జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నియామకాల్లో విచిత్రాలు

ABN , First Publish Date - 2021-01-08T04:40:12+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పలు నియామకాల్లో అడ్డగోలుగా నిబంధనలు మారుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నియామకాల్లో విచిత్రాలు

మెరిట్‌, అనుభవం ఆధారంగానే అంటూ తొలుత ప్రకటన 

తుదిజాబితా వచ్చేసరికి రూరల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు

ఐదు పోస్టులు దాటితేనే ఆ నిబంధన వర్తింపు

కానీ మూడు పోస్టులకే ఆర్‌వోఆర్‌..

ఒక్క పోస్టుకు నాన్‌లోకల్‌ రిజర్వేషన్‌

అదనపు చదువుకు అందని పాయింట్లు

అవకతవకలు జరుగుతున్నాయంటూ పలువురి ఆరోపణ

 

వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆసుపత్రుల్లో గత అక్టోబరులో 160 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నోటిఫికేషన్‌లో కేవలం మెరిట్‌, అనుభవం ఆధారంగానే నియామకాలు చేపడతామని స్పష్టంగా ఉంది. కాని రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేశారు. 


సోషల్‌ వర్కర్‌ పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ ఒక్క పోస్టునూ నాన్‌లోకల్‌కు కేటాయించారు. ఒకే పోస్టు ఉంటే అది నాన్‌లోకల్‌ ఎలా వెళుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. 


 దంత వైద్యుల పోస్టుల కోసం బీడీఎస్‌ చదివి ఉండాలని నిబంధన పెట్టారు.  ఎండీఎస్‌ చదివినవారు కూడా దీనికి అప్లయ్‌ చేశారు. కానీ వారెవరికీ అదనపు మార్కులు కేటాయించలేదు. 


ఇటువంటి విచిత్రాలన్నీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో చోటు చేసుకుంటున్నాయి. అడ్డగోలుగా నిబంధనలు మారుస్తూ తమకిష్టం వచ్చినవారికి పోస్టులు కేటాయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నోటిఫికేషన్‌ వెలువరించేటపుడు, మెరిట్‌ లిస్టులు ప్రకటించేటపుడు లేని నిబంధనలు నియామకపత్రం ఇచ్చేటపుడు ఎందుకు వస్తున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కొందరు సంబంధిత అధికారులకు, లోకాయుక్తను కూడా సంప్రదించారు.


గుంటూరు(సంగడిగుంట), జనవరి7: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పలు నియామకాల్లో అడ్డగోలుగా నిబంధనలు మారుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  అధికార పార్టీ నేతల సిఫార్సులు తెచ్చినవారికోసం, అడిగినంత ఇచ్చివారికోసం  రాత్రికి రాత్రే నిబంధనలు మారిపోతున్నాయన అభ్యర్థులు అంటున్నారు. గత ఏడాది అక్టోబర్‌ 1వ తేది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఆసుపత్రుల్లోని 49 విభాగాల్లో వివిధ హోదాలలో పనిచేయడానికి 160 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీనిలో వైద్యులు, మెడికల్‌ ఆఫీసర్లు, టెక్నీషియన్లు, స్టాఫ్‌ నర్సులు ఇలా అనేక విభాగాలకు చెందిన వారు ఉన్నారు. నోటిఫికేషన్‌లో అభ్యర్థుల విద్యార్హత, అనుభవం ప్రాతిపదికన నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. నవంబర్‌ 20వ తేది మొదటి మెరిట్‌ లిస్టును విడుదల చేశారు. దానిపై వందల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పట్టించుకోకుండా ఫైనల్‌ లిస్టును కూడా విడుదల చేశారు. ఇందులో అకస్మాత్తుగా కొన్నిపేర్లు తెరపైకి వచ్చాయి. దీనిపై అభ్యంతరం తెలిపిన వారు వివరణ కోరగా ఆర్‌వోఆర్‌ (రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌) అమలు చేశామని ఒక్కముక్కలో తేల్చేచారు. నోటిఫికేషన్‌లో ఐదవ నిబంధనలో సెలక్షన్‌ ప్రక్రియ కేవలం మెరిట్‌, అనుభవం ఆధారంగానే నియామకాలు చేపడతామని స్పష్టంగా ఉంది. కాని ఆర్‌వోఆర్‌ అమలు చేశారు. 


గైనకాలజీ విభాగంలో ఎంబీబీఎస్‌, ఎండీ గైనిక్‌ చదివిన మూడు పోస్టుల కోసం అభ్యర్థులను దరఖాస్తులకు ఆహ్వానించారు. దీనిలో మొదటిలిస్టులో లేని పేరు అకస్మాత్తుగా మూడో లిస్టులో మొదటి పేరుగా వచ్చింది. మొదటి లిస్టులో ఆర్‌వోఆర్‌ తెలియదా.. అనంతరం లేదా.. మూడో లిస్టుకే ఆర్‌వోఆర్‌ గుర్తొచ్చిందా.. లేక ఇంకేమైనా జరిగిందా..? అనేది ఆ దేవుడికే తెలియాలి...!


నిబంధనలు ఇలా..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగాల్లోనూ ఆర్‌వోఆర్‌ అమలు చేయవచ్చు. అయితే ప్రకటించిన పోస్టులు నాలుగు కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే దానిని అమలు చేయవచ్చు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ 49 విభాగాలకు పోస్టులు పిలిచింది. ఇందులో నాలుగు పోస్టులు పైన ఉన్నవి ఆరు విభాగాలు మాత్రమే. కానీ అన్ని విభాగాల్లోనూ అమలు చేసినట్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినవారికి నోటిమాటగా చెబుతున్నారు. 


ఒక్క పోస్టుకి నాన్‌లోకల్‌ రిజర్వేషనా..?

వైద్య విభాగంలో నియామకాల పరిస్థితి అలా ఉంటే సోషల్‌ వర్కర్ల పోస్టుల నియామకం మరీ విచిత్రంగా ఉంది. దీనిలో ఒక్క పోస్టుకే దరఖాస్తులు ఆహ్వానించారు. దానిని నాన్‌లోకల్‌కు కేటాయుంచారు. సాధారణంగా రిజర్వేషన్ల ప్రక్రియలో 15 శాతం పోస్టులను నాన్‌లోకల్‌ విభాగంలోని వారికి కేటాయిస్తారు.  అయితే ఒకే పోస్టు ఉంటే అది నాన్‌లోకల్‌ ఎలా వెళుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు.  పోనీ ఆ నాన్‌లోకల్‌ వ్యక్తి నియామకంలోనైనా నిబంధనలు పాటించారా అంటే అదీ లేదు. సాధారణంగా ఇటువంటి ఉద్యోగాల్లో అదే వృత్తిలో ఇంతకుముందు పనిచేసిన అనుభవం ఉంటే అదనపు మార్కులు కేటాయిస్తారు. కానీ ఆ నియామకం పొందిన వ్యక్తి ఎన్‌టీసీపీ(నేషనల్‌ టుబాకో కంట్రోల్‌ ప్రోగ్రామ్‌)లో ఎక్కడా పనిచేసిన దాఖలాలు లేవు. అతను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ చిరుద్యోగి. అతను చేస్తున్న ఉద్యోగానికి ఇప్పుడు నియామకం చేపట్టిన ఉద్యోగానికి సంబంధం లేదు. కానీ 20 అర్హత మార్కులు పెంచడంతో అతను మొదటి స్థానంలోకి వెళ్లిపోయాడు. దీనికి తోడు యూనివర్సిటీలు ఏటా స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఫర్‌ సెంట్రిఫ్యూజన్‌ అనేదానికి పరీక్షలు పెడతాయి. దాని మార్కులు కూడా దీనిలో అదనపు మార్కులుగా కేటాయిస్తారు. ఇది సుమారుగా 3వేల మార్కులకు 4 సెమిస్టర్లలో జరుగుతోంది. దీనిలో ఇతనికేమో మార్కులు తీసుకున్నారు. మిగిలిన వారికేమో గ్రేడులు తీసుకున్నారు. ఇదో గందరగోళం. దీంతో ఈ నియామకంలో కూడా అవకతవకలు జరిపాయన్న ఆరోపణలు వస్తున్నాయి. 


అదనపు చదువే నేరమా...?

పై రెండు అలా ఉంటే దంత వైద్యుల కోసం పిలిచిన నోటిఫికేషన్‌ గందరగోళంగా ఉంది. అభ్యర్భులు బీడీఎస్‌ చదివి ఉండాలని నిబంధన పెట్టారు. సాధారణంగా అదనపు చదువు ఉంటే అదనపు పాయింట్లు కేటాయిస్తారు. దీని ప్రకారం ఎండీఎస్‌ చదివినవారు కూడా దీనికి అప్లయ్‌ చేశారు. కానీ వారెవరికీ అదనపు మార్కులు కేటాయించలేదు. వీటితో పాటు డైక్‌ విభాగంలో దేనిలో కూడా ఐదు పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. మొత్తం ఆరు విభాగాలలో 12 పోస్టులు పిలిచారు. కానీ దీంతో ఆర్‌వోఆర్‌ ఎలా అమలు చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. 


కలెక్టర్‌ను ఇరికించే ప్రక్రియ

దీనిపై ఇప్పటికే కొందరు సంబంధిత అధికారులకు, లోకాయుక్తను కూడా సంప్రదించారు. వారి ద్వారా జిల్లా వైద్యఆరోగ్య శాఖకు నోటీసులు ఇస్తే అన్నింటికీ ఒకటే సమాధానం... జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు అని..! వాస్తవానికి జిల్లా కలెక్టర్‌ స్థాయి అధికారి ప్రతి దానిని నియమ నిబంధనల ప్రకారం జరిగిందా అని చూసే సమయం ఉండదు. సంబంధిత శాఖ ఉద్యోగులే నిబంధనలు చూసుకొని కలెక్టర్‌ అనుమతి పొందుతారు. కానీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని నర్సుల నియామకం ప్రక్రియలోనూ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నియామకాల్లోనూ కూడా కలెక్టర్‌ నిర్ణయం అంటూ ఆ పదవిని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈ నియామకాల్లో పూర్తిస్థాయిలో నిబంధనలు అమలు చేసి అర్హులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. 

Updated Date - 2021-01-08T04:40:12+05:30 IST