దేశంలోనే టాప్‌

ABN , First Publish Date - 2021-06-21T05:37:39+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో పశ్చిమ గోదావరి జిల్లా జాతీయ స్థాయి రికార్డు నెలకొల్పింది

దేశంలోనే టాప్‌
ఆకివీడులో వ్యాక్సిన్‌ కోసం క్యూ

ఒక్క రోజులో లక్షా 66 వేల మందికి టీకాలు

జాతీయ స్థాయిలో రికార్డు : కలెక్టర్‌ కార్తికేయ

లక్ష్యం 1.25 లక్షలు.. వేసేది 1.70 లక్షలు

ఇప్పటి వరకు 11.77 లక్షల మందికి వ్యాక్సిన్‌


ఏలూరు/ఏలూరు ఎడ్యుకేషన్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో పశ్చిమ గోదావరి జిల్లా జాతీయ స్థాయి రికార్డు నెలకొల్పింది. జిల్లావ్యాప్తంగా 528 సీవీసీలు, గ్రామ/వార్డు సచివాలయాల్లో  ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా వ్యాక్సిన్లు వేశారు. ఒక్కరోజులో లక్షా 66 వేల 939 మందికి వ్యాక్సిన్లు వేసిన జిల్లాగా పశ్చిమ దేశంలోనే అరుదైన రికార్డు దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం 1.25 లక్షల డోసులు కాగా 1.70 లక్షల డోసులు వేయాలని నిర్ణయించారు. శనివారం రాత్రి జిల్లాకు దిగుమతి అయిన మరో 70 వేల డోసులను సీవీసీలకు తరలించి సూపర్‌ మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు.రాత్రి ఎంత ఆలస్యమైనా మొత్తం నిల్వలను పూర్తిగా వినియోగించాలని కలెక్టర్‌ కార్తి కేయ మిశ్రా సిబ్బందిని ఆదేశించారు. తొలుత నిర్దేశించుకున్న 1.25 లక్షల డోసుల మెగా వ్యాక్సినేషన్‌ జిల్లాలో మధ్యాహ్నం మూడు గంటలకే పూర్తయింది. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులు 63 వేల మందికిపైగా, 45–59 ఏళ్ల వయస్సు వారు 77,500 మందికిపైగా, 60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్స్‌ 21 వేలకు పైగా ఉన్నారు. జం గారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం వల్ల సెల్‌ఫోన్ల లైటింగ్‌లో వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 11.80 లక్షల మంది వ్యాక్సిన్‌ వేయించుకోగా వీరిలో 9.61 లక్షల మందికి తొలి డోసు, 2.19 లక్షల మందికి రెండో డోసు వ్యాక్సిన్‌ వేశారు. వ్యాక్సినేషన్‌కు విస్తృత ఏర్పాట్లతోపాటు, సిబ్బందిని సమన్వ యపర్చడానికి మండలాల వారీగా నోడల్‌ అధికారులను నియమించారు. రాష్ట్ర పరిశీలకు రాలిగా నియమితులైన కుటుంబ సంక్షేమశాఖ జేడీ (ఎం హెచ్‌ఎన్‌) డాక్టర్‌ జయశ్రీ ఏలూరులోని కొత్తపేట అర్బన్‌ పీహెచ్‌సీని సందర్శించి వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. 


వీరికి వ్యాక్సిన్‌ ఈ రోజు లేదు

పద్దెనిమిదేళ్ల వయసు దాటిన వారికి ఈ నెల 21 నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కానీ రాష్ట్ర ఆరోగ్యశాఖ నుంచి ఎటువంటి మార్గ దర్శకాలు ఇంత వరకు లేనందున 45 ఏళ్లలోపు వారికి టీకా  మందు వేయడానికి జిల్లాస్థాయిలో ఏర్పాట్లు చేయలేదని జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. యాప్‌లో యువత రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నప్పటికీ ఆ మేరకు సరిపడినన్ని డోసుల వ్యాక్సిన్‌ నిల్వలు రాష్ట్రానికి, అక్కడి నుంచి జిల్లాకు పంపిణీ అయితేనే టీకా మందు వేస్తామని తేల్చి చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్కువ డోసులు వస్తాయని తెలిపారు. 


ఏ సమయానికి ఎంత మందికి..?

ఉదయం 

8 గంటలకు.. 3,007

9 గంటలకు 13,852

10 గంటలకు 20,752

11 గంటలకు 21,324

మధ్యాహ్నం

12 గంటలకు 20,122

1 గంటకు 17,418

2 గంటలకు 11,909

3 గంటలకు 8,260

సాయంత్రం

4 గంటలకు 9,765

5 గంటలకు 9,492

6 గంటలకు 7,999

రాత్రి

7 గంటలకు 7,115

8 గంటలకు 4,719

9 గంటలకు 5,001

10 గంటలకు 3,457

11 గంటలకు 1,613

మొత్తం 1,66,939


ఆన్‌లైన్‌ తప్పిదం వ్యాక్సిన్‌ పాట్లు 

 ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌.. పెదవేగి పీహెచ్‌సీకి బారులు తీరిన యువత

 టీకాలు వేసేందుకు వైద్య సిబ్బంది నిరాకరణ.. యువతీ యువకుల ఆందోళన


పెదవేగి, జూన్‌ 20 : ‘18–25 ఏళ్ల మధ్య వయసు కలిగిన యువతకు కరోనా నివారణ టీకాలు వేస్తాం. స్లాట్‌లో మీ పేరు నమోదు చేసుకోండి’ అని శనివారం అవకాశం కల్పించడంతో వారంతా తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. వారందరికీ పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో ఆదివారం టీకాలు వేస్తారని చూపించడంతో జిల్లా నలుమూలలైన నరసాపురం, భీమవరం, తణుకు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి తదితర ప్రాంతాలకు చెందిన యువత పెదవేగికి తరలివచ్చారు.  కానీ, 45 ఏళ్లు పైబడిన వారికి, ఐదేళ్లలోపు పిల్లలు వున్న తల్లులకు మాత్రమే టీకాలు వేస్తున్నామని చెప్పడంతో యువత ఆందోళన చేశారు. పీహెచ్‌సీ నుంచి పెదవేగి తహసీల్దారు కార్యాలయానికి వచ్చి 25 ఏళ్లలోపు వారికి టీకాలు వేయనప్పుడు స్లాట్‌ ఎందుకు అందుబాటులో ఉంచారంటూ అధికారులపై ధ్వజమెత్తారు. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అంతేతప్ప కావాలని చేసింది కాదని తహసీల్దారు సుందర్‌సింగ్‌ సర్దిచెప్పి పంపించారు. సాయంత్రం వరకు యువతీ యువకులు ఇలా వస్తూనే ఉన్నారు. వచ్చి నిరాశగా వెనుతిరిగి వెళ్లారు. ఆన్‌లైన్‌లో జరిగిన తప్పిదం యువతను కష్టాల పాల్జేసింది.






Updated Date - 2021-06-21T05:37:39+05:30 IST