
మెగా డాటర్ నిహారిక తాజాగా తమిళ చిత్రం 'మాస్టర్'పై ప్రశంసల వర్షం కురిపించింది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నిహారిక కొన్ని సినిమాలు చేసిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు కూడా ఆమె ఓ తమిళ చిత్రంలో చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే పెళ్లి తర్వాత ఆమె దాదాపు సినిమాలకు గుడ్ బై చెప్పినట్లే అని వార్తలు వస్తున్న తరుణంలో.. తాజాగా తమిళ చిత్రం 'మాస్టర్' చూశానని, ఆ చిత్రం ఎంతో నచ్చిందని చెబుతూ.. నిహారిక ట్వీట్ చేయడంతో.. మళ్లీ ఏమైనా మెగా డాటర్ కోలీవుడ్ వైపు చూస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. 'మాస్టర్' చిత్రం తెలుగులో కూడా విడుదలైంది కాబట్టి.. తెలుగులో చూడవచ్చు. కానీ ప్రత్యేకంగా తమిళ్లో చూశానని ఆమె చెప్పడమే.. ఇప్పుడు అనుమానాలు వచ్చేలా చేస్తోంది.
''దాదాపు ఒక సంవత్సరం తర్వాత నేను థియేటర్లో చూసిన తమిళ చిత్రం 'మాస్టర్'. చక్కని విందులా ఉంది. దళపతి విజయ్ అద్భుతమైన నటుడు. అలాగే నాకెంతో ఇష్టమైన విజయ్ సేతుపతి సార్‌ని ఇలా చూడడం చాలా గొప్పగా అనిపించింది. లోకేష్ కనగరాజ్ గారు రూపొందించిన 'ఖైదీ' చిత్రం నాకెంతో నచ్చింది. అలాగే 'మాస్టర్' కూడా చక్కని మెసేజ్‌తో అందరినీ అలరించేలా ఉంది. నా వరకు చిత్రంలో డైలాగ్స్, స్ర్కీన్‌ప్లే చాలా బాగా నచ్చాయి. మాస్టర్ బ్లాస్టర్ అనిరుద్ రవిచంద్రన్.. సంగీతం నా మైండ్‌లో అలా ఉండిపోయింది. ఖిలిచ్చితన్.. సతీస్ తో ఫైట్ సీన్.. నవ్వులే నవ్వులు..'' అంటూ నిహారిక తన ట్వీట్లో మాస్టర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది.