పూలే ఆశయ సాధనకు పాటుపడదాం

ABN , First Publish Date - 2022-09-25T06:48:04+05:30 IST

మహిళలకు చదువు, హక్కులు, సమానత్వం కావాలి, అంటరానితనం పోవాలి అనే పోరాటాలు నేటికీ జరుగుతున్నాయి. కానీ 150 ఏళ్ల క్రితమే జ్యోతిరావు పూలే మహిళకు చదువు కావాలి, హక్కులు కావాలి, సమానత్వం రావాలని అనుకున్నారు.

పూలే ఆశయ సాధనకు పాటుపడదాం
సభలో మాట్లాడుతున్న మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు చిత్రంలో వాసిరెడ్డి పద్మ తదితరులు

పూలే సత్యశోధక్‌ సమాజ్‌ 150వ ఆవిర్భావ దినోత్సవంలో మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు


రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 24 : మహిళలకు చదువు, హక్కులు, సమానత్వం కావాలి, అంటరానితనం పోవాలి అనే పోరాటాలు నేటికీ జరుగుతున్నాయి. కానీ 150 ఏళ్ల క్రితమే జ్యోతిరావు పూలే మహిళకు చదువు కావాలి, హక్కులు కావాలి, సమానత్వం రావాలని అనుకున్నారు. అందుకే నిజంగా ఆయన ఒక భగవంతుడు అని శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో శనివారం నిర్వహించిన పూలే సత్యశోధక్‌ సమాజ్‌ 150వ ఆవిర్భావ దినోత్సవం సభలో ఆయన మాట్లాడారు. గత 15, 20 ఏళ్ల నుంచి మాత్రమే పూలే గొప్పతనాన్ని సమాజానికి అందించారు తప్ప అంతకు ముందు పూలే చేసిన విషయాలు పెద్దగా ప్రచారంలోకి రాలేదన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పూలేను తన గురువుగా భావించారు. అంబేద్కర్‌ గొప్పవాడు అనుకుంటే ఆయన గురువు మరెంత గొప్పవాడో అర్థం చేసుకోవాలన్నారు.  రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆలోచనలే నేటి మహిళల ఉన్నత స్థాయికి కారణమన్నారు. జ్యోతిరావు పూలే సంఘసంస్కర్త అని, సత్యసమాజ్‌ శోధక్‌ను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల న్నారు. ఎంపీ భరత్‌రామ్‌ మాట్లాడుతూ మహిళ, పురుషుడు అనే లింగబేధాలు నేటికీ సమాజంలో ఉన్నాయని, ఆనాడు పూలే, అంబేడ్కర్‌ వంటి వ్యక్తులు వివక్షపై అలుపెరగని పోరాటం చేశారన్నారు.  మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ అంబేడ్కర్‌, పూలే ఆశయసాధనకు 150 ఏళ్లు దాటినా నేటికీ ఆయా వర్గాలకు న్యాయం జరగకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వారి ఆశయాల స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలన్నారు.కార్యక్రమంలో రుడా చైర్‌పర్సన్‌ ఎం.షర్మిళారెడ్డి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జీఆర్‌ రాధిక, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు,వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మహిళా కమిషన్‌ సభ్యురాలు కర్రి జయశ్రీ, నయనాల కృష్ణారావు, డాక్టర్‌ కోమల, నక్కా నగేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T06:48:04+05:30 IST