కశ్మీరుకు మందు ‘మన్మోహన్–ముషార్రఫ్‌’ ఫార్ములా!

ABN , First Publish Date - 2022-09-20T06:32:44+05:30 IST

ప్రభాకర్ వెంకటేష్ దేశ్‌పాండే ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్. కశ్మీర్ సంక్షోభానికి పరిష్కారం కోసం మన్మోహన్–ముషార్రఫ్‌ల నాలుగు పాయింట్ల ఫార్ములాను అమలు చేయాలని కోరుతూ...

కశ్మీరుకు మందు ‘మన్మోహన్–ముషార్రఫ్‌’ ఫార్ములా!

ప్రభాకర్ వెంకటేష్ దేశ్‌పాండే ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్. కశ్మీర్ సంక్షోభానికి పరిష్కారం కోసం మన్మోహన్–ముషార్రఫ్‌ల నాలుగు పాయింట్ల ఫార్ములాను అమలు చేయాలని కోరుతూ అతను సుప్రీంకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వాజ్యం వేశాడు. కశ్మీర్ సమస్యకు మిలటరీ పరిష్కారం ఎన్నటికీ ఉండదనీ, గత డెబ్బై ఏళ్లలో పాకిస్థాన్‌తో రెండున్నర యుద్ధాలు జరిగినా ప్రయోజనం లేదనీ అతను వాదించాడు. జస్టిస్ చంద్రచూడ్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఇలాంటి వాదనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంటర్టయిన్ చేయమని చెబుతూ, అతన్ని తప్పుబడుతూ, 50,000 రూపాయల జరిమానా వేసింది. ప్రభాకర్ వెంకటేష్ దేశ్‌పాండే వేసిన పిటిషన్ ప్రజాప్రయోజన వాజ్యం పరిధికి మించినదనీ, విధానాల పరిధిలోకి న్యాయస్థానం ప్రవేశించలేదనీ ఈ ధర్మాసనం అన్నది. ఇలాంటి పిటిషన్ వేసి, న్యాయస్థానం సమయాన్ని వృథా చేసినందుకు పిటిషనర్‌కి జరిమానా విధిస్తున్నామని చెప్పింది. ‘మేము వింటాము, కానీ మాకు సంబంధం లేని విషయాలను విన్నందుకు ఖర్చు ఉంటుంది’ అని చెప్పింది. కశ్మీర్ సమస్య విషయంలో కోర్టుకు సంబంధం లేదని తెలియచేస్తూనే, ఇంకెవరూ ఇలాంటి సాహసం చేయకుండా ఈ జరిమానా విధింపు హెచ్చరించినట్లయ్యింది.


ఈ సందర్భంగా మన్మోహన్–ముషార్రఫ్‌ల నాలుగు అంశాల ఫార్ములా మళ్లీ వెలుగులోకి వచ్చింది. డా. నీలా ఆలీఖాన్ (షేక్ అబ్దుల్లా మనవరాలు), ఏజీ నూరాని, సైఫుద్దీన్ సోజ్, మిర్వైజ్ ఉమర్ ఫరూక్ లాంటి అనేకమంది రాజకీయ, విద్యావేత్తలూ, మత పెద్దలూ అంగీకరించిన ఈ నాలుగు అంశాల ఫార్ములా కశ్మీర్ వివాదానికి సంబంధించి తాత్కాలిక పరిష్కారానికి ఒక దారిని సూచించింది. 1947 నుంచి కశ్మీరు రెండు భాగాలుగా భారత్, పాకిస్థాన్ దేశాల చేత పాలించబడుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు దేశాలూ కశ్మీరును మొత్తంగా తమదని వాదిస్తున్నాయి. ఎన్నో దౌత్యపరమైన ప్రయత్నాలు జరిగాక, ఇరు దేశాల పంటి కింద రాయిగా ఉన్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి నాలుగు అంశాల ఫార్ములాను అప్పటి భారతీయ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, పాకిస్థాన్ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌లు కలిసి ప్రతిపాదించారు. సంతకాలు జరగకుండా ఆగిపోయిన ఈ ఫార్ములా నిజానికి కశ్మీర్ సంక్షోభానికి ఇప్పటి వరకూ వచ్చిన అనేక రాజకీయ పరిష్కారాలలో మేలైనది.


ఈ ఫార్ములా ప్రకారం– 1) ఇరు కశ్మీరు ప్రాంతాల్లోనూ స్వయం ప్రతిపత్తికి లేక స్వయం పాలనకు అవకాశం కల్పించాలి 2) లైన్ ఆఫ్ కంట్రోలుకు అటూ ఇటూ ఉన్న సైన్యాన్ని– ముఖ్యంగా ప్రజలు నివసించే ప్రాంతాలలో– తగ్గించాలి. 3) విభజన రేఖకు ఇరువైపులా ఉన్న ప్రజలు ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు స్వేచ్ఛగా ప్రయాణం చేయగలిగి ఉండాలి. 4) లైన్ ఆఫ్ కంట్రోలుకు ఇరువైపులా రెండు దేశాల పర్యవేక్షణలో కొన్ని యంత్రాంగాలను ఏర్పాటు చేయాలి. టూరిజం, ప్రయాణాలు, తీర్థయాత్రలు, వ్యాపారం, ఆరోగ్యం, చదువు, సంస్కృతి లాంటి సామాజిక ఆర్థిక అంశాలకు రెండు కశ్మీరుల మధ్య అనుమతి ఇవ్వటం వలన– సరిహద్దులూ అధీన రేఖలూ ప్రాముఖ్యం లేకుండా, చిత్రపటంలోని గీతలుగా మిగిలిపోతాయని ఈ ఫార్ములా సూచిస్తుంది. ఈ ఫార్ములా ఉత్తర ఐర్లాండుకూ యునైటెడ్ కింగ్ డమ్‌కూ మధ్య జరిగిన గుడ్ ఫ్రై డే ఒప్పందమంత ప్రాముఖ్యత కలిగినది. ఈ ఫార్ములా అమలులోకి వస్తే ‘ఒక దేశం–రెండు పాలనా వ్యవస్థలు’ అనే సూత్రం కింద హాంకాంగ్ చైనాతో సంబంధం లేకుండా తన స్వతంత్ర ఆర్థిక పాలనా విధానాలను ఏర్పర్చుకొన్నలాంటి సౌలభ్యం కశ్మీరుకు కలుగుతుంది.


రెండు దేశాల పట్టువదలని వైఖరుల వల్ల ఈ ఫార్ములా ఇరు దేశ అధినేతల ఆమోదం పొందకుండా ఆగిపోయింది. అయినప్పటికీ దీని ప్రభావం వల్ల కొంత కాలం సానుకూల పవనాలు వీచాయి. వాజపేయి కాలంలో మొదలైన ఈ ప్రయత్నాలు 2005లో ప్రారంభమైన శ్రీనగర్–ముజఫరాబాద్ బస్సు సర్వీసుతో ఊపందుకున్నాయి. కశ్మీరు ఆర్థిక వ్యవస్థ వెన్ను విరుస్తూ గతంలో రెండు కశ్మీరీల మధ్య మూసుకొనిపోయిన వ్యాపార మార్గాలు మళ్లీ తెరుచుకున్నాయి. బస్ యాత్ర ప్రారంభం అయ్యే ఒక్క రోజు ముందు శ్రీనగర్‌లో బాంబు దాడి జరిగి టూరిజం సెంటరును ధ్వంసం చేసినా కూడా– ఎన్.ఎస్.ఏ సలహాను తోసిపుచ్చి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ బస్ యాత్ర ప్రారంభానికి శ్రీనగర్ వెళ్లి జెండా ఊపారు. పూర్తిగా హింసాప్రయోగం తగ్గిందని చెప్పలేము కానీ రెండు దేశాలు తమ దేశాల్లో ప్రజాస్వామిక వాతావరణాన్ని కొంతవరకు తీసుకొని రాగలిగారు. కొన్ని సార్వత్రిక ఎన్నికలను జరపగలిగారు. అయితే అది ఎన్నో రోజులు కొనసాగలేదు.


భారత కశ్మీర్ వైపు నుంచి చూస్తే– మన్మోహన్, ముషార్రఫ్‌ల ఈ నాలుగు సూత్రాల ఫార్ములాను ఆల్ పార్టీస్ హుర్రియత్ కాన్ఫరెన్స్‌లోని రెండు వర్గాలు వ్యతిరేకించాయి. గతంలో వాగ్దానం చేసినట్లుగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో రిఫరెండం జరగాలని అవి కోరుకుంటున్నాయి. జైల్లో ఉన్న యాసీన్ మాలిక్ నాయకత్వాన నడుస్తున్న జేకేఎల్ఎఫ్– రెండు కశ్మీరులకూ కలిపి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని డిమాండ్ చేస్తుంది. జమ్మూకశ్మీర్ పురాతన పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ –1953 ముందు నాటి పరిస్థితిని కశ్మీరులో పునరుద్ధరించాలని నోటి మాటగా అంటోంది. ఏది ఏమైనా జమ్మూ కశ్మీరులోని అన్ని రాజకీయ పక్షాలు భారత రాజ్యాంగానికి లోబడో, రాజ్యాంగానికి వెలుపలో పరిష్కారం వైపు మొగ్గు చూపుతున్నాయి.


అయితే ఈ ఫార్ములా అమలుకు ప్రధాన అడ్డంకిగా ఉన్నది– రెండు దేశాల భావజాల అహంకారాలు, ఆధిపత్య ఆకాంక్షలు, వాటి వ్యూహాత్మక ఆసక్తులు మాత్రమే. భారతదేశంలో అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు, వామపక్షాలతో సహా, జమ్మూకశ్మీరును తమ ‘అటూట్ అంగ్’ అంటున్నాయి. పాకిస్థాన్ కశ్మీరును తన ‘జుగర్ వీన్’ (కంఠనాళం) అంటోంది. అయితే ముషార్రఫ్ కాలం నుండి నిన్న మొన్నటి ఇమ్రాన్ ఖాన్ వరకూ పాకిస్థాన్ కశ్మీరు విషయంలో తన విధానాన్ని పెద్దగా మార్చుకున్నట్లు ప్రకటించలేదు. 2008 తరువాత రెండేళ్లు కశ్మీరు ప్రజలు శాంతియుత, సృజనాత్మక పోరాటాల్లోకి ఇష్టపూర్వకంగా ప్రయాణం చేశారనే వాస్తవాన్ని మర్చిపోకూడదు. వేలాది ప్రాణాలు పోయి, అనేకమంది అదృశ్యం అయిన తరువాత కూడా కశ్మీర్ ప్రజలు చూపించిన ఈ సమన్వయాన్ని భారత పాలకవర్గాలు గమనించనట్లు నటించాయి. ‘అర్థవంతమైన, దీర్ఘ కాలం మనగలిగే పరిష్కారం కావాలంటే; విశ్వసనీయతను కలగచేసే ఒక ప్రయత్నంగా, న్యూఢిల్లీ తన గడియారాన్ని ఎప్పటికైనా 1953 నాటికి వెనక్కి తిప్పాల్సిందే’ అని కశ్మీర్ రాజకీయ విశ్లేషకులు, స్వయంగా కశ్మీరీ అయిన గౌహర్ గిలానీ అంటారు. పాకిస్థాన్, ఇండియా, కశ్మీరుల దృష్టికోణం నుండి చూస్తే– కశ్మీరుకు సంబంధించి ఏ పరిష్కారం కూడా ఇప్పట్లో సమగ్రంగా ఉండదు. దాన్ని ఇప్పటి పరిస్థితుల్లో వీలైనంత బాగు చేసుకోవటమే తెలివిగల పని. అల్ట్రా నేషనల్ పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చాక కశ్మీర్ సమస్యకు మత ముఖం వచ్చింది. అస్తిత్వం, జాతి, మతం, నేషనాలిటీ అనే బహుళ అస్తిత్వాల కశ్మీర్ పోరాటాన్ని గుర్తించి– భేషజాలు వదిలి సంక్షోభాన్ని నివారించి, అపూర్వమైన మానవ వనరులను కాపాడే ప్రయత్నాలు భారత్, పాకిస్థాన్ దేశాలు చేయాలి.

రమాసుందరి

Updated Date - 2022-09-20T06:32:44+05:30 IST