ఇకపై ఆయన నుంచి ఎలాంటి సాయం తీసుకోబోను: మిలిందా గేట్స్

ABN , First Publish Date - 2021-05-05T16:21:11+05:30 IST

మైక్రోస్టాఫ్‌ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌(65).. ఆయన సతీమణి మిలిందా(56) తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇకపై ఆయన నుంచి ఎలాంటి సాయం తీసుకోబోను: మిలిందా గేట్స్

విడాకుల విషయమై మా మధ్య ఎలాంటి ముందస్తు ఒప్పందం లేదు: మిలిందా

న్యూయార్క్‌: మైక్రోస్టాఫ్‌ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌(65).. ఆయన సతీమణి మిలిందా(56) తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకుంటున్నట్లు బిల్‌గేట్స్‌ దంపతులు వెల్లడించారు. ఈ మేరకు ఇకపై తాము కలిసి ఉండలేమని బిల్‌గేట్స్‌, మిలిందా సోమవారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం దీన్ని బిల్‌గేట్స్‌ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్‌ చేశారు. ఇక మిలిందా గేట్స్ సోమవారం బిల్ గేట్స్ నుండి విడాకుల కోసం అధికారికంగా దాఖలు కూడా చేశారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విడాకుల విషయమై తమ మధ్య ఎలాంటి ముందస్తు ఒప్పందం లేదని అన్నారు. ఆస్తుల పంపకం గురించి కూడా తమ మధ్య ఎలాంటి అంగీకారం లేదన్నారు. బిల్ గేట్స్ నుంచి తాను ఎలాంటి భరణం ఆశించడం లేదని స్పష్టం చేశారు. ఇకపై ఆయన నుంచి తాను దాంపత్యపరమైన ఎలాంటి సాయం కోరబోనని మిలిందా స్పష్టం చేశారు. ఇక 1994లో హవాయిలో వివాహం చేసుకున్న బిల్, మిలిందా ఇలా 27 ఏళ్ల తర్వాత విడిపోతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ దంపతులకు 18-25 ఏళ్లలోపు వయసుగల ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇలా లేటు వ‌య‌సులో ఈ సంచ‌ల‌న నిర్ణ‌యంతో ఒకింత అంద‌రికీ షాకిచ్చారు బిల్‌గేట్స్ దంప‌తులు.  


ఇదిలా ఉంటే.. ఈ ఇద్ద‌రు కలిసి 2000 నుంచి బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ను నడుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటివరకూ 53 బిలియన్‌ డాలర్లను వివిధ స్వచ్ఛంద కార్యాక్రమాలకు వినియోగించారు. తాము విడిపోయిన ఈ ఫౌండేషన్ కోసం మాత్రం కలిసి పని చేస్తామని బిల్‌గేట్స్ దంపతులు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం బిల్‌గేట్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తి విలువ సుమారు 137 బిలియన్ డాలర్లు.  

Updated Date - 2021-05-05T16:21:11+05:30 IST