లేడీ బాస్‌

ABN , First Publish Date - 2022-02-22T06:24:13+05:30 IST

సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఒకప్పుడు ఆమె చిరుద్యోగి. ఉద్యోగోన్నతిపై ఒక్కోమెట్టు ఎక్కి, ఉన్నత స్థితిలో ఉన్నారు.

లేడీ బాస్‌

ఉన్నతాధికారి అండతో ఆధిపత్యం

ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించారట

ఏ ఫైల్‌ అయినా అక్కడికి వెళ్లాల్సిందే

సాంఘిక సంక్షేమ శాఖలో ఇదే చర్చ

అనంతపురం క్లాక్‌టవర్‌, ఫిబ్రవరి 21: సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఒకప్పుడు ఆమె చిరుద్యోగి. ఉద్యోగోన్నతిపై ఒక్కోమెట్టు ఎక్కి, ఉన్నత స్థితిలో ఉన్నారు. ఆది నుంచి అక్కడే పనిచేస్తుండటంతో కార్యాలయంలో, శాఖలో ప్రతి అంశంపై పూర్తి పట్టు సాధించారు. ఉద్యోగోన్నతి పొందిన తరువాత ఓ ఏడాది మరో ప్రాంతానికి అలా వెళ్లి, ఇలా తిరిగి వచ్చేశారు. ఆ శాఖలో ఆమె చెప్పిందే వేదం అని కొందరు అంటున్నారు. పబ్బం గడుపుకోవడానికి ఆమె చుట్టూ కొందరు చేరారు. ఆ శాఖ ఉన్నతాధికారి కూడా ఆమె చెప్పినట్లు వినాల్సిందే అన్న ప్రచారం జరుగుతోంది. ఆ శాఖలో అధికారులు, ఉద్యోగులు, వార్డెన్ల ప్రమోషన్లు, బదిలీలు, డెప్యుటేషన్లు.. ఇలా ఏ పని అయినా ఆమె చెబితేనే జరుగుతుందని ప్రచారం ఉంది. ఆమె వ్యవహార శైలి ఆ శాఖలో చర్చనీయాంశం అయింది. బాధితులు కొందరు ఉన్నతాధికారితో పాటు ఆమెపై జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిసింది. కానీ ఈ విషయం గురించి బహిరంగంగా చెప్పడానికి భయపడుతున్నారు. ఆమెకు తెలిస్తే, తమకు మరిన్ని కష్టాలు తప్పవు అని ఆందోళన చెందుతున్నారు.


ప్రతి ఫైల్‌ అక్కడికి వెళ్లాల్సిందే..

ఆ శాఖలో జరిగే ప్రతి అంశం ఆమె దృష్టికి పోవాల్సిందే. లేదంటే ఆ పని లేదా ఫైల్‌పై కొర్రీ వేసేస్తారు. ఈ కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని కొందరు బాధితులు వాపోతున్నారు. ఆమెను కాదని, ఎవరైనా సరే ఆ శాఖ ఉన్నతాధికారి వద్దకు నేరుగా పనికోసం వెళ్లారో.. ఇక అంతే సంగతులు. వారి ఫైల్‌ కదలదు, పని జరగదు. సాక్షాత్తు ఆశాఖ ఉన్నతాధికారే ‘అక్కడ నుంచే ఫైల్‌ రావాలి’ అని చెప్పడం పట్ల ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అదేస్థాయిలో మరో అధికారి ఉన్నా, పెద్దగా అధికారాలు ఇవ్వలేదు. విభాగాలను కూడా నామమాత్రంగానే కేటాయించడం గమనార్హం. మిగిలిన పని మొత్తం లేడీబాస్‌ చూసుకుంటున్నారని సమాచారం. అదే స్థాయిలో ఉన్న ఆ అధికారి  ఆమె తీరు గురించి పలుమార్లు ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయినా ఆమెలో మార్పు లేదని తెలుస్తోంది. ఉన్నతాధికారి ఆమెకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణమని ఆ శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.


వాటా ఇవ్వాల్సిందే

శాఖలో జరిగే ప్రతి పనిలోనూ ఆమెకు ప్రత్యేక వాటా ఇవ్వాల్సిందే అని బాధితులు అంటున్నారు. లేదంటే తమ అంతు చూసే వరకు విశ్రమించరని వాపోతున్నారు. ప్రతి ఫైల్‌కు ఓ రేటు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వార్డెన్ల డెప్యుటేషన్లు, ఉద్యోగోన్నతులు, నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలు, డెప్యుటేషన్లు, కారుణ్య నియామకాలు తదితర అంశాలలో వసూళ్లకు తెరలేపారని ప్రచార జరుగుతోంది. ఆ శాఖ ఉన్నతాధికారితో కలిసి అన్ని రకాల వసూళ్లలో భాగం పంచుకుంటున్నారని కొందరు అంటున్నారు.


ఆమె అంటే హడల్‌

సాంఘిక సంక్షేమశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు, వార్డెన్లు, సిబ్బంది ఆమె  పేరు చెబితే హడలెత్తిపోతున్నారు. ఆమె సమయానికి విధులకు హాజరు కారని,   ఆలస్యంగా కార్యాలయానికి వచ్చి, అందరికంటే ముందుగా ఇంటికి వెళ్లిపోతారని విమర్శలు వినిపిస్తున్నాయి. శాఖలో కీలక విభాగాలన్నీ ఆమెకు ఇచ్చారని, పక్కనే ఉన్న సహ అధికారికి నామమాత్రపు విభాగాలు అంటగట్టారని కొందరు ఆరోపిస్తున్నారు. ఆ నామమాత్రపు విభాగాల అంశాల్లో కూడా ఆమె జోక్యం ఉంటుందని, ఏదైనా సరే ఆమెదే పైచేయి అని అంటున్నారు. ఆయా సామాజికవర్గాలకు చెందిన సంఘాల నాయకులు కొందరు తమ పబ్బం గడుపుకోవడానికి ఆమెకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆ శాఖలోని అధికారులు, ఉద్యోగులను ఆ కొందరు నాయకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శాఖలో చీమ చిటుక్కుమన్నా వెంటనే తనకు తెలిసేలా ప్రత్యేక గూఢచర్య విభాగాన్ని ఆమె నిర్మించుకున్నారని అంటున్నారు.


కలెక్టర్‌ మేడం.. కాపాడండి..

కలెక్టర్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఆ కార్యాలయంలో ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. సాంఘిక సంక్షేమశాఖపై కలెక్టర్‌ దృష్టి సారించాలని బాధిత ఉద్యోగులు, అధికారులు కోరుతున్నారు. కలెక్టర్‌ తమ కార్యాలయాన్ని తనిఖీ చేయాలని, అక్రమాలను నియంత్రించి తమకు న్యాయం చేయాలని బాధిత ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - 2022-02-22T06:24:13+05:30 IST