ఔషధాల కోసం ప్రజల గగ్గోలు

Published: Sun, 27 Mar 2022 00:37:18 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఔషధాల కోసం ప్రజల గగ్గోలు

తగ్గిపోయిన ఫార్మా సరఫరా..

రష్యాపై ‘స్విఫ్ట్‌’ ఎఫెక్ట్‌ 


మాస్కో/కీవ్‌, మార్చి 26: ‘‘సార్‌.. ఒక్క ఇన్సూలిన్‌ క్యాట్రిడ్జ్‌ ఉంటే ఇవ్వండి ప్లీజ్‌..!’’.. ‘‘సార్‌.. మా అమ్మకు డిప్రెషన్‌ సమస్య. రోజూ మాత్రలు వాడాలి. పారొగ్జెటిన్‌ లేదా అనాఫ్రానిల్‌ ఒక్క స్ట్రిప్‌ ఇప్పించండి..!’’.. ‘‘మా ఆవిడ థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతోంది. రోజూ మాత్రలు వాడాలి. యూథైరోక్స్‌ మాత్ర కావాలి. ధర ఎంతైనా ఫర్వాలేదు..!’’.. ఇవీ ఇప్పుడు రష్యాలోని దాదాపు అన్ని ఫార్మసీల్లో వినిపిస్తున్న విజ్ఞప్తులు. రష్యా రాజధాని మాస్కో నగరంలోనూ పౌరులు ఔషధాల కోసం ఫార్మసీల వద్ద క్యూకట్టారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణ నేపథ్యంలో రష్యాపై ఆంక్షల ఫలితమిది. ముఖ్యంగా రష్యా బ్యాంకులను అమెరికా ‘స్విఫ్ట్‌’ నగదు బదిలీ వ్యవస్థ పరిధి నుంచి తప్పించడంతో ఈ దుస్థితి నెలకొంది.


సరఫరాపై తీవ్ర ప్రభావం

రష్యా నుంచి తప్పుకొంటామని ఇప్పటికే పదికి పైగా దిగ్గజ ఫార్మా సంస్థలు ప్రకటించాయి. అయితే.. తుది నిర్ణయం తీసుకునేవరకు ప్రాణాలను నిలిపే ఔషధాలు, వ్యాక్సిన్ల సరఫరాను కొనసాగిస్తామని పేర్కొన్నాయి. కానీ, ఫార్మా కంపెనీలకు చెల్లింపుల్లో స్విఫ్ట్‌ లేకపోవడం ఇప్పుడు రష్యాలో ఔషధాల కొరతకు ప్రధాన కారణంగా మారింది. దీనికి తోడు.. దిగ్గజ లాజిస్టిక్స్‌ సంస్థ ‘మైర్స్క్‌’ కార్గో రవాణా సేవలను నిలిపివేయడం ఔషధాల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రష్యాకు ఔషధాలను సరఫరా చేసే అమెరికా కంపెనీ ‘లిల్లీ’, స్విస్‌ ఫార్మా దిగ్గజం ‘నోవార్టిస్‌’, ఫ్రెంచ్‌ కంపెనీ సనోఫీతోపాటు.. జర్మన్‌ కంపెనీలు అమెరికా డాలర్లు లేదా యూరోల్లో వ్యాపా రం చేస్తాయి. స్విఫ్ట్‌ సేవలు రద్దవ్వడంతో.. వాటికి చెల్లింపులు సాధ్యం కాక.. సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. 


‘వార్చీ డాట్‌ ఆర్‌ఎఫ్‌’ అనే వైద్య నిపుణుల కమ్యూనిటీ నిర్వహించిన ఓ సర్వేలో.. ఇప్పుడు రష్యాలో 80 రకాల ఔషధాల కొరత ఉన్న ట్లు వెల్లడైంది. ముఖ్యంగా చిన్నారుల్లో వాపు, జీర్ణకోశ వ్యాధులకు వినియోగించే న్యూరోఫెన్‌, పెద్దల్లో జీర్ణకోశ సమస్యలకు ఉపయోగించే ఉర్సోఫాల్క్‌, మూర్చ వ్యాధులకు సంబంధించిన ఫిన్లెప్సిన్‌, డెపాకైన్‌.. డిప్రెషన్‌ నివారణకు వాడే పారొగ్జెటిన్‌, అనాఫ్రనిల్‌, మధుమేహుల్లో చక్కెర శాతాన్ని నియంత్రించే ఇన్సూలిన్‌లు, థైరాయిడ్‌ రోగులకు వినియోగించే ఎల్‌-థైరోక్సిన్‌, యూథైరాక్స్‌ వంటి ఔషధాలకు తీవ్ర కొరత నెలకొంది. ఇన్సూలిన్‌ క్యాట్రిడ్జ్‌ల ధరలు 2,400 రూబుల్స్‌ నుంచి 20ు పెరిగి.. 2,700 రూబుల్స్‌కు చేరుకున్నాయి. మిగతా ఔషధాల ధరలూ 20ు ఆపై న ఎగబాకాయి.


వార్సాలో బైడెన్‌.. యుద్ధంపై సమీక్ష

పోలాండ్‌ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ శనివారం వార్సాను సందర్శించారు. పాతికేళ్ల క్రితం అమెరికా సెనేటర్‌గా తాను వార్సాకు వచ్చినప్పుడు రష్యా అభ్యంతరాలు చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. బైడెన్‌తో ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా, రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌ భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులను ఆయనకు వివరించారు. ‘‘మీ స్వేచ్ఛ.. మా బాధ్యత’’ అంటూ బైడెన్‌ వారికి భరోసా ఇచ్చారు. పోలాండ్‌కు చేరుకున్న 20 లక్షల మంది ఉక్రెయిన్‌ శరణార్థులతో బైడెన్‌ మాట్లాడారు. 


రష్యా అధినేత పుతిన్‌ ఓ కసాయి అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అటు ఖతార్‌ రాజధాని దోహాలో జరుగుతున్న చమురు సరఫరా దేశాల సదస్సులో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఉక్రెయిన్‌లో విద్యుత్తు, చమురు సరఫరాకు ఆయా దేశాలు సహకరించాలని కోరారు. ఆదివారం లాస్‌ ఏంజెల్స్‌లో జరగనున్న ఆస్కార్‌ వేడుకల్లోనూ జెలెన్‌స్కీ వర్చువల్‌గా పాల్గొననున్నట్లు తెలిసింది. ఆయన 2019లో ఉక్రెయిన్‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించక ముందు సినీరంగంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ గౌరవంతోనే ఆయనకు ఆస్కార్‌ వేడుకలో మాట్లాడే అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. 


ఉక్రెయిన్‌లో దాడులు ఉధృతం

ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్‌, డోనెట్స్క్‌, లిసిచాన్స్క్‌, సివిరోడోనెట్స్క్‌, ఖార్కివ్‌ రీజియన్లలో రష్యా శనివారం తన దాడులను ఉధృతం చేసింది. లుహాన్స్క్‌ రీజియన్‌ హైదాయ్‌లో ఫ్యాప్‌-500 మిసైల్స్‌తో జరిపిన దాడిలో ముగ్గురు చనిపోయారు. కీవ్‌ రీజియన్‌లో జరిపిన షెల్లింగ్స్‌లో ముగ్గురు మృతిచెందగా.. 19వ శతాబ్దికి చెందిన ఓ చర్చి ధ్వంసమైంది.  లిసిచాన్స్క్‌, సీవిరోడోనెట్స్క్‌లో.. ఖార్కివ్‌ రీజియన్‌లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి క్షిపణి దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. 16,400 మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్‌ ఆర్మీ తెలిపింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.