Miss England: 94 ఏళ్ల మిస్ ఇంగ్లండ్ అందాల పోటీల్లోనే సంచలనం.. ఫైనల్‌కు ఆమె ఎలా చేరుకుందో తెలిస్తే అవాక్కవుతారు!

ABN , First Publish Date - 2022-08-28T22:33:39+05:30 IST

అందాల పోటీలంటే ఇక ఆ హంగామా చెప్పక్కర్లేదు. పోటీలో పాల్గొనే అమ్మాయిల చక్కగా ముస్తాబై వయ్యారాలు పోతూ తమ

Miss England: 94 ఏళ్ల మిస్ ఇంగ్లండ్ అందాల పోటీల్లోనే సంచలనం.. ఫైనల్‌కు ఆమె ఎలా చేరుకుందో తెలిస్తే అవాక్కవుతారు!

లండన్: అందాల పోటీలంటే ఇక ఆ హంగామా చెప్పక్కర్లేదు. పోటీలో పాల్గొనే అమ్మాయిల చక్కగా ముస్తాబై వయ్యారాలు పోతూ తమ అందాలను ప్రదర్శిస్తారు. వారు వేదికపైకి రావడానికి ముందు కొన్ని గంటలపాటు అద్దానికి అతుక్కుపోతారు. న్యాయనిర్ణేతలను ఆకర్షించేందుకు మేకప్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. అయితే, తాజాగా ఇంగ్లండ్‌లో జరిగిన ‘మిస్ ఇంగ్లండ్’ పోటీల్లో సరికొత్త అద్భుతం ఆవిష్కృతమైంది. 94 సంవత్సరాల మిస్ ఇంగ్లండ్ పోటీల (Miss England beauty pageant) చరిత్రలోనే ఇది అత్యద్భుతం.  


ఆమె పేరు మెలీసా రవూఫ్ (Melisa Raouf). లండన్‌కు చెందిన 20 ఏళ్ల అమ్మాయి. ఆమె అకస్మాత్తుగా వార్తల్లోకి రావడం వెనక ఓ బలమైన కారణం ఉంది. ఇటీవల జరిగిన సెమీఫైనల్‌ రౌండ్‌లో మేకప్ లేకుండానే పాల్గొని సంచలనం సృష్టించింది. అదే గొప్ప విషయం అనుకుంటే.. ఆమె ఫైనల్‌కు చేరుకుని ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఎలాంటి మేకప్‌ లేకుండానే ఆమె ఫైనల్‌కు చేరుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అక్టోబరులో జరగనున్న ఫైనల్‌లోనూ ఆమె మేకప్ లేకుండానే పోటీపడబోతున్నారు.


పూర్తి సహజ రూపంలో వేదికపైకి వెళ్లేందుకు తొలుత కొంత భయంగా అనిపించిందని అయితే, నిజంగా తానెవరో ఈ ప్రపంచానికి చూపించాలన్న కోరికే తనను మేకప్ లేకుండా వేదికపైకి వెళ్లేందుకు ప్రేరేపించిందని మెలీసా తెలిపారు. అందాల పోటీలకు సరిపడా ప్రమాణాలు తనలో ఉన్నాయని తానెప్పుడూ అనుకోలేదని పేర్కొన్నారు.


తన సొంత చర్మమే తనకు మరింత అందాన్ని ఇస్తుందని తెలిసిన తర్వాత మేకప్ లేకుండానే పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అవాస్తవిక సౌందర్య ప్రమాణాలను అనుసరించడం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని మెలీసా చెప్పుకొచ్చింది. అందుకనే తాను అందాలకు సంబంధించిన ప్రమాణాలను ఎత్తివేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఎలాంటి మేకప్ లేకుండానే అందాల పోటీలో పాల్గొని ఫైనల్‌కు చేరుకున్న రవూప్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 


తాము 2019లోనే ‘బేర్ ఫేస్ టాప్ మోడల్’ రౌండ్‌ను ప్రవేశపెట్టినట్టు మిస్ ఇంగ్లండ్ డైరెక్టర్ అంజీ బీస్లీ తెలిపారు. పోటీదారులు చాలామంది మేకప్ వేసుకుని ఎడిట్ చేసిన చిత్రాలు సమర్పించారని, మేకప్ వెనకున్న అసలు వ్యక్తిని చూడాలనే ఈ రౌండ్‌ను ప్రవేశపెట్టినట్టు బిస్లీ పేర్కొన్నారు. రవూఫ్ చాలా ధైర్యంగా తన పని తాను చేసిందని ఆమె మెచ్చుకున్నారు. మిస్ ఇంగ్లండ్‌ కోసం ఆమెకు బెస్టాఫ్ లక్ చెబుతున్నట్టు పేర్కొన్నారు.  

Updated Date - 2022-08-28T22:33:39+05:30 IST