తాలిబన్లపై మెహబూబా ప్రశంసలు, బీజేపీ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-08-21T23:02:33+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల చర్యలను సమర్థించిన జమ్మూ-కశ్మీరు

తాలిబన్లపై మెహబూబా ప్రశంసలు, బీజేపీ ఆగ్రహం

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల చర్యలను సమర్థించిన జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తమ సహనాన్ని పరీక్షించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికీ ఓ అవకాశం ఉందని, పద్ధతి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయి శాంతి ప్రక్రియను ఏ విధంగా ప్రారంభించారో గుర్తు చేసుకోవాలన్నారు. ‘‘కశ్మీరీలతో చర్చలను పునఃప్రారంభించండి, మీరు దోచుకున్నదానిని తిరిగి ఇవ్వండి’’ అన్నారు. అధికరణ 370 పునరుద్ధరణ కోసం ‘శాంతియుతం’గా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సూపర్ పవర్ అయిన అమెరికా మూటముల్లె సర్దుకుని వెనుకకు వెళ్ళిపోయేలా తాలిబన్లు చేశారన్నారు. 


మెహబూబా ప్రాభవం కోల్పోయారు : బీజేపీ

బీజేపీ నేత నిర్మల్ సింగ్  స్పందిస్తూ, పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కశ్మీరులో రాజకీయంగా పట్టు కోల్పోయారన్నారు. ఆమె నైరాశ్యంలో కూరుకుపోయారని చెప్పారు. ఆమె తమను బ్లాక్‌మెయిల్ చేయాలనుకుంటే, ఇది మోదీ భారత దేశమని అర్థం చేసుకోవాలన్నారు. ఆ రోజులు పోయాయని, తమను బ్లాక్‌మెయిల్ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. 


జమ్మూ-కశ్మీరు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించిన భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో నిర్బంధంలో ఉన్న రాజకీయ నేతల్లో మెహబూబా ముఫ్తీ ఒకరు. ఆమె గత ఏడాది అక్టోబరులో నిర్బంధం నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆమె చాలాసార్లు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని పదే పదే డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-08-21T23:02:33+05:30 IST