స్మరణీయ సంపాదకుడు

ABN , First Publish Date - 2022-08-01T06:10:13+05:30 IST

‘‘ఇటుల 1902 సంవత్సరం జూన్‌ నెల 8 తేదీ వరకు ‘దేశోపకారి’ అర్ధవార పత్రికయు, వారపత్రికయు, ‘హిందూసుందరి’ పత్రికయు ప్రచురించి తిని. శుష్కప్రియములు, శూన్యహస్తములు...

స్మరణీయ సంపాదకుడు

‘‘ఇటుల 1902 సంవత్సరం జూన్‌ నెల 8 తేదీ వరకు ‘దేశోపకారి’ అర్ధవార పత్రికయు, వారపత్రికయు, ‘హిందూసుందరి’ పత్రికయు ప్రచురించి తిని. శుష్కప్రియములు, శూన్యహస్తములు అన్నటుల మనదేశీయుల కుచితముగా పంపించినంతవరకు సంతోషమే గాని రొక్కమీయమని అడిగిన చేయి వదలుట కష్టము. అర్ధవార పత్రికకు అమితమైన రొక్కము వెచ్చించ వలసి వచ్చినది. దినదినము విశేషశ్రమకోర్చి, చేతిరొక్కము వెచ్చించుకొని ఇతర పనులు చెడి, ఆంధ్రవార్తా పత్రికలు ప్రచురించుటలో గల బుద్ధి తక్కువను గుర్తెరిగి, అర్ధ వారపత్రికకొక్క నమస్కారమును, ఇంతవరకు బాకీయెగరవేసిన చందాదారులకు అనేక శతసహస్ర వందనములతో తత్పత్రికా ప్రకటన ముగించితిని.’’ 


- ‘లా వర్తమాని’, ‘దేశోపకారి’ (వార, అర్ధవార), ‘హిందూ సుందరి’ అనే నాలుగు తెలుగు పత్రికలు ప్రచురించి, చేతులు కాల్చుకున్న మహానుభావుని మనోవేదన ఇది. ఆ మహనీయుడు సత్తిరాజు సీతారామయ్యగారు (1864-1945).


తెలుగు పత్రికా చరిత్రలో క్షణప్రభలా వెలిగి మటుమాయ మైన ఈయన పేరు నిజానికి పదికాలాలపాటు నిలిచిపోవా ల్సిందే! ఈ మహానుభావుడు నాలుగు ముచ్చటైన పత్రికల్ని వెలువరించి కొంతకాలంపాటు వేలాదిమందిని ఆదర్శ పౌరు లుగా, వ్యక్తులుగా తీర్చిదిద్దిన జ్ఞాని, సమాజ సేవకులు కూడా.


సత్తిరాజు సీతారామయ్య మద్రాసు నుంచి వెలువడే ‘ఆంధ్ర ప్రకాశిక’కు ఉప విలేఖరిగా 1891లో రంగ ప్రవేశం చేశారు. ఆయన చుట్టుపక్కల జరిగే సాంఘిక, రాజకీయ కార్యక్రమాల గురించి, ప్రజల స్థితి గతుల గురించి ఆ పత్రికకు వారం వారం వార్తలు రాసి పంపేవారు. సీతారామయ్య రాతలకు ఎంతగానో సంతోషించిన పత్రికాధిపతి ఎ.సి. పార్థసారధి నాయుడు ‘‘మీశైలి సరళంగా వుంది. మీరు రాసి పంపుతున్న రచనల మీద మేము మీపై పూర్తిగా ఆధారపడి వున్నాము.’’ (15-12-1891) అని ఇంగ్లీషులో ఓ ఉత్తరం రాసి ఆయన్ను అభినందించారు. విలేఖరిగా పేరుపెంపులు సంపాదించుకున్న సీతారామయ్య కదనోత్సాహంతో తన నాలుగేళ్ల వకీలు వృత్తి అనుభవాన్ని వుపయోగించుకుని 1893 జనవరి 3న ‘లా వర్తమాని’ అనే పక్షపత్రికను మొదలుపెట్టారు. అచిరకాలంలోనే ఆ పత్రిక ప్రజాదరణ పొందింది. కోర్టు నిర్ణయాలు, ఆజ్ఞలు, వాద ప్రతివాదాల నివేదనలు, సంఘంలోని కార్యకలాపాల విశేషాల్ని పొందుపరచడం వల్ల ఆ పత్రిక పలువురి ప్రశంసలందుకొంది. ‘‘అధికారులనిన భయపడుటకు కారణము అజ్ఞానము. అట్టి అజ్ఞానమును పోగొట్టుటకు కొంతవరకీ పత్రిక సహకారి. దీనిని చిరాయువునుగా చేసి, ప్రతి గ్రామమువారు తెప్పించు కొందుర’’ని  ‘చింతామణి’ పత్రిక అభినందించింది. సీతారామయ్య స్థాపించి, సంపాదకత్వం వహించిన ‘లా వర్తమాని’ రెండేళ్లపాటు ప్రజల్లో చైతన్యం కలిగించ గలిగింది.


సీతారామయ్యకు, లక్ష్మీదేవి కంటె సరస్వతీదేవి పట్ల ఆరాధనా భావ మెక్కువ. అందువల్ల ఆయన 2 ఏప్రిల్‌ 1893 నుంచి ‘దేశోపకారి’ అనే వార పత్రికను ఏలూరు నుంచే ప్రచురింపసాగారు. ఈ సమాచార వార పత్రిక కొద్ది కాలంలోనే జనులకు ప్రీతిపాత్రమై 1200 చందాదారుల్ని సంతరించుకోగలిగింది. సంవత్సర కాలానికి మరింత పాఠకాదరణ పెంపొందించుకుని 26 ఆగష్టు 1894 నాటి నుంచి అర్ధవార పత్రికగా వెలువడసాగింది. ‘దేశోపకారి’ వార పత్రిక సమకాలీన వారపత్రికలలోకెల్ల ఎక్కువ ప్రజాదరణ పొందగలిగింది. ఆనాడు విద్యావంతుల్లో పూర్వాచారపరాయణులొకవైపు, సంఘసంస్కరణాభిలాషులింకొకవైపుగా చీలివుండే వారు. సంపాదకులైన సీతారామయ్యగారు ఏ పక్షమూ వహించక రెండు పక్షాల కార్యక్రమాల్ని, రచనల్ని ‘దేశోపకారి’లో ప్రచురిస్తూ వుండేవారు. ‘‘ఎవరే దారిన నడచినను దాని ఫలితము వారే అనుభవించెదరని ఉపేక్ష భావమె గాని, దాన్ని నే బాగుపరచెదరని కత్తికట్టి కలహమునకు కాలు దువ్వెడివాడనుగాను. అందు వల్ల అందరు పత్రికాధిపతులు నాకు మిత్రులుగా ఉండెడివారు.’’ (స్వీయ చరిత్రము) సంపాదకుని నిష్ఠవల్ల, లౌక్యం వల్ల ‘దేశోపకారి’ వార పత్రిక కృష్ణ, గోదావరి ప్రాంతాల్లోనే కాక కలకత్తా, కాశి, నాగపూరు, బొంబాయి, బళ్లారి, బెంగళూరు, రంగూను, మోర్మిన్‌ లాంటి సుదూర ప్రాంతాల్లో కూడా పాఠకుల్ని సంపాదించుకోగలిగింది. లక్కవరం జమీందారు మంత్రి ప్రెగ్గడ భుజంగరావు అండదండలతో ‘దేశోపకారి’ అర్ధవార పత్రికను ప్రచురించటం మొదలుపెట్టారు. తమ లక్ష్యాన్ని వారిలా ప్రకటించారు: ‘‘ఆంధ్ర దేశమని ప్రసిద్ధి చెందిన ఉత్తర సర్కారు నందొక్కటైన యాదివార పత్రిక లేకపోవుటయు కృష్ణా గోదావరీ ప్రవా హోదకము వలన ఫలవంతములగు భూములు కలిగి యుండియు, వ్యవసా యము నందును, చేతి పనులందును, వర్తక మందును ఈ ప్రాంతము లితర దేశము లకంటే హీనదశ యందుండుటను బట్టి మేమీ పత్రికను వెలువరించి యితర దేశములయందును దినము నడుచుచున్న విశేషాంశ ములను ప్రచురించి, మా ప్రాంతపు జనుల కుపయుక్త అంశ ముల జూపి తద్ద్వారా దేశాభివృద్ధికై పాటుపడుటయే మా ముఖ్యోద్దేశము.’’ 1901 ఏప్రిలు నుంచి ప్రారంభమైన ఈ అర్ధవార పత్రిక కూడా విశేష పాఠకాదరణకు నోచుకొంది. 


సీతారామయ్యగారి పత్రికా జీవితంలోని చివరి అధ్యాయం ‘హిందూసుందరి’ మహిళా పత్రిక స్థాపన, నిర్వహణలు. ఈమహిళా మాసపత్రిక మొదటి సంచిక 1902 ఏప్రిలు 21న ఏలూరునుంచి వెలువడింది. స్త్రీ జీవితానికి సంబంధించిన రచన లున్నందువల్లా, కాలక్రమంలో వనితామణుల రచనలు తామర తంపరగా వుండటంవల్లా ఆ పత్రిక మహిళల మనస్సుల్ని చూర గొన గలిగింది. ప్రారంభంలో సత్తిరాజు సీతారామయ్య గారే సంపాదక బాధ్యత వహించి నిర్వహించినా అనతి కాలంలోనే పత్రిక బరువుబాధ్యతల్ని మహిళలకే అప్పగించారు. పులుగుర్త లక్ష్మీనరసమాంబ, బండారు అచ్చమాంబ, కొటికలపూడి సీతమ్మ, మొసలికంటి రామాబాయమ్మ, బాలాంత్రపు శేషమ్మ ప్రభృ తులు ‘హిందూసుందరి’కి బాసటగా నిలిచి త్రికరణశుద్ధిగా శ్రమించారు. కాలక్రమంలో వీళ్లే పత్రికా సంపాదక బాధ్యతలు కూడా వహించారు. సీతారామయ్య గారి అకుంఠిత కృషి వల్ల ‘హిందూసుందరి’ ప్రచురణ నాలుగో సంవత్సరంలోనికి కాలుమోపేనాటికి 76మంది ఉప విలేఖరు రాళ్ళు తమ తమ ప్రాంతపు మహిళా కార్యక్రమాల నివేదనలు, స్త్రీల జీవితాలకు సంబంధించిన కవితలు, కథలు, వ్యాసాలు పంపేవారు. సీతారామయ్య పత్రికకు రచనలు పంపమని చాలామంది రచయిత్రులకు లేఖలు రాసేవారు. అంతేగాక, రచయిత్రుల జాబుల్లోని విషయాల్ని మరొకరికి తెలియచేస్తూ, వాళ్లల్లో పరస్పర స్నేహం కలిగేలా సేతువుగా పని చేసేవారు. ఈ మాసపత్రిక 1908 జనవరి ఆరవ సంపుటి ఐదవ సంచికతో నిద్రలోకి జారుకోవడం మాత్రం విచారకరం.


సీతారామయ్య స్థాపించిన ‘లా వర్తమాని’, ‘దేశోపకారి’, ‘హిందూసుందరి’ పత్రికలు స్వాతంత్ర్యానికిపూర్వం నిర్వహించిన భూమిక గణనీయమైనది. ఆదాయం గొర్రెతోక, పరిశ్రమ బర్రెతోకగా జీవయాత్ర సాగించిన కర్మవీరుడు, కార్యశూ రుడు. ఆయన ‘స్వీయచరిత్ర’ను మనుమడు సత్తిరాజు హనుమంతరావు 2002లో ప్రచురించి తెలుగు సాహిత్యానికి మహోపకారం చేశారు.

ఘట్టమరాజు, 99640 82076

Updated Date - 2022-08-01T06:10:13+05:30 IST