‌, తూప్రాన్‌, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌, వర్గల్‌ మండలాల్లో అధికారులు సర్వే నిర్వహించి హద్దులను గుర్తిస్తున్నారు. హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌రోడ్డు పేరుతో భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో ‘భారత్‌ మాల పరియోజన పథకం’ కింద 344 కిలోమీటర్ల మేర గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ రీజనల్‌ రింగ్‌రోడ్డును కేంద్రప్రభుత్వం నిర్మించనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి, తుది అలైన్‌మెంట్‌ను ఆమోదించినట్టు తెలిసింది. దీనికి అనుగుణంగా మొదటిదశలో భాగంగా ఉత్తర భాగాన్ని పూర్తిచేయాలని సంకల్పించి, ఎన్‌హెచ్‌ఏఐ ఈ సర్వేను ప్రారంభించినట్టు సమాచారం. ఉత్తర భాగంలో 158.46 కిలోమీటర్ల మేర సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో పనులు జరుగనున్నాయి. ఆయా జిల్లాల్లోని 20 మండలాలు, 111 గ్రామాల మీదుగా రీజనల్‌ రింగ్‌రోడ్డు వెళ్లనుండగా, ఈ దశ అంచనా వ్యయం రూ.7512కోట్లుగా ఉంది.


భూసేకరణ అధికారులుగా ఆర్డీవోల నియామకం

ఆర్‌ఆర్‌ఆర్‌ తొలిదశకు 4,620 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భూసేకరణ బాధ్యతను ఆర్డీవోలకు అప్పగిస్తూ.. వారిని ప్రత్యేకాధికారులుగా నియమించారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, అందోల్‌, మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌, తూప్రాన్‌, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌, యాదాద్రి-భువనగిరి జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్‌ ఆర్డీవోలను స్పెషల్‌ అథారిటీలుగా ఎన్‌హెచ్‌ఏఐ నియమించింది. సర్వే తర్వాత వీరిద్వారా నోటిఫికేషన్‌ జారీచేసి, భూ యజమానులకు నోటీసులు అందిస్తారు. ఆ తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల చివరికల్లా సర్వే ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందని రాష్ట్రప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు.


తూప్రాన్‌ వద్ద భారీ కూడలి

సర్వే సంస్థ ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో సర్వే చేపట్టారు. వర్గల్‌ మండలంలోని మజీద్‌పల్లి, నెంటూరు, జబ్బాపూర్‌, గజ్వేల్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో సర్వే పూర్తిచేసి మార్కింగ్‌ చేశారు. తూప్రాన్‌ పట్టణ సమీపంలోని హల్దీవాగుకు అవతలివైపు 44వ హైవే పక్కన ఇస్లాంపూర్‌ శివారులో పశ్చిమ హద్దును, నాగులపల్లి శివారులో తూర్పు హద్దును ఏర్పాటు చేశారు. ఇక్కడ హైవే 44 రోడ్డుపై భారీ కూడలి ఏర్పాటు చేయనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ వెడల్పు 100 మీటర్లు కాగా.. ఈ కూడలిని 230 మీటర్లలో నిర్మిస్తారు. ఆ మేరకు నాగులపల్లి-ఇస్లాంపూర్‌ శివార్లలో 230 మీటర్ల ఎడంతో మార్కింగ్‌ చేశారు. దీంతోపాటు.. శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లి, గుండ్లపల్లి గ్రామాల మధ్య, తూప్రాన్‌ మండలం గుండ్రెడ్డిపల్లి వద్ద హద్దులు ఏర్పాటు చేశారు. ప్రస్తుత మార్కింగ్‌ ప్రకారం తూప్రాన్‌ మండలం వట్టూరు, జెండాపల్లి, నాగులపల్లి, ఇస్లాంపూర్‌, దాతర్‌పల్లి, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, కిష్టాపూర్‌, నర్సంపల్లి మీదుగా రాయపోలు మండలం బేగంపేట వద్ద సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రవేశించనున్నది.


స్థానికుల్లో అయోమయం

గ్రామాల్లో సర్వే చేస్తున్న సిబ్బంది స్థానికులకు ఏ విషయం చెప్పకపోవడంతో స్థానికుల్లో గందరగోళం నెలకొన్నది. గూగుల్‌మ్యాప్స్‌ ఆధారంగా ఆధునిక పరికరాలు, జీపీఎస్‌, డ్రోన్‌ కెమెరాలతో సర్వే చేస్తున్నారు. ఇప్పటికే అలైన్‌మెంట్‌ ఖరారు చేసినప్పటికీ వివరాలను గోప్యంగా పెట్టారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలంలో ప్రస్తుతం చేసిన మార్కింగ్‌ ప్రకారం కొన్నిచోట్ల ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నర్సాపూర్‌ మండలం మూసాపేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడ తండా, కొక్యాతండా పరిధిలో, శివ్వంపేట మండలం పిల్లుట్ల సమీపంలో సర్వేచేసి మార్కింగ్‌ చేశారు. దీని ప్రకారం 50 కుటుంబాలు నివసించే కొక్యాతండాను పూర్తిగా తరలించాల్సి వస్తుంది. ఎల్లరెడ్డిగూడ తండాలోనూ కొన్ని ఇళ్లు, పొలాలు పోయే అవకాశమున్నది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరా రూ. 50 లక్షలు పలుకుతోంది. ప్రభుత్వం తీసుకునే భూమికి ఎకరాకు రూ. పది లక్షలకు మించి ఇచ్చే అవకాశం లేదు. దీంతో పలు గ్రామాల్లో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.


 సంగారెడ్డి జిల్లాలో మొదలై..

హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌రోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి జిల్లాలో మొదలై యాదాద్రి-భువనగరి జిల్లా చౌటుప్పల్‌ వరకు సాగుతుంది. సంగారెడ్డి జిల్లా, మెదక్‌ జిల్లా, సిద్దిపేట జిల్లాల పరిధిలోని మండలాల్లో ఉన్న పలు గ్రామాల మీదుగా ఆర్‌ఆర్‌ఆర్‌ వెళ్తుంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.