కలగా వైద్యకళాశాల

ABN , First Publish Date - 2022-01-18T06:25:56+05:30 IST

వైసీపీ ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదు. సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరిస్తోంది.

కలగా వైద్యకళాశాల
మెడికల్‌ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సురేష్‌, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు కుందురు నాగార్జునరెడ్డి (ఫైల్‌)

శంకుస్థాపనకే పరిమితమైన పాలకుల ప్రకటనలు

పేదలకు దూరమవుతున్న కార్పొరేట్‌ వైద్యం 

మార్కాపురం, జనవరి 17:  వైసీపీ ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదు. సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరిస్తోంది. కనీసం అత్యవసరమైన వాటినీ నిర్లక్ష్యం చేస్తోంది. అందుకు మార్కాపురం వైద్య కళాశాలనే నిదర్శనం. మార్కాపురం మండలం రాయవరం వద్ద మంజూరు చేసిన వైద్య కళాశాల నిర్మాణం కలగానే మిగిలిపోయింది. ఇక్కడ వైద్యకళాశాల నిర్మాణానికి వర్చువల్‌ విధానంలో గతేడాది మే 31న  సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు వైద్య రంగంలో దేశ చరిత్రలో ఒకేసారి రూ.8వేల కోట్లతో 16 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయడం గర్వించదగిన విషయంగా పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేలా భవన నిర్మాణాలు పూర్తి చేస్తామని పాలకులు వెల్లడించారు. పేదవాడికి కార్పొరేట్‌ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువ చ్చేందుకు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిం చారు. కానీ అందుకు సంబంధించిన పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.


51 ఎకరాల స్థల సేకరణ

రాయవరం గ్రామ పరిధిలో వైద్య కళాశాల ఏర్పాటుకు తొలుత 41 ఎకరాల భూమిని సేకరించారు. తర్వాత వైద్య, ఆరోగ్య శాఖాధికారుల పరిశీలనలు, వారి నివేదిక ఆధారంగా మరో పది ఎకరాల భూమిని అదనంగా సేకరించారు. రెవెన్యూ అధికారులు అందుకు సంబంధించిన 51 ఎకరాల భూమిని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించారు.


మొదలుకాని నిర్మాణ పనులు

రాయవరం వద్ద వైద్య కళాశాలకు సంబంధించిన నిర్మాణ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. టెండర్ల ప్రక్రియలో వైద్య కళాశాల నిర్మాణాన్ని మెగా నిర్మాణ సంస్థ దక్కించుకుంది. ఇది జరిగి ఆరునెలలు పూర్తయింది. రాష్ట్రంలో వైద్య కళాశాల నిర్మాణానికి సంబంధించి పలు బ్యాంకులతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం మార్కాపురంలో కళాశాల నిర్మాణానికి సంబంధించి ఒప్పందంలో కొంత ఆలస్యం చేసింది. కానీ ప్రస్తుతం బ్యాంక్‌ ఒప్పందం కూడా పూర్తయింది. జనవరి మొదటివారంలో పర్యటనకు వచ్చిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్‌ మెడికల్‌ కళాశాల స్థలాన్ని సందర్శించారు. దీనిని ఎందుకు ప్రారంభించలేదంటూ అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వానికీ బ్యాంకు మధ్య ఒప్పందం పూర్తయినట్లు వెల్లడించారు. అయినా నేటికీ కళాశాల నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు.


Updated Date - 2022-01-18T06:25:56+05:30 IST