ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఈ బామ్మ ఎవరో తెలిస్తే..

Sep 19 2021 @ 20:12PM

ఇంటర్న్‌డెస్క్: ఎందరో మహానుభావులు..అందరికీ వందనాలు.. వాగ్గేయకారుడు త్యాగరాజు ఆలపించిన కీర్తనల్లో ఇదీ ఒకటి. అయితే..మీనా మెహతా గురించి తెలుసుకున్న వారెవరికైనా ముందుగా మదిలో మెదిలేది ఈ కీర్తనే. రాజస్థాన్ రాష్ట్రం సూరత్ వాస్తవ్యురాలైన మీనా గురించి తెలుగు వారికి పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి వంటి ఎందరో ప్రముఖులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె సహాయం పొందిన వారు మీనాను ఆప్యాయంగా ‘శానిటరీ ప్యాడ్ల బామ్మ’ అని పిలుస్తుంటారు. మీనా మెహతా గతపదేళ్లుగా మురికివాడల్లో నివసించే బాలికలకు శానిటరీ ప్యాడ్లు పంచుతూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. 

పేదరికం ఎన్నో అవస్థలకు కారణం. అయితే..మురికివాడల్లోని బాలికలు, స్త్రీలు మాత్రం రుతుక్రమంగా కారణంగా కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఓ సందర్భంలో స్లమ్ ఏరియాలో నివసించే ఓ బాలిక ఎదుర్కొన్న కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన మీనా తల్లడిల్లిపోయారు.  ‘‘పదేళ్ల క్రితం నాటి ఘటన ఇది. ఆ రోజు నేను కారులో వెళుతుండగా.. ఓ దారుణమైన దృశ్యం నా కంట పడింది. టీనేజ్‌లో ఉన్న ఓ బాలిక చెత్తకుండీలో దేని కోసమే వెతకడం నాకంట పడింది. కాస్త తరిచి చూస్తే ఆమె చేతిలో వాడిపారేసిన శ్యానిటరీ ప్యాడ్ కనిపించింది. దీన్ని చూసి నేను ఒక్కసారిగా షాకైపోయా. వీటిని ఎందుకు ఏరుతున్నావు అని ఆమెను అడిగా. ఇలా వాడిపారేసి శానిటరీ ప్యాడ్లను నీళ్లలో కిడిగి మళ్లీ వాడుకుంటానని ఆమె చెప్పింది. దీంతో.. నాకు నోట మాట రాలేదు. పేదరికం కారణంగా ఆమె ఎంతటి క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కుంటోందో నాకు అర్థమైంది. నాటి నుంచే నేను మహిళలు, బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు పంచడం ప్రారంభించా’’ అని మీనా ఆ దృశ్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గత పదేళ్లుగా ఆమె నిర్విరామంగా..ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా గతంలో మీనాపై ప్రశంసల వర్షం కురిపించారు. 

25 ఏళ్ల వయస్సు నుంచే సామాజిక సేవలో నిమగ్నమైన మీనా..ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధామూర్తే తనకు స్ఫూర్తి అని చెబుతారు. 2004లో సునామీ సంభవించిన సమయంలో..సుధామూర్తి నాలుగు ట్రక్కుల నిండా శానీటరీ ప్యాడ్లు తీసుకొచ్చి పంచడాన్ని చూశానని ఆమె తెలిపారు. ‘‘సునామీ బాధితులకు ఆహారం, వస్త్రాలు ఇవ్వాలని అందరూ ప్రయత్నిస్తుంటారు. కానీ..నెలసరిలో ఉన్న మహిళల పరిస్థితి ఏమిటి..?’’ అన్న సుధామూర్తి ప్రశ్న తనను కదిలించిందని మీనా పేర్కొన్నారు.  తొలుత..శానిటరీ ప్యాడ్ల పంపిణీకే మీనా ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ..తరువాతి కాలంలో ఆమె ప్యాంటీల పంపిణీ కూడా చేపట్టారు. ప్యాంటీల లేకుండా కేవలం శ్యానిటరీ ప్యాడ్లు పంపిణీ వ్యర్థమని భావించి..వీటి పంపిణీ కూడా చేపట్టానని ఆమె తెలిపారు. నటుడు అక్షయ్ కుమార్‌ను కలిసిన సందర్భంలో ఆమె ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్యాంటీల ప్రాధాన్యం కూడా తెలిసేలా ప్రజల్లో అవగాహన పెంచాలని ఆమె అక్ష‌య్‌ను కోరారు. ఈ దిశగా మీనా ఓ మ్యాజికల్ కిట్‌ను పంపిణీ చేపట్టారు. ఈ కిట్‌లో 8 శ్యానిటరీ ప్యాడ్లు, 2 అండర్‌వేర్లు, నాలుగు షాంపూ శాషేలూ ఓ సబ్బు ఉంటుంది. మీనా ఈ కిట్లను ప్రతినెలా బాలికలకు పంచుతారు.


ఒక్క వ్యక్తితో ఈ సమస్యకు పరిష్కారం దొరకదని భావించిన మీనా తన సామాజిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు 2017లో మానునీ ఫౌండేషన్ పేరిటి ఓ సంస్థను ప్రారంభించారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో తన సంస్థ చేపడుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించారు. దీంతో..అనేక మంది సహాయం చేసేందుకు ముందుకు రావడంతో.. మీనా ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని మరింత పెద్ద ఎత్తున చేపడుతున్నారు. భారత ప్రజల నుంచే కాకుండా.. వివిధ దేశాల నుంచీ ఈ సంస్థకు నిధులు అందుతున్నాయి. మీనా జన్మదినం పురస్కరించుకుని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా మూర్తి రెండు లక్షల రూపాయల విలువైన శానిటరీ ప్యాడ్లను పంపించారు. అంతేకాకుండా.. అక్షయ్‌కు కుమార్ కూడా రెండు లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ ఏడు హెడ్‌ఎఫ్‌సీ బ్యాంకు రూ. 9 లక్షలు సమకూర్చింది. ఇక కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ ఆమె అనేక కార్యక్రమాలను చేపట్టి విధివంచితులకు అండగా నిలిచారు. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.