వాణిజ్య వివాదాలకు మధ్యవర్తిత్వమే మందు!

ABN , First Publish Date - 2022-07-06T08:34:32+05:30 IST

వాణిజ్య ప్రపంచంలో తలెత్తే వివాదాలకు మధ్యవర్తిత్వమే(ఆర్బిట్రేషన్‌) సరైన పరిష్కార వ్యవస్థ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ స్పష్టం చేశారు.

వాణిజ్య వివాదాలకు మధ్యవర్తిత్వమే మందు!

అయితే ఆర్బిట్రేషన్‌ కోర్టు పర్యవేక్షణకే పరిమితం కావాలి

లండన్‌ ఆర్బిట్రేషన్‌ సదస్సులో సీజేఐ ఎన్‌వీ రమణ 

న్యూఢిల్లీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య ప్రపంచంలో తలెత్తే వివాదాలకు మధ్యవర్తిత్వమే(ఆర్బిట్రేషన్‌) సరైన పరిష్కార వ్యవస్థ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ స్పష్టం చేశారు. ఈ కేసుల సత్వర పరిష్కారానికి మరిన్ని ఆర్బిట్రేషన్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని.. ఈ రంగంలోని నిపుణులను న్యాయమూర్తులుగా నియమించాలని సూచించారు. మంగళవారం లండన్‌లో ఫిక్కీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘ఆర్బిట్రేటింగ్‌ ఇండో-యూకే కమర్షియల్‌ డిస్ప్యూట్స్‌’ అనే సదస్సులో చీఫ్‌ జస్టిస్‌ ప్రారంభోపన్యాసం చేశారు.భారత్‌లో కోర్టులు ఆర్బిట్రేషన్‌కు అనుకూలమని.. ప్రపంచ ట్రెండ్లు, డిమాండ్లకు అనుగుణంగా మధ్యవర్తిత్వ ప్రక్రియ పురోగమిస్తోందని తెలిపారు. ‘ఇది ఆత్మపరిశీలన చేసుకోవలసిన సమయం. ఆర్బిట్రేషన్‌ను సమర్థ, ఫలవంతమైన వ్యవస్థగా మలిచేందుకు అన్ని మార్గాలూ అన్వేషించాలి. అయితే మధ్యవర్తిత్వ ప్రక్రియలో కోర్టు పాత్ర తప్పనిసరిగా పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కావాలి. సహాయానికి, జోక్యానికి మధ్య ఉన్న సన్నని గీతను దాటరాదు’ అని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటుకు తాను చొరవ తీసుకున్నానని, గుజరాత్‌లో మరో కేంద్రం ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించడం సంతోషంగా ఉందన్నారు.  సాధారణ కోర్టుల్లో నిర్ణయాలు వెలువడడానికి సుదీర్ఘ కాలం పడుతోందని.


కోర్టుల వ్యవస్థలపై దీని ప్రభావం పడుతోందని తెలిపారు. భారత్‌లో కేసుల పెండింగ్‌ ప్రధాన సమస్య అన్నది సత్యమన్నారు. ఈ భారం తగ్గించుకోవడానికి మధ్యవర్తిత్వ పరిష్కారాన్ని ప్రోత్సహించాలని చీఫ్‌ జస్టిస్‌ రమణ తెలిపారు. సంప్రదాయ న్యాయ ప్రక్రియకు ఇదే సమర్థ ప్రత్యామ్నాయమన్నారు. పైగా కక్షిదారులు అంగీకరించిన నిబంధనల ఆధారంగానే ఆర్బిట్రేషన్‌ కోర్టులో నిర్ణయాలు జరుగుతాయని.. ఈ ప్రక్రియ పరస్పర సమ్మతితో కూడి ఉంటుందని.. గోప్యంగానూ ఉంటుందని.. తీర్పునకు అందరూ కట్టుబడాలని స్పష్టం చేశారు. వాణిజ్యం, వ్యాపార రంగాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీల్లో భారత్‌ ఒకటని చెప్పారు. ఎలాంటి అడ్డంకులూ లేకుండా వ్యాపారాలు కొనసాగేలా చూడాలని.. ఇక్కడే సమర్థ పరిష్కార మార్గాలు.. ముఖ్యంగా మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. వాణిజ్య ప్రపంచానికి సత్వర, సమర్థ పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా వివిధ అంతర్జాతీయ వివాద పరిష్కార సంస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2022-07-06T08:34:32+05:30 IST