రైతుల్లో మీఠార్‌..!

Published: Sat, 14 May 2022 00:47:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రైతుల్లో మీఠార్‌..!

వ్యవసాయ మోటార్లకు మీటర్లు 

ఉచిత విద్యుత్‌కు మంగళం అంటూ రైతుల ఆందోళన

ఉమ్మడి జిల్లాలో 1,17,394 మోటార్లకు ఉచిత విద్యుత్‌


రైతుల్లో రోజురోజుకూ సంతోషం సన్నగిల్లుతోంది. ఓ పక్క వరదలు, అకాల వర్షాలు, అనావృష్టితో అతలాకుతలం అవుతున్నారు. నేను విన్నాను... నేను ఉన్నాను అంటూ... రైతులకు అండగా ఉండాల్సిన జగన్‌ సర్కార్‌ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామంటూ బాంబ్‌ పేల్చింది. ఇది రైతుల్లో గుబులు రేపుతోంది. ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలు, రైతులు వద్దని నెత్తీనోరు మొత్తుకుంటున్నా ప్రభుత్వం వినడం లేదు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ మోటార్లకు మీటర్లను అమర్చారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే సంతకం చేసిన మొట్టమొదటి ఫైలు ఉచిత విద్యుత్‌. ఇప్పుడు ఇదే ఉచిత విద్యుత్‌కు ఆయన కుమారుడు సీఎం వైఎస్‌ జగన్‌ మంగళం పాడుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు.


(కడప-ఆంధ్రజ్యోతి): మూడు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రైతులకు మద్దతుగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు వద్దంటూ చెబుతున్నారు. అదేస్థాయిలో అధికారపార్టీ నేతలు మీటర్లు పెడతామంటూ స్పష్టం చేస్తున్నారు. దీంతో మీటర్లు బిగిస్తే ఎక్కడ ఉచిత విద్యుత్‌ను తొలగిస్తారో అనే భయం రైతుల్లో నెలకొంది. మీటర్ల ఏర్పాటు  ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్పీడీసీఎల్‌ అధికారులు చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ మోటార్ల కనెక్షన్‌కు రైతుల ఆధార్‌ను లింక్‌ చేసి మ్యాపింగ్‌ చేశారు. ఇక బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు సిద్ధం అవుతున్నారు. 

ఉమ్మడి వైఎసార్‌ కడప జిల్లాలో 3,38,801 మంది రైతులు ఉండగా సాగు యోగ్యమైన భూములు 3,05,954 హెక్టార్లు ఉన్నాయి. ఎకరా లోపు భూమి ఉన్న రైతులు 1,89,804 మంది, రెండు ఎకరాల్లోపు 75,795 మంది, 4 నుంచి 10 ఎకరాల భూములున్న రైతులు 52,726 మంది ఉన్నారు. 24.71 ఎకరాలకంటే ఎక్కువ ఉన్న రైతులు 474 మంది ఉన్నారు. ప్రధాన పంటలు వరి, పత్తి, వేరుశనగ, సజ్జ, పొద్దుతిరుగుడు సాగు చేస్తుంటారు. ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 79,192 హెక్టార్లు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1,33,815 హెక్టార్లు. జిల్లాలో ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అందుకు అవసరమైన కాలువలు లేకపోవడంతో పూర్తి ఆయకట్టుకు నేరుగా సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. దీంతో వ్యవసాయ బోర్లే ఆధారంగా రైతులు పంటలు సాగు చేస్తున్నారు.


తండ్రి ఉచిత విద్యుత్‌కు తనయుడు మంగళం

ఉమ్మడి జిల్లాలో 1,15,399 వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. 157 వ్యవసాయ కనెక్షన్లకు కరెంట్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. దివంగత సీఎం వైఎ్‌స రాజశేఖర్‌రెడ్డి ఉచిత విద్యుత్‌కు అంకురార్పణ చేశారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉచిత విద్యుత్‌ రైతులకు అందుతోంది. వైఎ్‌సఆర్‌ మరణానంతరం రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పని చేశారు. అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు సీఎంగా పనిచేశారు. వీరి హయాంలో ఏనాడూ వ్యవసాయ మోటార్లకు మీటర్ల ప్రస్తావన రాలేదు. రైతుల నుంచి రూ.30 సర్వీసు చార్జీ మాత్రమే వసూలు చేస్తున్నారు. అయితే రాష్‌ర్ట ప్రభుత్వం అన్ని వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాల్సిందే నని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 22ను విడుదల చేసింది. దీంతో తండ్రి ఉచిత విద్యుత్‌ ఇస్తే తనయుడు దానికి మంగళం పాడే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.


మీటరు బిగించి.. రైతు ఖాతాలో డబ్బు వేస్తారట..

ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం సొంతంగా ఆర్థిక వనరులు వృద్ధి చేసుకునేందుకు కృషి చేయకుండా అప్పుల కోసం పాకులాడుతున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం పెట్టిన నిబంధనలకు తలొగ్గి మోటార్లకు మీటర్లు అమర్చే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘మోటార్లకు మీటర్లు పెడితే ఏ రైతు ఎంత విద్యుత్‌ వాడుతున్నారో తెలిసిపోతుంది. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు 700 నుంచి 1000 అడుగుల లోతు బోర్లు వేస్తున్నారు. పన్నెండున్నర, 18, 20 హార్స్‌పవర్ల మోటార్లను వినియోగిస్తున్నారు. లోతులో ఉన్న నీటిని బయటకు తోడాలంటే కరెంట్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే మోటార్లకు మీటర్లతో విద్యుత్‌ వినియోగం స్పష్టంగా తెలిసిపోతుంది. మోటార్లకు మీటర్లు పెట్టి ఎంత వినియోగించుకుంటే అంత సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాలో వేస్తాం. ఆ డబ్బును రైతులు తిరిగి విద్యుత్‌శాఖకు చెల్లిస్తే సరిపోతుంది’ అని ప్రభుత్వం అంటోంది. ప్రభుత్వమే డబ్బు చెల్లించేటప్పుడు మోటార్లకు మీటర్లు ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వంట గ్యాస్‌ రాయితీ పరిస్థితి ఏందో అందరికీ స్పష్టంగా అర్థమైంది. విద్యుత్‌ను కూడా ప్రైవేటుపరం చేస్తారనే ప్రచారం ఉంది. ఈ నిబంధనలు ప్రైవేటు వ్యక్తుల చేతులలోకి వెళితే తప్పనిసరిగా మీటర్ల ప్రకారం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వీరు మోటార్లకు మీటర్ల ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు.


విద్యుత్‌ మీటర్లు రైతుల మెడలకు ఉరితాళ్లు

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి 

వేంపల్లె, మే 13: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలనుకోవడం రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించడమేనని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వేంపల్లెలో కాంగ్రెస్‌ పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం అంటే వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగమన్నారు. వైసీపీ ప్రభుత్వం మూడేళ్లుగా తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే ఆత్మహత్యలు మరింత పెరుగుతాయన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో వేంపల్లె మండల శాఖ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, బద్రినాథ్‌, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకే

- డి.దస్తగిరి రెడ్డి, ఏపీరైతు సంఘం జిల్లా కార్యదర్శి 

ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకే మోటార్లకు మీ టర్లు బిగిస్తున్నారు. ప్రభుత్వం రైతుల అకౌంట్లలో డబ్బులు వేసి దానిని రైతులతో కట్టించే బదులు నేరుగా ప్రభుత్వమే చెల్లించవచ్చు కదా. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 22ను ఉపసంహరించుకోవాలి. 


18 ఏళ్లుగా ఉచిత విద్యుత్‌

- చింత రఘునాథరెడ్డి, రైతు, పెండ్లిమర్రి మండలం 

ఓ పక్క ప్రకృతి వైపరీత్యాలు. మరోవైపు మద్దతు ధర లేక అప్పులపాలు అవుతు న్నాం. 18 ఏళ్లుగా ఉచిత విద్యుత్‌ వస్తోం ది. కరెంట్‌ చార్జీల భారం లేదు. ఇప్పుడు మీటర్లు పెడితే రాబోయే రోజుల్లో ఉచిత విద్యుత్‌ను ఎత్తేస్తారనే భయం రైతుల్లో ఉంది. 


వ్యవసాయం భారమైంది

- మోడే రసూల్‌నాయక్‌, రైతు, ఆర్‌కొట్టాల, జమ్మలమడుగు

పెట్టుబడులు పెరిగిపోయి సాగు భారమైంది. పెట్టుబడికి తగ్గట్లు దిగుబడి లేదు. ఇప్పుడు వ్యవసాయ మోటార్లకు మీటర్లు అంటున్నారు. మీటర్లు పెడితే రాబోయే రోజుల్లో డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మరింత భారంగా మారుతుంది.


రైతుల్లో క్రమశిక్షణ అలవడుతుంది

- అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ రాష్ట్ర సలహాదారుడు

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీటర్‌ ఏర్పాటు చేయడం వల్ల ఏ రైతు ఎంత కరెంట్‌ వాడుతున్నారో తెలిసిపోతుంది. ఆ డబ్బు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇప్పుడు మోటార్‌ వేసి రైతులు వెళ్లిపోతున్నారు. దీంతో నీరంతా వంకలోకి వృధాగా పోతోంది. మీటర్ల ఏర్పాటుతో రైతుల్లో క్రమశిక్షణ అలవడుతుంది. 


ఆధార్‌ అనుసంధానం పూర్తి 

- శోభా వాలంటీన, ఎస్‌ఈ, ఎస్పీడీసీఎల్‌

వ్యవసాయ కనెక్షన్లకు రైతు ఆధార్‌ నెంబర్‌ను అనుసంధానించాం. పై నుంచి ఆదేశాలు వస్తే రైతుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరవాల్సి వస్తుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.