Mehbooba Mufti : ఉగ్రవాదులను చంపేస్తూ కేంద్రం పండగ చేసుకుంటోంది

ABN , First Publish Date - 2021-08-28T22:46:12+05:30 IST

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mehbooba Mufti : ఉగ్రవాదులను చంపేస్తూ కేంద్రం పండగ చేసుకుంటోంది

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రతిరోజూ ఉగ్రవాదులను చంపేస్తూ కేంద్ర ప్రభుత్వం పండగ చేసుకుంటోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ యువకులందరిపై కేంద్రం ఓ రకమైన ముద్ర వేస్తోందని, అందరూ హింసకు పాల్పడే దయ్యాల్లాగా కేంద్రం చిత్రీకరిస్తోందని ఆమె ఆరోపించారు. తమ పార్టీకి సంబంధించిన యువ నేతలతో పోలీసులు ప్రతిరోజూ ఘర్షణకు దిగుతున్నారని, వారి సమావేశాలను అడ్డుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ‘‘కశ్మీర్ యువకులు రాజకీయాల్లోకి రాకుండా కేంద్రం అడ్డుకుంటోంది. యువత రాజకీయాల్లోకి రావడం కేంద్రానికి నచ్చడం లేదు. ప్రతి రోజూ జరిగే ఎన్‌కౌంటర్లలో ఉగ్రవాదులు చనిపోతున్నారు. ఇలా కేంద్రం పండగ చేసుకుంటోంది. అయితే మాకు మాత్రం హింసపై ఏమాత్రం విశ్వాసం లేదు.శాంతితో కూడిన రాజకీయాల కోసం తాము తాపత్రయపడుతున్నాం. అందుకు తగ్గట్టుగానే మా పోరాటాలు కూడా ఉంటున్నాయి. హింసపై మాకు విశ్వాసం లేదు’’ అంటూ మెహబూబా ట్వీట్ చేశారు. తమ పార్టీకి చెందిన యువ విభాగం ఏ సమావేశం నిర్వహిద్దామన్నా, పోలీసులు అనుమతిని నిరాకరిస్తున్నారని, తాజాగా బిజ్‌బెహార్‌లో జరగాల్సిన సమావేశాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-08-28T22:46:12+05:30 IST