19న మెగా వ్యాక్సినేషన్‌ రద్దు

ABN , First Publish Date - 2022-02-13T13:38:13+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల కారణంగా ఈ నెల 19న జరగాల్సిన మెగా వ్యాక్సినేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఉదయం 22వ విడత మెగావ్యాక్సినేషన్‌ శిబిరాలు

19న మెగా వ్యాక్సినేషన్‌ రద్దు

                     - ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం 


చెన్నై: మున్సిపల్‌ ఎన్నికల కారణంగా ఈ నెల 19న జరగాల్సిన మెగా వ్యాక్సినేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఉదయం 22వ విడత మెగావ్యాక్సినేషన్‌ శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఎప్పటిలాగే రాష్ట్రంలోని 50 వేల కేంద్రాల్లో నిర్వహించిన శిబిరాల ముందు ప్రజలు బారులు తీరారు. ఈ నేపథ్యంలో రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నిర్వహించిన టీకా శిబిరాన్ని మంత్రి సుబ్రమణ్యం, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ తదితర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో శనివారాల్లో నిర్వహిస్తున్న మెగా వ్యాక్సినేషన్‌ శిబిరాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, ఈ శిబిరాలకు మొదటి డోస్‌ టీకాలు వేసుకునేందుకు వచ్చేవారి సంఖ్యే అత్యధికంగా ఉంటోందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 9.75 కోట్ల మంది టీకాలు వేసుకున్నారని, వీరిలో మొదటి డోస్‌ టీకాలను 90.94 శాతం మంది, రెండో డోస్‌ టీకాలను 70.46 శాతం మంది వేసుకున్నట్టు ఆయన వివరించారు. ఇదే విధంగా రెండు డోస్‌లు వేసుకున్నవారిలో 5.52 లక్షల మంది బూస్టర్‌ డోస్‌ వేసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో 24 మున్సిపాలిటీలు, 2792 నగర పంచాయతీలు వంద శాతం టీకాల లక్ష్యాన్ని సాధించాయని ఆయన చెప్పారు. ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పట్టణ పంచాయతీల ఎన్నికలు జరుగనుండటంతో ఓటు వేసే ప్రజల సౌకర్యార్థం మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఒమైక్రాన్‌ విపరీతంగా వ్యాపించినా దాని కారణంగా మృతిచెందిన వారి సంఖ్య స్వల్పమేనని, ఎంత వేగంగా ఆ వైరస్‌ వ్యాప్తి చెందిందో అంతే వేగంతో తగ్గుముఖం పట్టిందని, రెండు డోస్‌ల టీకాలు వేసుకోవడం వల్లే ప్రాణ నష్టం తక్కువ ఉందని ఆయన వివరించారు. కరోనా థర్డ్‌ వేవ్‌ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా బాగా తగ్గుముఖం పట్టి చివరి దశకు చేరుకుందని మంత్రి సుబ్రహ్మణ్యం తెలిపారు.

Updated Date - 2022-02-13T13:38:13+05:30 IST