మెల్‌బోర్న్ దంపతుల అమానవీయం.. భారతీయురాలిని 8ఏళ్లు బందీగా చేసుకుని..

ABN , First Publish Date - 2021-07-21T22:33:31+05:30 IST

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీలంకకు చెందిన ఓ జంట.. భారతీయ మహిళను ఏకంగా 8 ఏళ్లు బందీగా చేసుకుని వెట్టిచాకిరీ చేయించుకున్నారు.

మెల్‌బోర్న్ దంపతుల అమానవీయం.. భారతీయురాలిని 8ఏళ్లు బందీగా చేసుకుని..

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీలంకకు చెందిన ఓ జంట.. భారతీయ మహిళను ఏకంగా 8 ఏళ్లు బందీగా చేసుకుని వెట్టిచాకిరీ చేయించుకున్నారు. విజిటింగ్ వీసాపై మెల్‌బోర్న్ వెళ్లిన భారతీయురాలిని ఇంట్లో బంధించి బానిసగా మార్చేశారు దంపతులు. సరిగ్గా భోజనం కూడా పెట్టకుండా రోజులో 23 గంటలు పని చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా ఆమెను పలుమార్లు శారీరకంగా కూడా హింసించారు. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈ క్రమంలో ఆమెను ఆస్పత్రికి తరలించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టిన శ్రీలంక దంపతులకు విక్టోరియా సుప్రీంకోర్టు తాజాగా శిక్షను ఖరారు చేసింది. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెల్‌బోర్న్‌లోని మౌంట్ వేవర్లీలో నివాసం ఉండే కుమతిని కన్నన్(53), కందసామీ కన్నన్(57) అనే దంపతులు ఈ అమానవీయ ఘటనకు పాల్పడ్డారు. తమిళనాడుకు చెందిన మహిళను 2007 నుంచి 2015 వరకు తమ వద్ద బందీగా చేసుకున్నారు. కేవలం ఒక నెల గడువు గల విజిటింగ్ వీసాపై మెల్‌బోర్న్ వచ్చిన భారత మహిళను పనిమషిగా నియమించుకున్న కన్నన్ దంపతులు ఏకంగా 8 ఏళ్లు బందీగా చేసుకుని చిత్రహింసలకు గురి చేశారు. రోజుకి 23 గంటలు పని చేయించుకుని భోజనం కూడా సరిగ్గా పెట్టేవారు కాదు. అలాగే తీవ్రంగా కొట్టడం, వాతలు పెట్టడం చేశారు. దాంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో 60 ఏళ్ల వయసు గల బాధితురాలి శరీర బరువు కేవలం 40 కిలోలు ఉండడం వైద్యులకు షాకిచ్చింది. 


డయబెటిస్‌తో పాటు ఇతర రోగాలతో ఆమె శరీరం పూర్తిగా విషపూరితంగా మారినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో బాధితురాలిని అసలు విషయం అడిగి తెలుసుకున్న వైద్యులు షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కన్నన్ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసు విక్టోరియా సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో కన్నన్ దంపతులు తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో ఇంతటి దారుణానికి పాల్పడిన కుముతినికి 8 ఏళ్లు, ఆమె భర్త కందసామీకి 6 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. జడ్జి జాన్ ఛాంపియన్ ఈ ఘటనను అమానవీయ ఘటనగా పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-21T22:33:31+05:30 IST