పాక్‌కు వెళ్లిపొండి మెహబూబా : హర్యానా మంత్రి

ABN , First Publish Date - 2021-08-22T17:35:35+05:30 IST

జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై

పాక్‌కు వెళ్లిపొండి మెహబూబా : హర్యానా మంత్రి

చండీగఢ్ : జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ ఆదివారం ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ మీద అంత ప్రేమ ఉంటే, అక్కడికే వెళ్ళిపోవాలని సలహా ఇచ్చారు. అమెరికా, ఆఫ్ఘనిస్థాన్ వేర్వేరు దేశాలని, ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా తిష్ట వేసిందన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. కశ్మీరు భారత దేశంలో అంతర్బాగమని, భారత దేశం తన ప్రాంతంలోనే ఉందని తెలిపారు. 


‘‘మెహబూబా ముఫ్తీ! అమెరికా వేరొక దేశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో తిష్ఠ వేసిందనే విషయం కూడా మీకు తెలియదు. మనం మన దేశంలోనే ఉన్నాం. ఇక్కడి నుంచి మనల్ని తొలగించాలనే ఆలోచన సైతం ఎవరికీ రాదు. మీకు పాకిస్థాన్ మీద అంత ప్రేమ ఉంటే, అక్కడికే వెళ్ళిపొండి. ఇక్కడ మీరు అనుభవిస్తున్న సంతోషం అక్కడ దూరమవుతుంది’’ అని అనిల్ విజ్ పేర్కొన్నారు. 


మెహబూబా ముఫ్తీ ఇటీవల భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జమ్మూ-కశ్మీరుపై పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయి అనుసరించిన విధానాన్ని కొనసాగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. జమ్మూ-కశ్మీరు ప్రత్యేక హోదాను చట్టవిరుద్ధంగా కొల్లగొట్టారని, దానిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. సూపర్ పవర్ అయిన అమెరికాయే ఆఫ్ఘనిస్థాన్ నుంచి మూటముల్లె సర్దుకుని వెళ్ళిపోయిందని గుర్తు చేశారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.


Updated Date - 2021-08-22T17:35:35+05:30 IST