వైద్యమందక రోడ్డుపైనే ప్రసవం: శిశువు మృతి

ABN , First Publish Date - 2021-07-24T06:35:13+05:30 IST

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణి రోడ్డుపైనే ప్రసవించింది. సరైన వైద్యం అందక పోవడంతో శిశువు మృతి చెందింది.కేవీబీపురం మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది.

వైద్యమందక రోడ్డుపైనే ప్రసవం: శిశువు మృతి
నడి రోడ్డుపై ప్రసవించి సృహ తప్పిన సుబ్బమ్మ

కేవీబీపురం జూలై 23: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణి రోడ్డుపైనే ప్రసవించింది. సరైన వైద్యం అందక పోవడంతో శిశువు మృతి చెందింది.కేవీబీపురం మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ సంఘటన  జరిగింది. గోపాలకృష్ణాపురం గిరిజన కాలనీకి చెందిన సుబ్బమ్మ(28)కు శుక్రవారం తెల్లవారుజామున ప్రసవనొప్పులు వచ్చాయి. అయితే కోవనూరు పీహెచ్‌సీ పరిధిలోని వైద్యసిబ్బంది అసలు పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వం తల్లీబిడ్డ క్షేమం పేరిట ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అయితే అవి ఏవీ సుబ్బమ్మను ఆదుకోలేక పోయాయి. కనీసం ఈ రోజు ప్రసవించే అవకాశం ఉంది.. మీరు ఆస్పత్రికి వచ్చి ఉండండని వైద్యులు ముందుగానే తేదీలు చెబుతారు. అవి ఏవి కూడా వైద్యసిబ్బంది తెలపలేదు. అంతే కాకుండా మెయిన్‌ రోడ్డుకు ఈకాలనీ రెండు కిలోమీటర్ల దూరంలో ఉం టుంది. ఆ రోడ్డు అధ్వానంగా ఉండడంతో వాహనాలు ప్రయాణించవు. నొప్పులు రావడంతో సుబ్బమ్మను బంధువులు చేతులమీద తీసుకుని వస్తూ 108కి ఫోన్‌ చేశారు. రోడ్డ మధ్యలోకి వచ్చేసరికి నొప్పులు ఎక్కువై ఆ గతుకుల రోడ్డుపైనే ఆమె ప్రసవించింది. 108 వాహనంలో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించగాపరీక్షించిన వైద్యులు బిడ్డ మరణించినట్లు ధ్రువీకరించారు. తల్లికి వైద్యం నిర్వహించారు. కోవనూరు పీహెచ్‌సీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-07-24T06:35:13+05:30 IST