ఖమ్మంలో వేడుకగా ‘శ్రీకారం’ ప్రీ రిలీజ్‌ వేడుక

ABN , First Publish Date - 2021-03-09T05:22:16+05:30 IST

14రీల్స్‌ బ్యానర్‌పై యువకథానాయకుడు శర్వానంద్‌, ప్రియాంకాఆరుల్‌మోహన్‌ జంటగా నటించిన శ్రీకారం సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక సోమవారం సాయంత్రం ఖమ్మంలోని మమత మెడికల్‌ కళాశాల ఆవరణలో అట్టహాసంగా జరిగింది.

ఖమ్మంలో వేడుకగా ‘శ్రీకారం’ ప్రీ రిలీజ్‌ వేడుక
శ్రీకారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి, మంత్రి పువ్వాడ అజయ్‌, శ్రీకారం చిత్ర హీరోహీరోయిన్లు, యూనిట్‌ సభ్యులు

హాజరైన మెగాస్టార్‌ చిరంజీవి, మంత్రి పువ్వాడ

ఖమ్మం ఖానాపురంహవేలి, మార్చి 8 : 14రీల్స్‌ బ్యానర్‌పై యువకథానాయకుడు శర్వానంద్‌, ప్రియాంకాఆరుల్‌మోహన్‌ జంటగా నటించిన శ్రీకారం సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక సోమవారం సాయంత్రం ఖమ్మంలోని మమత మెడికల్‌ కళాశాల ఆవరణలో అట్టహాసంగా జరిగింది. శ్రేయాస్‌ మీడియా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హాజరయ్యారు. మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ ఖమ్మం జిల్లా అంటేనే పోరుగడ్డ అని 12 ఏళ్లక్రితం ప్రజాఅంకిత యాత్ర సమయంలో తనపై ఇక్కడి ప్రజలు చూపిన ఆదరణ మరిచిపోలేనిదన్నారు. ఈ ఆదరణ, అభిమానం తనకు జీవితాంతం ఇవ్వాలని కోరారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి మెగాస్టార్‌ అభిమానినని, ఆయన సినిమాలు వచ్చిన మొదటిరోజునే వెళ్లేవాడనని, బావగారు బాగున్నారా సినిమాకు డిస్ర్టిబ్యూటర్‌గా కూడా వ్యవహరించానని గర్తుచేసుకున్నారు. అనంతరం చిరంజీవిని మంత్రి కుటుంబసభ్యులు సన్మానించారు. అనంతరం హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ చిన్నతనం నుంచి మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లోనే పెరిగానని, రాంచరణ్‌ తాను ప్రాణస్నేహితులమని, తనను సినిమా ఇండస్ర్టీకి పరిచయం చేసిన వ్యక్తి చిరంజీవి అని, ఆయన రుణం జన్మలో తీర్చుకోలేనిదన్నారు. అలాగే ఈసినిమాలో రైతులకు సంబంధించిన సన్నివేశాలతో అబిమానులకు నచ్చే విధంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ డి.కిషోర్‌, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, శ్రేయాస్‌ మీడియా అధినేత శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఫైర్‌ రవి విన్యాసాలు, యాంకర్‌ శ్యామల మాటలు ఆకట్టుకున్నాయి. అభిమానులు ‘జై మెగాస్టార్‌’ అంటూ చేసిన నినాదాలతో ప్రాంగణం హోరెత్తింది.

Updated Date - 2021-03-09T05:22:16+05:30 IST