వచ్చే ఏడాది నుంచి మెడికల్‌ కళాశాలలో అడ్మిషన్లు

ABN , First Publish Date - 2022-05-21T06:32:39+05:30 IST

వచ్చే ఏడాది నుంచి మెడికల్‌ కళాశాలలో అడ్మిషన్లు

వచ్చే ఏడాది నుంచి మెడికల్‌ కళాశాలలో అడ్మిషన్లు
కలెక్టర్‌ రంజిత్‌ బాషాకు సమస్యలు చెబుతున్న ఆసుపత్రి ఉద్యోగులు

మెడికల్‌ కాలేజీకి అనుసంధానంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి

అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్‌ రంజిత్‌ బాషా


మచిలీపట్నం టౌన్‌, మే 20 : వచ్చే ఏడాది మెడికల్‌ కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతాయని కలెక్టర్‌ రంజిత్‌ బాషా తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమావేశ హాల్లో శుక్రవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్‌ అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఆరు నెలల్లో మెడికల్‌ కళాశాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానం చేస్తామన్నారు. కళాశాల భవనాల నిర్మాణాలు పూర్తికాగానే, అడ్మిషన్లు ప్రారంభిస్తామని చెప్పారు. ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్యం అందించాలన్నారు. రోగులు మృతిచెందినపుడు వారి మృతదేహాలను ఇళ్లకు తరలించే సమయంలో, రోగులతో వచ్చిన కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకూడదన్నారు. ప్రైవేట్‌ వాహనదారులు ఎక్కువ చార్జీలు వసూలు చేయకుండా రవాణా శాఖ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌, డీఎస్పీతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. బస్టాండ్‌ల వద్ద ఏ విధంగా ఆటోలకు సీరియల్‌ నెంబర్‌ ఇస్తారో, అలాగే ప్రైవేట్‌ అంబులెన్సులకు ఇచ్చి రోగుల రాకపోకలను క్రమబద్దీకరించాలని చెప్పారు. ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎన్‌ఎంవోలు, ఓపీ రిజిస్ర్టేషన్‌ సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకోవాలని నిర్ణయించారు. ఏసీలకు మరమ్మతులు, ఎలక్ర్టికల్‌ మెయింటినెన్స్‌ నిధులు, ఆరోగ్యశ్రీ వార్డు ఇన్‌డక్షన్‌ రూమ్‌, ఆర్థో ఓపీలకు అవసరమైన మరమ్మతులు చేయించేందుకు, టీబీ వార్డులో హెచ్‌డీఎస్‌ నిధులతో దోమల మెష్‌లు ఏర్పాటు చేసేందుకు, అంబులెన్స్‌ మరమ్మతులకు ఆమోదం తెలిపారు. బ్లడ్‌ బ్యాంకు కార్యకలాపాలపై కలెక్టర్‌ ఆరా తీశారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలను తనిఖీ చేశారు. టాయిలెట్లను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పేర్ని నాని, సింహాద్రి రమేశ్‌బాబు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జి.గీతాభాయి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కె.జ్యోతిర్మయి, మునిసిపల్‌ కమిషనర్‌ చంద్రయ్య, వైద్య సేవల అభివృద్ధి కార్పొరేషన్‌ ఎస్‌ఈ అంకమ్మ చౌదరి, ఈఈ డి.రవీంద్రబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.జయకుమార్‌, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సీహెచ్‌ రవీంద్ర, సత్యప్రకాష్‌, గాంధీ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T06:32:39+05:30 IST