ఆరోగ్య పథకాలు నిర్వీర్యం

ABN , First Publish Date - 2022-01-21T05:04:47+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యంతో జాతీయ ఆరోగ్య పథకాలు నిర్వీర్యమవుతున్నాయి. అధికారుల అసమర్ధత కారణంగా ఆయా పథకాల అమలు ప్రశ్నార్థకమైంది.

ఆరోగ్య పథకాలు నిర్వీర్యం
జీజీహెచ్‌లోని ప్రసూతి వార్డు

ప్రభుత్వాసుపత్రుల్లో తగ్గుతున్న ప్రసవాలు

ప్రైవేటు వైద్యశాలల్లోనే ఎక్కువ 

కోట్లు ఖర్చుచేస్తున్నా ఇళ్లలో కాన్పులు ఆపలేరా..?


నెల్లూరు(వైద్యం), జనవరి 20 : ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యంతో జాతీయ ఆరోగ్య పథకాలు నిర్వీర్యమవుతున్నాయి. అధికారుల అసమర్ధత కారణంగా ఆయా పథకాల అమలు ప్రశ్నార్థకమైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు బాగా తగ్గుతున్నాయి. వైద్యశాలల నిర్వహణకు ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రసవాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే సురక్షితమైన ప్రసవాలు జరిగేలా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇస్తున్నా, అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వైద్య ఆరోగ్యశాఖలో గ్రామ స్థాయిలో ఏఎన్‌ఎం, ఆశాల వంటి పెద్ద నెట్‌ వర్క్‌ ఉన్నా, ఎక్కువ మంది ప్రైవేట్‌ ఆసుపత్రులవైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అపహాస్యం పాలవుతున్నాయి. మాతా,శిశు మరణాలు అరికట్టేందుకు గృహాల్లో కాన్పుల నివారణకు ఆసుపత్రులలోనే కాన్పులు జరగాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేయించుకుంటే రూ.1000 ప్రోత్సాహక నగదు అందజేస్తారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకు దశల వారీ పరీక్షలకు మాతా, శిశు సంరక్షణ (ఎంసీపీ) కార్డులు అందజేస్తారు. దీని ప్రకారం సుఖప్రసవానికి వైద్యశాఖాధికారులు కృషి చేయాలి. అయితే అడుగడుగునా డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రసవాలు ఆశించినంతగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగడంలేదు.


7 వేల ప్రసవాలే నిర్ధారణ 

ప్రైవేటు ఆసుపత్రులలో 2021-22 సంవత్సరానికి డిసెంబరు మొదటివారం వరకు  28,218 ప్రసవాలు జరిగాయి.  ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం కేవలం 7,475 మాత్రమే ప్రసవాలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 75  పీ హెచ్‌సీలు, 29 వరకు 24 గంటల ఆసుపత్రులు, 15 సీహెచ్‌సీలు ఉన్నాయి. వీటితో పాటు జీజీహెచ్‌, ఒక జిల్లా ఆసుపత్రి రెండు ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. ఇంత పెద్ద నెట్‌ వర్క్‌ ఉన్నా వైద్యులు మాత్రం ప్రసవాలు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.


తగ్గని గృహ ప్రసవాలు 

గృహాల్లో ప్రసవాలు అరికట్టాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పడుతున్నాయి. 2021- 22  ఏడాదిలో 16 ప్రస వాలు గృహాల్లో జరిగాయంటే వైద్యశాఖ పనితీరును ప్రశ్నిస్తున్నది. ఆసుపత్రుల్లో ప్రసవాలపై గ్రామీణస్థాయిలో పూ ర్తిస్థాయి ప్రచారం జరగకపోవడతో ఈ పరిస్థితి నెల కొంది. అత్యవసర ప్రసవ పరిస్థితిలో 108 అంబులెన్స్‌ అం దుబాటులో ఉంది. ఆసుపత్రికి తక్షణం చేర్చి ప్రసవం అ యిన వెంటనే తల్లీబిడ్డలను ఇంటికి చేర్చే అవకాశం కూడా ఇందులో కల్పించారు. అత్యవసర పరిస్థితిలో సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసే వైద్య నిపుణులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ప్రసవాలు నామమాత్రంగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చుట్టుపక్కల గ్రామాలలో నమ్మకం కలిగించాల్సి ఉంది. ఆయా గ్రామాలలో ఎవరు గర్భం దాల్చారు గుర్తించి వారు సుఖప్రసవం ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేలా చూడాలి. 



ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా చూస్తున్నాం

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎక్కువగా ప్రసవాలు జరిగేలా చూస్తున్నాం ఇందుకుగాను వైద్య సిబ్బందికి సూచనలిస్తున్నాం. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు గర్భిణీలను గుర్తించి, వారికి ఎప్పటికప్పుడు వైద్యసేవలు అందిలా కృషిచేయాలని చెప్పాం. 

- డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి



Updated Date - 2022-01-21T05:04:47+05:30 IST