Pakistan: ఇంతకుమించిన దారుణం మరోటి ఉంటుందా?.. తండ్రి వయసున్న వ్యక్తితో పెళ్లికి నిరాకరించిందని మెడిసిన్ విద్యార్థినికి..

ABN , First Publish Date - 2022-08-20T03:16:39+05:30 IST

తన తండ్రి వయసున్న వ్యక్తితో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తుంటే.. నిరాకరించిందన్న కారణంతో మెడిసిన్ విద్యార్థినిని

Pakistan: ఇంతకుమించిన దారుణం మరోటి ఉంటుందా?.. తండ్రి వయసున్న వ్యక్తితో పెళ్లికి నిరాకరించిందని మెడిసిన్ విద్యార్థినికి..

లాహోర్: తన తండ్రి వయసున్న వ్యక్తితో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తుంటే.. నిరాకరించిందన్న కారణంతో మెడిసిన్ విద్యార్థినిని చిత్రహింసలకు గురిచేశారు. పాకిస్థాన్‌లో జరిగిందీ ఘటన. ఆమెను చిత్రహింసలకు గురిచేయడంతోపాటు లైంగిక వేధింపులకు గురిచేసిన 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ ఎదుట నిందితులను ప్రవేశపెట్టడానికి కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో కొందరు లాయర్లు ప్రధాన నిందితుడితోపాటు ఇతర నిందితులపై దాడిచేసి ఈడ్చి పడేశారు. ఆగ్రహంతో వారిపైకి బూట్లు విసిరారు.


పోలీసులు సకాలంలో స్పందించి ప్రధాన నిందితుడు షేక్ డానిష్‌ను వారి నుంచి కాపాడి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇంటరాగేషన్ కోసం కోర్టు అతడిని రెండు రోజుల పోలీసుల కస్టడీకి అప్పగించింది. లాహార్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని ఫైసలాబాద్‌లో బాధితురాలు ఖతీజా మహమూద్‌పై ఈ దాడి జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన డానిష్ ఓ పారిశ్రామికవేత్త. తనను పెళ్లాడేందుకు నిరాకరించిన మెడికల్ స్టూడెంట్‌ను చిత్రహింసలకు గురిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో గురువారం వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. బాధితురాలిని నిందితులు ఈడ్చి పడేసి దాడి చేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకంటే దారుణం ఏంటంటే.. ఆమెకు గుండు గీసి, కనుబొమలు షేవ్ చేశారు. అంతేకాదు, ప్రధాన నిందితుడి కుమార్తె చెప్పులను ఆమెతో నాకించారు. 


ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు, అతడి కుమార్తె సహా 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి ఇద్దరు సోదరులు యూకే, ఆస్ట్రేలియాలో ఉన్నారు. దీంతో ఆమె వృద్ధురాలైన తల్లిని చూసుకుంటూ దంతవైద్యంలో పైనల్ ఇయర్ చదువుతున్నారు. ఆమెకు తన క్లాస్‌మేట్ అయిన అన్నాతో కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ఆమె తండ్రే ప్రధాన నిందితుడైన షేక్ డానిష్. బాధిత విద్యార్థిని వద్ద అతడు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ఆమె నిరాకరించింది. 


డానిష్ వయసు తన తండ్రి వయసుతో సమానమని, అతడిని తాను పెళ్లి చేసుకోలేనని అన్నాతో తాను చెప్పానని ఖతీజా గుర్తు చేసుకున్నారు. ఆమె ఆ మాట వినగానే తనపై చిందులేదని గుర్తు చేసుకున్నారు. ఈ నెల 8న ఆమె సోదరుడు యూకే నుంచి రాగా డానిష్ మరో 14 మంది వారింటికి వచ్చారు. ఖతీజాను తనకిచ్చి పెళ్లి చేయమని బలవంతం చేశారు. అందుకు అతడు కూడా నిరాకరించడంతో ఇద్దరినీ చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం వారిని డేనిష్ తన ఇంటికి తీసుకెళ్లి మరోమారు దాడిచేశారు. అంతేకాదు, ఖతీజాతో షూలు నాకించారు. ఆమె తల, కనుబొమలను షేవ్ చేశారు. ఈ మొత్తం ఘటనను వారు వీడియో తీశారు. అంతేకాదు, ఖతీజాను డేనిష్ ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించినట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.  


విషయం వెలుగులోకి వచ్చాక పాక్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.  "Justiceforkhatija" హ్యాష్‌ట్యాగ్‌తో పాక్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. డానిష్ సహా నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2022-08-20T03:16:39+05:30 IST