మౌనావతారమూర్తి

ABN , First Publish Date - 2022-01-28T05:30:00+05:30 IST

‘‘ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఎందరో అవతార పురుషులు ఉన్నారు. ఒక్కొక్క మతానికి ఒక్కో అవతారుడు ఉన్నారు. కానీ మతాలు వేరైనా అవతారుడు ఒక్కడే. ప్రతి యుగంలో భూమిపై అవతరిస్తున్న పరాత్పరుడొ ఒక్కడే. యుగ యుగాలుగా అవతరిస్తున్న...

మౌనావతారమూర్తి

31న అవతార్‌ మెహెర్‌బాబా అమరతిథి


‘‘ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఎందరో అవతార పురుషులు ఉన్నారు. ఒక్కొక్క మతానికి ఒక్కో అవతారుడు ఉన్నారు. కానీ మతాలు వేరైనా అవతారుడు ఒక్కడే. ప్రతి యుగంలో భూమిపై అవతరిస్తున్న పరాత్పరుడొ ఒక్కడే. యుగ యుగాలుగా అవతరిస్తున్న దేవదేవుడు ఒక్కడే. మనం మతం వెనుక కాకుండా, ఈ మతాలు ఘోషించే సత్య సూక్తం వైపు కదిలి వెళ్ళాలి’’ అని మానవాళికి పిలుపునిచ్చిన మహనీయుడు మెహెర్‌ బాబా.  


‘‘భగవంతుడు ఒక్కడే సత్యం! మిగిలినదంతా మిధ్య! మీరు చూస్తున్నది, అనుభవిస్తున్నది ఇదంతా ఒక పెద్ద కల. మీరు ఈ నిజాన్ని తెలుసుకుని, భగవదర్శన అనుభవం పొందినప్పుడు, ఈ విషయం గురించి మీకు మరింత అవగాహన కలుగుతుంది’’ అని సందేశాన్ని ఇచ్చిన అవతార్‌ మెహెర్‌ బాబాను సాక్షాత్తూ పరమేశ్వరుడిగా, తమ ఇలవేల్పుగా ఆరాధించే భక్తులు తెలుగునాట చాలామంది ఉన్నారు. 75 ఏళ్ళ వయసులో... భౌతిక దేహత్యాగం చేసిన ఆయనను దాదాపు 44 ఏళ్ళు కఠోర మౌనం పాటించారు. ఆ మౌనంతోనే అమెరికా, ఇంగ్లండ్‌, యూరప్‌ తదితర దేశాలు పర్యటించారు. ఎందరో పాశ్చాత్యులు తాము ఆరాధించే ఏసు ప్రభువును మెహెర్‌బాబాలో దర్శించుకున్నారు. బాబా తన సంజ్ఞల ద్వారా ‘భగద్వచనం’, ‘సర్వం శూన్యం’ తదితర పలు ఆధ్యాత్మిక గ్రంథాలను మానవాళికి అందించారు. 


మానవాళిని మేల్కోలిపేందుకు...

తనను ఆరాధించడం ద్వారా ఏదో మేలు జరుగుతుందని ఆశించవద్దని మెహెర్‌బాబా చెప్పేవారు. ఇది ఒక పుట్టు గుడ్డివాడు తన నేత్రాలను మరొకరి చూపు కోసం దానం చేసినట్టేనని హెచ్చరించారు. ప్రేమ, నిస్వార్థసేవ, విధేయతల గురించి తన సందేశాలలో అనేక విధాలుగా తెలియజేశారు. ఇతరులనుండి ఏమీ ఆశించవద్దనీ, అవసరం ఉన్నవారికి ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికి కృషి చేయాలనీ, తద్వారా నిజమైన ఆనందం లభిస్తుందని ప్రబోధించారు. యావత్‌ ప్రపంచ మానవాళి కోసం మెహెర్‌బాబా 1969 జులై 10న తన ఆఖరి సందేశం ఇచ్చారు. ఈ సందేశంలో ‘‘నేను బోధించడానికి రాలేదు. మానవాళిని మేల్కొల్పడానికే అవతరించాను. మానవ జీవిత లక్ష్యమైన భగవంతుని దరి చేరడానికి ‘నేను’ అనే భావానికి దూరంగా వుండండి. ‘నేను, నాది, నాకు’ అనే మూడింటికి దూరమయిన కొద్దీ భగవంతుడికి దగ్గరవుతారు. అందుకోసం ప్రాపంచికంగా మీరేమీ త్యజించవలసిన పనిలేదు’’ అని స్పష్టం చేశారు.


1956లో... హైదరాబాద్‌లోని ఖాజాగూడ కొండపై వున్న చిన్న గుహాలో మెహెర్‌బాబా కొంత సమయం ఏకాంతవాసం చేశారు. ‘మనోనాశ్‌’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘‘శరీరం ఉన్నంత వరకూ మనసు ఉంటుంది. మనసు వల్ల అనేక కొత్త సంస్కారాలు పోగవుతూ ఉంటాయి. ఇదొక విష వలయం. కాబట్టి, భగవంతుడి మీద భారం వేయండి. మీరు చేసే ప్రతి పనిలో జీవించండి. తద్వారా ఎలాంటి సంస్కారాలు అంటవు. నిస్వార్ధసేవ, నిరంతర భగవన్మామస్మరణ ద్వారా ‘మనోనాశ్‌’ అనే స్థితి సిద్ధిస్తుంది. దేవుణ్ణి అంతటా దర్శించగలుగుతారు. మనోనాశ్‌తో జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం అంటే ‘అహం బ్రహ్మస్మి’ అనే స్థితి’’ అని చెప్పారు.


నేను దేహాన్ని కాదు...

తన దేహత్యాగం గురించి మెహెర్‌ బాబా ఎన్నో నెలలు ముందుగానే అనేక సంకేతాలు ఇచ్చారు. 1969లో పుణేలో తన భక్తులకు ప్రత్యేక దర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  మౌనావతారునిగా తాను ఇచ్చే ఈ దర్శనం చిట్ట చివరినీ, అనన్య సామాన్యమైనదనీ చెప్పారు.. ‘‘నేను ఈ దఫా పడుకుని దర్శనమిస్తాను. అలాచేస్తే బాగుండదా?’’ అని ప్రశ్నించారు. అయితే, చివరి క్షణం దాకా ఈ మాటల అంతరార్థం ఎవరికీ అర్థం కాలేదు. 1969 జనవరి 29న బాబా తీవ్రమైన ఫిట్స్‌తో బాధపడ్డారు. ఆ మరుసటి రోజు రాత్రి బావూజీ అనే తన సన్నిహిత మండలి సభ్యుడిని పిలిచి... ‘‘ఇది గుర్తుంచుకోండి... నేను ఈ శరీరాన్ని కాదు... భగవంతుణ్ణి’’ అని ప్రకటించారు. ‘‘బాబా ఈ మాటల్ని నా హృదయానికి తాకేలా, తన సంజ్ఞలతో కాక, తన స్వరంతో అన్నార’’ని బాపూజీ చెప్పారు. ‘‘నేను మరో ఏడు రోజుల తర్వాత  నూరు శాతం బాగవుతాను. ఆపై ఈ బాధలు నాకు ఉండవు’’ అని  బాబా ఏరుచ్‌ అనే మరో సహచరుడితో అన్నారు. అయితే  జనవరి 31వతేదీ మధ్యాహ్నం వచ్చిన తీవ్రమైన ఫిట్స్‌ బాబాను కుదిపివేశాయి. దాంతో ఆయన శ్వాస స్తంభించింది. 


బాబా భౌతిక దేహాన్ని ముందుగా బాబా నిర్ణయించిన మెహెరాబాద్‌లోని సమాధి ప్రాంగణంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. ఏడు రోజుల తర్వాత కూడా ఆయన దేహంలో ఎలాంటి మార్పులూ లేవు. ఏడో రోజు బాబా సమాధి కార్యక్రమం ముగిసింది. జొరాస్ట్రియన్‌ క్యాలెండర్‌ ప్రకారం ఆ రోజున పార్శీయుడైన బాబా జన్మదినం. ఇది కాకతాళీయంగా కనిపిస్తుంది. కానీ, ఆయనకు అంతా అవగతమే. 

ప్రముఖ పత్రికా సంపాదకుడు నీలంరాజు వెంకట శేషయ్య మెహెర్‌బాబా శరీరత్యాగం గురించి ప్రస్తావిస్తూ... ‘‘మెహెర్‌బాబా తాను భగవదవతారమని ప్రకటించుకొన్న మాట నిజమే. ఆయన ఉపదేశించిన భగవత్ర్పార్థన ‘శ్రీమన్మహాభాగవతం’లోని ఏస్తోత్ర రాజానికీ తీసిపోదు. అంతటి గొప్ప ఉదాత్త భావాలతో భగవంతుని భావించి, ప్రేమించడం నేర్చుకోవడం కంటే ఉత్తమమైన సాధన మరేముంటుంది? మెహెర్‌బాబా ఉద్బోధించిన ప్రేమ మానవ హృదయాలలో పాదుకొన్నప్పుడు, ప్రపంచ స్వరూపమే పూర్తిగా మారిపోయే మాట నిశ్చయం. తన ఆధ్యాత్మిక తేజస్సుతో యావత్ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఒక మహాపురుషుని భౌతిక జీవనం ముగిసినది’’ అని పేర్కొన్నారు.


భూకైలాస్‌...

మహారాష్ట్రలోని మెహెరాబాద్‌ గ్రామంలోని చిన్న కొండపైన మెహెర్‌బాబా సమాధి ఉంది. దాన్ని 1927లోనే మెహెర్‌బాబా స్వీయ పర్యవేక్షణలో నిర్మించారు. ప్రతి సంవత్సరం జనవరి 31 మధ్యాహ్నం.. బాబా మరణ సమయమైన  12 గంటల నుంచి పావుగంట సేపు భక్తులు ఆయనను స్మరిస్తూ మౌనం పాటిస్తారు. మానవాళికి ఆధ్యాత్మికోన్నతి కలిగిస్తున్న .మెహెర్‌ బాబా సమాధి నిరాడంబరతకు నిర్వచనంగా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి సంప్రదాయ కర్మకాండలు, పూజలు, క్రతువులూ ఉండవు. అర్చకులు ఉండరు. విరాళాల కోసం హూండీలు ఉండవు. ఎంతటివారైనా మౌనంగా క్యూలో నిలబడి... బాబాను దర్శించుకుంటారు. బాబా భక్తులు ఈ ప్రాంగణాన్ని ‘భూకైలాస్‌’ అని పిలుచుకుంటారు.


డాక్టర్‌ మల్లాది కృష్ణానంద్‌,  9959553218

Updated Date - 2022-01-28T05:30:00+05:30 IST