చిరస్మరణీయులు... జానమద్ది : వీసీ

ABN , First Publish Date - 2021-03-01T04:55:36+05:30 IST

సీపీ బ్రౌన్‌ గ్రంథాలయాన్ని నెలకొల్పిన జానమద్ది హనుమఛ్చాస్త్రి చిరస్మరణీయులని యోగివేమన విశ్వవాద్యాలయం వీసీ మునగాల సూర్యకళావతి పేర్కొన్నారు.

చిరస్మరణీయులు... జానమద్ది : వీసీ
సమావేశంలో మాట్లాడుతున్న వీసీ సూర్యకళావతి

కడప(మారుతీనగర్‌), ఫిబ్రవరి 28: సీపీ బ్రౌన్‌ గ్రంథాలయాన్ని నెలకొల్పిన జానమద్ది హనుమఛ్చాస్త్రి చిరస్మరణీయులని యోగివేమన విశ్వవాద్యాలయం వీసీ మునగాల సూర్యకళావతి పేర్కొన్నారు. జానమద్ది వర్ధంతిని పురస్కరించుకొని సి.పి.బ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎర్రముక్కపల్లెలోని బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో స్మారకోపన్యాసం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సూర్యకళావతి హాజరై తొలుత జానమద్ది చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించి మాట్లాడారు. తదనంతరం సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ అవధానకవి నరాల రామారెడ్డి, వైవీయూ కులసచివులు ఆచార్య విజయరాఘవప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ ఆచార్య సాంబశివారెడ్డి, రామకృష్ణమఠం నిర్వాహకుడు స్వామి సుకృతానంద మహరాజ్‌, ఆకాశవాణి సీనియర్‌ వాఖ్యాత శ్యాంసుందరశాస్త్రి, కేంద్రం బాధ్యుడు మూల మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానంతరం ఆకాశవాణి పూర్వసంచాలకులు మాచిరెడ్డిని, విశ్రాంత ప్రిన్సిపాల్‌ పి.సంజీవమ్మను సత్కరించారు. 


జానమద్దికి ఘన నివాళి

జానమద్ది వర్ధంతి సందర్భంగా బ్రౌన్‌ లైబ్రరీలోని ఆయన కాంస్య విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఖ్యాతిని గడించిన మహోన్నతమైన వ్యక్తి జానమద్ది అని కొనియాడారు. సాహిత్య రంగంలో ప్రతిఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. నివాళులర్పించిన వారిలో అలపర్తి పిచ్చయ్యచౌదరితో పాటు పలువురు పాల్గొన్నారు.


అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన పత్రం

వైవీయూనివర్శిటీ మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ నానో టెక్నాలజీ విభాగం సైంటిస్ట్‌ ప్రొఫెసర్‌ ఎంవి.శంకర్‌, పరిశోధకుడు నాగ కోటేశ్వరరావుల పరిశోధక పత్రం ఎల్జీవర్‌ పబ్లిషర్‌లో అంతర్జాతీయస్థాయిలో ప్రచురితమైంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రచురితానికి కారకులైన నానో టెక్నాలజీ సైంటిస్ట్‌ ప్రొఫెసర్‌ ఎం.వి.శంకర్‌, పరిశోధకుడు నాగకోటేశ్వరరావులను వైవీయూ వీసీ సూర్యకళావతి, యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌, అధ్యాపకులు, ప్రిన్సిపాల్‌ సాంబశివారెడ్డి, పరిశోధకులు అభినందించారు. 

Updated Date - 2021-03-01T04:55:36+05:30 IST