ప్రాథమిక వైద్యశాలలో సమావేశ మందిరం ప్రారంభం

ABN , First Publish Date - 2021-04-18T06:28:39+05:30 IST

మండలంలోని మాచవరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆవరణ లో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరాన్ని శనివారం ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రారంభించారు.

ప్రాథమిక వైద్యశాలలో సమావేశ మందిరం ప్రారంభం
సమావేశ మందిరం ప్రారంభించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే

కందుకూరు, ఏప్రిల్‌ 17: మండలంలోని మాచవరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆవరణ లో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరాన్ని శనివారం ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బందితో సమావేశాలు నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ హాలు సమావేశ మందిరంగాను అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలకు కూడా వినియోగించుకోటానికి వీలుగా నిర్మించటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సీతారామయ్య, వైద్యాధికారి డా. కేపీ స్వాతి తదితరులు పాల్గొన్నారు.

వైద్యాధికారులకు డిప్యూటేషన్లపై ఆగ్రహం

ఇక కరోనా విజృంభిస్తున్న వేళ ఇక్కడి వైద్యాధికారులకు డిప్యూటేషన్‌ వేయడంపై  ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు తక్షణం స్పందించకపోతే తాను ప్రత్యక్ష ఆందోళనకైనా దిగుతానని హెచ్చరించారు. వైద్యులు స్థానికంగా అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు.

 ప్రమాదకరంగా మారితే కఠినచర్యలు 

కందుకూరు, ఏప్రిల్‌ 17: పట్టణంలో నివాసాల మధ్య ఉన్న ఖాళీస్థలాలు, నిరుపయోగంగా ఉండే పాత గృహాలు ప్రమాదకరంగా మారితే వాటి యజమానులను బాధ్యులను చేయాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి సూచించారు. శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ప్రజల సమస్యలపై వచ్చిన అర్జీలు స్వీకరించారు. ఖాళీస్థలాలలో పొదలు, చెత్త కుప్పలు పోగయ్యి విషపురుగులు, జంతువులు, ఇతరత్రా ప్రమాదాలకు ఆవాసాలుగా మారితే చుట్టపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఇలాంటి ఫిర్యాదులపై మున్సిపల్‌ అధికారులు తక్షణమే స్పందించాలన్నారు.  అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.మనోహర్‌ మాట్లాడుతూ ఖాళీ స్థలాలు, ఇతరత్రా వ్యర్థాలతో పేరుకుని ఉన్న ప్రాంతాలను మున్సిపల్‌ సిబ్బందితో శుభ్రం చేయిస్తాన్నారు. కార్యక్రమంలో డీఈ విజయలక్ష్మి, ఏఈ లోకేష్‌, ఆర్‌ఐ రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T06:28:39+05:30 IST