అగమ్యగోచరంగా ఉక్రెయిన్ వైద్యవిద్యార్థుల పరిస్థితి
స్థానిక కళాశాలల్లో సీట్లు కేటాయించాలని కోరుతున్న స్టూడెంట్స్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మన వైద్యవిద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. ఉన్నతవిద్య నిమిత్తం ఉక్రెయిన్ వెళ్లి అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఇటీవల ఎన్నో కష్టనష్టాలకోర్చి స్వదేశం చేరుకున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. వాళ్లు ఇప్పుడు అక్కడికి వెళ్లడం కుదరదు. అందువల్ల ఇటీవల సీఎం జగన్‌ను కలిసి తమ పరిస్థితి విన్నవించారు. స్థానిక కళాశాలల్లో తమకు సీట్లు కేటాయించేలా కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని స్థానికంగా సీట్లు కేటాయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యవిద్యార్థుల పరిస్థితిపై వారి అభిప్రాయాలు..
స్థానికంగా అవకాశం కల్పించాలి
తొండంగి, మార్చి 27: ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా స్థానికంగా మాకు వైద్యవిద్య అభ్యసించేందుకు అవకాశం కల్పించాలి. ఇప్పటికే నాలుగేళ్ల చదువు పూర్తయ్యింది. మరో రెండేళ్లపాటు చదివితే డిగ్రీ చేతికి అందుతుంది. యుద్ధం కొనసాగుతున్నందున అక్కడికి వెళ్లలేం. స్థానికంగా చదివేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలి.
-వైద్య విద్యార్థిని సూజన్, తొండంగి
ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి
ఆలమూరు, మార్చి 27: ఉక్రెయిన్ నుంచి ప్రస్తుతం ఆన్లైన్ క్లాసు లు నిర్వహిస్తున్నారు. అక్కడ పరిస్థితి అంతా సక్రమంగా ఉంటే మళ్లీ అక్కడికే వెళ్లి చదువు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇటీవల సీఎం జగన్మోహన్రెడ్డిని ఉక్రెయిన్ విద్యార్థులు అందరం వెళ్లి కలిశాం. అక్కడ తదుపరి పరిస్థితిని బట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
-వైద్యవిద్యార్థిని మెండు పద్మావతి, సంధిపూడి, ఆలమూరు మండలం
మూడు నెలల్లో వైద్య విద్య పూర్తయ్యేది
మూడు నెలలు ఉంటే వైద్య విద్యను పూర్తి చేసుకుని ఉండే వాళ్లం. కష్టపడి చదివి ఫైనల్ ఇయర్‌కు వచ్చాం. ఇంతలోనే యుద్ధం మొదలై మా భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఉక్రెయిన్ దేశం యథాస్థితికి వస్తే చదువు పూర్తి చేసుకునేందుకు అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటున్నాను.
-వైద్య విద్యార్థిని, సత్తి శ్రీదేవి, అనపర్తి
ఎంత కష్టమైనా చదువు పూర్తి చేస్తాం
చదువు పూర్తి చేసుకునేందుకు ఎంత కష్టమైనా ఉక్రెయిన్ వెళ్లి తీరుతాం. ఫైనల్ ఇయర్లో ఉన్నాం కనుక తప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఉంది. అలా అని భారతదేశం కూడా మాకు విద్యను ఇక్కడ పూర్తిచేసుకునేందుకు అవకాశం ఇచ్చినా తిరిగి ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఏ దేశం వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పవు. అందుకే ఎంత కష్టమైనా చదువును పూర్తి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను.
-వైద్య విద్యార్థి సత్తిరెడ్డి, అనపర్తి
స్థానిక కాలేజీలో సీటు కేటాయించాలి
ఉప్పలగుప్తం, మార్చి 27: తన విద్యాభ్యాసానికి అంతరాయం లేకుం డా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాను. ఉక్రెయిన్నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారంతా ఇటీవల సీఎంను కలిసి రాష్ట్రంలోని కాలేజీల్లో తమకు సీట్లు ఇప్పించాలని కోరాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెడికల్ కాలేజీల్లో సీట్టు పెంచేలా ఏర్పాటు చేయాలని విన్నవించాం.
-వైద్య విద్యార్థిని సలాది భవ్య, విలసవిల్లి, ఉప్పలగుప్తం మండలం