Information Technology Rules, 2021 : ముసాయిదా సవరణలు ఇవే

ABN , First Publish Date - 2022-06-09T01:27:16+05:30 IST

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021కు తాజా ముసాయిదా సవరణలను

Information Technology Rules, 2021 : ముసాయిదా సవరణలు ఇవే

న్యూఢిల్లీ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021కు తాజా ముసాయిదా సవరణలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేసన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ప్రచురించింది. పేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల కంపెనీలు తీసుకునే కంటెంట్ మోడరేషన్ నిర్ణయాలను రద్దు చేయగలిగే అపీలు కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ ముసాయిదా పేర్కొంది. 


ఇదేవిధమైన ప్రతిపాదనతో MeitY గత వారం ఓ ముసాయిదాను విడుదల చేసింది. కానీ కొద్ది గంటల్లోనే ఆ ముసాయిదాను ఉపసంహరించుకుంది. అయితే సోమవారం రాత్రి తాజాగా విడుదల చేసిన ముసాయిదా కూడా చాలా వరకు అంతకుముందు విడుదల చేసిన ముసాయిదా మాదిరిగానే ఉంది. 


అపీలు కమిటీలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ ముసాయిదా ప్రతిపాదించింది. సామాజిక మాధ్యమాల కంపెనీలు కంటెంట్ మోడరేషన్ కోసం తీసుకునే నిర్ణయాలను తోసిపుచ్చగలిగే అధికారాలను  ఈ కమిటీలకు  కల్పించాలని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ గ్రీవియెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపింది. ప్రతి కమిటీకి ఓ చైర్‌పర్సన్, ఇతర సభ్యులను నియమించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో ప్రచురించే నోటిఫికేషన్ ప్రకారం ఈ నియామకాలు జరగాలని పేర్కొంది. 


ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల కంపెనీల గ్రీవియెన్స్ అధికారి కంటెంట్ మోడరేషన్ డెసిషన్స్ తీసుకున్నపుడు, ఆ నిర్ణయాలు యూజర్‌కు సంతృప్తికరంగా లేకపోతే, ఆ యూజర్ ప్రతిపాదిత ప్రభుత్వ నియమిత అపీల్స్ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈ గ్రీవియెన్స్ అపిలేట్ కమిటీ ఇచ్చే ప్రతి ఆర్డర్‌ను సంబంధిత సామాజిక మాధ్యమ కంపెనీ పాటించాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం కంపెనీల కంటెంట్ డెసిషన్స్‌పై యూజర్లు కేవలం కోర్టులను మాత్రమే ఆశ్రయించడానికి అవకాశం ఉంది. 


సోషల్ మీడియా కంపెనీలు నియమించుకునే గ్రీవియెన్స్ అధికారులకు అదనపు బాధ్యతలను ఇవ్వాలని తాజా ముసాయిదా ప్రతిపాదించింది. తప్పుడు పేటెంట్లు, కాపీరైట్ ఉల్లంఘనలు, భారత దేశ సమగ్రతకు ముప్పు కలిగించడం వంటి ఆరోపణలతో కంటెంట్ గురించి యూజర్ ఫిర్యాదు చేసినపుడు 72 గంటల్లోగా గ్రీవియెన్స్ అధికారి పరిష్కరించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం యూజర్ల ఫిర్యాదులపై స్పందించేందుకు 15 రోజుల గడువు ఉంది. 


తాజా ముసాయిదా ప్రతిపాదనలు నూతన ప్రమాణాలతో కూడిన జవాబుదారీతనాన్ని హామీ ఇస్తాయని, తద్వారా భారత పౌరులకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పెద్ద టెక్ కంపెనీలు ఉల్లంఘించకుండా చూస్తాయని MeitY సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. ఐటీ రూల్స్, 2021ను స్ఫూర్తిదాయకంగా, తు.చ. తప్పకుండా యథార్థంగా అమలయ్యేలా ఈ ముసాయిదా జాగ్రత్తవహిస్తుందని పేర్కొంది. సమస్యల పరిష్కారానికి పటిష్ట యంత్రాంగం ఉండాలని ఐటీ రూల్స్, 2021 చెప్తున్నట్లు తెలిపింది. సామాజిక మాధ్యమాల కంపెనీల గ్రీవియెన్స్ ఆఫీసర్లు తమకు వచ్చే ఫిర్యాదులను సంతృప్తికరంగా, న్యాయంగా పరిష్కరించని ఉదాహరణలు చాలా ఉన్నాయని వివరించింది. ఇటువంటి పరిస్థితిలో యూజర్ల హక్కులు, ప్రయోజనాలను కాపాడటం కోసం అపిలేట్ ఫోరం అవసరం ఉందని ప్రతిపాదించినట్లు తెలిపింది. 


తాజా ముసాయిదాపై ఆందోళన

ప్రభుత్వ నియమిత కమిటీల ఏర్పాటు ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తమవుతోంది. సామాజిక మాధ్యమాల కంపెనీల కంటెంట్ డెసిషన్స్‌ను ప్రభుత్వం తోసిపుచ్చే అవకాశం ఉంటుందని కొందరు ఆరోపిస్తున్నారు. ఎటువంటి చట్టపరమైన ప్రాతిపదిక లేకుండా, సామాజిక మాధ్యమాల్లోని కంటెంట్‌ను నేరుగా ప్రభుత్వ తనిఖీకి లోబడి ఉండేలా చేయాలనుకుంటోందని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు తీసుకునే నిర్ణయాలపై యూజర్లు MeitY నియమించే గ్రీవియెన్స్ అపిలేట్ కమిటీకి అపీలు చేయవచ్చునని చెప్పడమంటే కంటెంట్‌ను ప్రభుత్వం తనిఖీ చేయడమేనని ఆరోపిస్తున్నారు. 


Updated Date - 2022-06-09T01:27:16+05:30 IST