పిల్లలకు వైద్యం.. దేవుడి సేవ

ABN , First Publish Date - 2022-07-06T09:53:27+05:30 IST

‘‘ఎంబీబీఎ్‌సలో చేరినప్పుడే పిల్లల వైద్యుడు (పీడియాట్రిక్‌ సర్జన్‌) కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా.

పిల్లలకు వైద్యం.. దేవుడి సేవ

  • ఓపిక ఉంటేనే పీడియాట్రిషియన్‌గా రాణించగలరు.. 
  • అతి కష్టమైన వైద్య విభాగాల్లో ఇది ప్రధానమైనది..
  • అవిభక్త కవలలు వీణావాణిలకు వైద్యం అందించా
  • వైద్యుడిగా 30 ఏళ్లలో 30 వేల శస్త్ర చికిత్సలు చేశా
  • కోలుకున్న కొందరు పిల్లలు ఇప్పటికీ ఫోన్‌ చేస్తారు
  • ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో సౌత్‌ ఇండియా 
  • టాప్‌ పీడియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ నరేంద్రకుమార్‌


వనపర్తి, జూలై 5(ఆంధ్రజ్యోతి): ‘‘ఎంబీబీఎ్‌సలో చేరినప్పుడే పిల్లల వైద్యుడు (పీడియాట్రిక్‌ సర్జన్‌) కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా. వారికి సేవ చేస్తే దేవుడికి చేసినట్లేనని నా భావన. కెరీర్‌లో ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించాను. పిల్లలకు చేసే చికిత్స చాలా సున్నితంగా ఉంటుంది. వారి తల్లిదండ్రులు ఎంతో ఆందోళనకు గురవుతుంటారు. కన్నవారికి ధైర్యం ఉంటే.. ఎంతటి క్లిష్టమైన కేసునైనా పరిష్కరించగలం. నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు అన్నింటికీ పిల్లలే కారణం’’ అని అంటున్నారు దక్షిణ భారత టాప్‌ పీడియాట్రిక్‌ సర్జన్‌గా ఎంపికైన వనపర్తి ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్రకుమార్‌. ఆయనను ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ చేసింది.


ఆంధ్రజ్యోతి: మీ నేపథ్యం, విద్యాభాస్యం ఎక్కడ? ఈ వృత్తిలోకి రావడానికి స్ఫూర్తి ఎవరు?

డాక్టర్‌ నరేంద్రకుమార్‌: మాది ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేట. పదో తరగతి వరకు పట్టాభిపురం హైస్కూల్‌లో చదివా. గుంటూరులోని జేకేసీ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాను. గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ (1978-1983), ఎంఎస్‌ జనరల్‌ సర్జన్‌ (1986-1989) చదివా. 1991-93లో ఉస్మానియా వైద్య కళాశాల నుంచి ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ పూర్తి చేశాను. నేను వైద్య వృత్తిలోకి రావడానికి మా పెద్దన్నయ్య హనుమంతరావు కారణం. ఆర్థోపెడిక్‌ వైద్యుడిగా సేవలందించి గుర్తింపు తెచ్చుకున్నారు.


గతంలో ఎక్కడెక్కడ సేవలందించారు?

ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ పూర్తయిన తర్వాత నిలోఫర్‌ ఆస్పత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కెరీర్‌ ప్రారంభించా. మధ్యలో ఐదేళ్లు వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీ పీడియాట్రిక్‌ సర్జన్‌గా పనిచేశాను.  22 ఏళ్లు నిలోఫర్‌లో వైద్యం అందించా.


అవిభక్త కవలలు వీణావాణిలకు మీరు చికిత్స చేశారు కదా?

వీణావాణిలకు ఐదేళ్లు వైద్యం అందించా. వారిని వేరు చేసేందుకు చాలా ప్రయత్నించాం. సింగపూర్‌ న్యూరో సర్జన్‌ నుంచి కీర్థ్‌గోను సంప్రదించాం. శస్త్రచికిత్స ఖర్చు మొత్తాన్ని భరించేందుకు సింగపూర్‌లో నిధులు సేకరిస్తామని కీర్థ్‌గో తెలిపారు. వీణావాణి తల్లిదండ్రులకు కూడా ఇదే విషయం తెలిపాం. సర్జరీ తర్వాత ఒకరి ప్రాణాలకు హాని ఉండటం, లేదా ఒకరికి మానసిక వైకల్యం సంభవించే ప్రమాదం ఉండడంతో తల్లిదండ్రులు ముందుకు రాలేదు. 


ఇప్పటివరకు ఎన్ని సర్జరీలు చేశారు?

నా 30 ఏళ్ల కెరీర్‌లో 30 వేల సర్జరీలు చేశాను. అందులో క్లిష్టమైనవి చాలా ఉన్నాయి. ఏమాత్రం ఆశల్లేని స్థితిలో తీసుకువచ్చిన వారిని కూడా బతికించడం చాలా సంతోషాన్నిచ్చేది. వేలమంది పిల్లలు చికిత్స విజయవంతంగా చేసుకుని వెళ్తున్నప్పుడు వారి తల్లిదండ్రుల్లో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. 


యువ వైద్యులకు మీరిచ్చే సలహాలు ఏమిటి?

పిల్లల వైద్య నిపుణులకు చాలా ఓపిక అవసరం. పూర్తిగా తల్లిదండ్రుల అంగీకారం, నమ్మకం మీద పిల్లలకు వైద్యం ఆధారపడి ఉంటుంది. పెద్దలకు వైద్యం చేస్తే దాని ఫలితం తెలియడానికి 24 గంటల సమయం పడుతుంది. కానీ, పిల్లలకు వైద్యం చేస్తే గంటలోపే ఫలితం తెలిసిపోతుంది. సర్జరీలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 


ఆ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులు.. ఇప్పటికీ ఫోన్‌ చేస్తారు

నాలుగేళ్ల బాబుకు ఊపిరితిత్తుల్లో పసరు పేరుకుని ఆరోగ్యం విషమించింది. చాలా ఆస్పత్రులు తిరిగిన తర్వాత తల్లిదండ్రులు నా దగ్గరకు తెచ్చారు. అప్పటికే బాబు శరీరం అంతా చల్లబడి.. హృదయ స్పందన ఆగిపోయింది. ఆ రోజు ఆదివారం కావడంతో నా భార్యతో సినిమాకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాం. కానీ, దాన్ని రద్దు చేసుకుని బాబుకు చికిత్స అందించా. అతడు బతికాడు. నా వృత్తి జీవితంలో ఇదొక అద్భుతమని చెబుతాను. ప్రస్తుతం ఆ బాబు ప్రభుత్వ ఉద్యోగి. ఇది జరిగి 20 ఏళ్లు. అతడు ప్రతి పుట్టిన రోజుకు నాకు ఫోన్‌ చేస్తాడు. ధన్యవాదాలు చెబుతాడు. మరో అమ్మాయి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు వీపు భాగంలో కణితితో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. సర్జరీ చేసి బతికించాను. నా జీవితంలో ఇది అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స. ప్రస్తుతం అమ్మాయి బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తోంది.

Updated Date - 2022-07-06T09:53:27+05:30 IST