మానసిక రోగులూ మన పౌరులే!

ABN , First Publish Date - 2022-05-10T06:39:40+05:30 IST

‘దిక్కులేని వారికి ఎవరు దిక్కు’ అని అడిగితే ‘దేవుడు’ అని సమాధానం ఇస్తారు ఆస్తికులు. ఆధునిక ప్రజాస్వామ్య సమాజాలపై విశ్వాసం ఉన్న వారు మాత్రం– దిక్కులేనివారిని చూసుకోవాల్సిన బాధ్యత...

మానసిక రోగులూ మన పౌరులే!

‘దిక్కులేని వారికి ఎవరు దిక్కు’ అని అడిగితే ‘దేవుడు’ అని సమాధానం ఇస్తారు ఆస్తికులు. ఆధునిక ప్రజాస్వామ్య సమాజాలపై విశ్వాసం ఉన్న వారు మాత్రం– దిక్కులేనివారిని చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాలది కదా అని నిలదీస్తారు. కానీ దేవుళ్ళూ, ప్రభుత్వాలూ పట్టించుకోకుండా గాలికి వదిలేసిన వర్గాల ప్రజలు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. ఆ వర్గాల్లో ఎలాంటి మినహాయింపులూ లేకుండా కచ్చితంగా ఉండే వర్గం ఒకటుంది. వారే ‘మానసిక రుగ్మతలతో బాధపడుతున్న నిరాశ్రయులు’. పేద అణగారిన వర్గాల ప్రజల కోసం రాజ్యాంగం ఇచ్చిన ఏ హక్కులు కూడా వీరికి కనీసం అందుబాటులో లేవు.


అట్టలు కట్టి, తైల సంస్కారం లేని జుట్టు, చిరిగిన దుస్తులతో తమలో తాము నవ్వుకుంటూ రోడ్లపై తిరుగాడుతూ దేశంలో ఏ నగరానికి వెళ్లినా వీరు అగుపిస్తుంటారు. వీరు మురికి కాల్వల నుండి నీళ్లు తాగుతూ, చెత్త నుంచి ఆహారం ఏరుకొని తింటూ అంత్యత దుర్భర స్థితిలో జీవిస్తున్నారు. దేశంలో అత్యంత పేదల కంటే కూడా వీరి పరిస్థితులు ఘోరంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే వీరికంటూ ఎవరూ లేరు, వీరు స్వీయ రక్షణ చూసుకోలేని స్థితిలో ఉన్నారు. పౌర సమాజం, ప్రభుత్వాలు అసలు ఇలాంటి ప్రజలే లేనట్లు నటిస్తున్నారు.


దేశవ్యాప్తంగా దాదాపు 10లక్షల మంది ‘మానసిక రుగ్మతలతో బాధపడుతున్న నిరాశ్రయులు’ ఉన్నారని 2011 జనాభా లెక్కల నుంచి ప్రభుత్వం అంచనా వేసింది. కానీ 2021 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఆ సంఖ్య 11.5 లక్షలుగా ఉంటుంది. ఐతే ‘మానసిక రుగ్మతలతో బాధపడుతున్న నిరాశ్రయుల’ గణన ప్రత్యేకంగా జరగకపోవడం వలన వారి సంఖ్యకు సంబంధించి చాలా వివాదాలు ఉన్నాయి. ఉదాహరణకు దేశంలో ఉన్న నిరాశ్రయుల సంఖ్య ఆధారంగా వీరి సంఖ్యను నిర్ధారిస్తున్నారు. ఐతే ప్రభుత్వాలు నిరాశ్రయుల సంఖ్యను తక్కువచేసి చూపించడం వలన ‘మానసిక రుగ్మతలతో బాధపడుతున్న నిరాశ్రయుల’ అధికారిక సంఖ్య తక్కువగా కనిపిస్తుంది. అసలు సంఖ్య అధికారిక లెక్కలకు కనీసం 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే వీరికి ఎలాంటి అధికారిక గుర్తింపు కార్డులు ఉండకపోవడంతో ప్రభుత్వాల నుంచి ఎలాంటి సంక్షేమ పథకాల సహాయమూ లభించడం లేదు. వీరిలో పురుషులు, వృద్ధులు, పిల్లలు, మహిళలు ఉన్నారు. ఈ మహిళలు లైంగిక దాడులకు గురికావడం సర్వ సాధారణం.


మానసిక రుగ్మతలతో బాధపడుతున్న అనాధల సంగతి దేవుడెరుగు. అసలు మానసిక ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి సారించడంలేదు. కేంద్ర ఆరోగ్య బడ్జెట్టులో మానసిక ఆరోగ్యానికి కేటాయింపులు చూస్తే ఈ విషయం తేటతెల్లమౌతుంది. ప్రపంచ దేశాల్లో ఆరోగ్య రంగానికి అతితక్కువ కేటాయింపులు చేస్తున్న దేశంలో భారతదేశం ఒకటి. ఆర్థిక సర్వే 2022 ప్రకారం భారతదేశం తన ‘స్థూల దేశీయ ఉత్పత్తి’లో ఆర్థిక సంవత్సరం 2021–22లో ఆరోగ్యంపై కేవలం 2.1శాతం ఖర్చు చేసింది. కోవిడ్ సంవత్సరంలోనే పరిస్థితి ఇలా ఉందంటే కేటాయింపుల కథా కమామీషు అర్థం చేసుకోవచ్చు.


ఇక మన ఆరోగ్య బడ్జెట్లో మానసిక ఆరోగ్యానికి కేటాయింపులు కేవలం 0.8శాతం మాత్రమే. జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమానికి 2021–22 కేంద్ర బడ్జెట్‌లో రూ.40కోట్లు కేటాయించారు. ఈ మొత్తం భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సంవత్సర సంపాదన కంటే తక్కువ. ఇది దేశంలో మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి సగటున 1.9 రూపాయలు చొప్పున ఖర్చు చేయడానికి సరిపోతుంది. ఇక గత సంవత్సర ఖర్చు ఐతే కేవలం 29కోట్లు అంటే సగటున ప్రతి వ్యక్తికీ దాదాపు 1.4రూపాయలను కేంద్రం ఖర్చు చేసింది. ఇక మానసిక ఆరోగ్యానికి జరుగుతున్న కేటాయింపులలో ఎంత శాతం ‘మానసిక రుగ్మతలతో బాధపడుతున్న నిరాశ్రయులు’ కోసం ఖర్చు చేస్తున్నారో లెక్కలు లేవు.


దేశంలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు సేవలను అందించడం, వారి హక్కులను కాపాడడం లక్ష్యంగా ‘మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం’ 2017 నుంచి అమలులోకి వచ్చింది. ఈ వ్యక్తులు వివక్షకు గురికాకుండా లేదా వేధింపులకు గురికాకుండా గౌరవప్రదంగా జీవించే హక్కును కలిగి ఉన్నారని చట్టం నిర్ధారిస్తుంది. గత చట్టాల కంటే 2017 చట్టం ప్రగతిశీలమైనది, రోగిని కేంద్రంగా చేసుకొని సాగేదీ, హక్కులకు అనుగుణంగా సాగేదీ అయినా– దీని అమలు చూసినపుడు మాత్రం తీవ్ర నిరాశ కలగకమానదు. 51 పేజీల ఈ చట్టంలో ‘మానసిక రుగ్మతలతో బాధపడుతున్న నిరాశ్రయుల’  ప్రస్తావన కేవలం రెండుసార్లు మాత్రమే కనిపిస్తుంది. ఈ చట్టం సెక్షన్ 100 ప్రకారం తమ పోలీస్ స్టేషన్ పరిధిలో మానసిక అనారోగ్యంతో బాధపడుతూ, స్వీయ రక్షణ చేసుకోలేని స్థితిలో, నిరాశ్రయులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. కానీ చిన్న చిన్న మినహాయింపులు తప్ప అలా జరుగుతున్న దాఖలాలు రెండు రాష్ట్రాలలోనూ ఎక్కడా కనిపించడం లేదు.


అలాగే ‘మానసిక రుగ్మతలతో బాధపడుతున్న అనాథ’లను దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు పంపడానికి కూడా పోలీసులు చొరవ తీసుకోవడం లేదు. దానికి కారణం మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం 1987 ప్రకారం వారిని స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆసుపత్రికి తరలించడానికి అవసరమైన ఉత్తర్వులు తీసుకోవాలి. ఈ తతంగానికి భయబడి పోలీసులు తమ బాధ్యత నుంచి మొహం చాటేస్తున్నారు. కానీ 2017 చట్టం మేజిస్ట్రేట్ ముందు తప్పనిసరిగా హాజరుపరచాలని చెప్పకపోయినా ఇప్పటికీ పోలీసులు అదే భావనలో ఉన్నారు. పోలీసులలో మానసిక ఆరోగ్య సంరక్షణా చట్టం 2017 గురించి అవగాహన పెంపొందించడానికి ప్రభుత్వాల వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలూ జరగడం లేదు.


నిజానికి పోలీసులు మాత్రమే కాదు, మెంటల్ ఆసుపత్రులలో పనిచేస్తున్న వైద్యులకు సైతం చట్టం అవగాహన ఉండడం లేదు. పౌరులు/స్వచ్ఛంద సేవా సంస్థలు చొరవ తీసుకుని ‘మానసిక రుగ్మతలతో బాధపడుతున్న నిరాశ్రయులను’ ఆసుపత్రికి తరలిస్తే మేజిస్ట్రేట్ ఉత్తర్వులు లేకుండా అడ్మిట్ చేసుకోమని ‘విశాఖ మెంటల్ హాస్పిటల్ యాజమాన్యం’ నిరాకరించిన ఘటనలు ఇమ్ముడి ముబ్బడిగా జరిగాయి. ఈ విషయాన్ని సామాజిక కార్యకర్తలు ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ’ దృష్టికి తీసుకొని వెళ్లడం, దానితో ప్రభుత్వం ఆసుపత్రిలో జాయిన్ చేసుకోవడానికి మేజిస్ట్రేట్ ఉత్తర్వులు అవసరం లేదని సర్క్యులర్ జారీ చేయడంతో సమస్య పరిష్కారమైంది. మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం 2017 అమలుతీరు పైన పేర్కొన్న సంఘటనతో తేటతెల్లమవుతుంది.


అలాగే చట్ట ప్రకారం రాష్ట్ర స్థాయిలో, జనాభా ప్రాతిపదికన కొన్ని జిల్లాలకు కలిపి కానీ ఒక్కొక్క జిల్లాకు కానీ మెంటల్ హెల్త్ రివ్యూ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఒకవేళ ఎవరైనా తమపై మానసిక రోగిగా ముద్రవేసి అక్రమంగా ఆసుపత్రిలో నిర్బంధించారని ఈ బోర్డుకు ఫిర్యాదు చేస్తే బోర్డు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలి. చట్టం అమలులోకి వచ్చి దాదాపు ఐదేళ్లు గడచినా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ బోర్డుల ఏర్పాటు జరగలేదు. దీనివలన రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు ఉల్లంఘన జరిగి అక్రమంగా నిర్బంధానికి గురైన వారి సంగతి పట్టించుకునేవారు లేరు. మానసిక సంబంధ సమస్యల చికిత్సను ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ తదితర పథకాల పరిధిలోని తీసుకువచ్చినా అవి చెప్పుకోదగ్గ ఫలితాలను ఇవ్వడం లేదు. ఎందుకంటే– వాటి నిబంధనలు సంక్లిష్టంగా ఉండడం వలన ఆ పథకాలలో సేవలు అందించడానికి ఆసుపత్రులు ముందుకు రావడం లేదు.


ఈ పరిస్థితిలో మీన మేషాలు లెక్కపెట్టకుండా సత్వరమే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ‘మానసిక రుగ్మతలతో బాధపడుతున్న నిరాశ్రయుల’ జనగణన చేపట్టాలి. 2017 చట్టాన్ని అనుసరించి ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర, జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు జాప్యం లేకుండా ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో సమస్య ఉన్న వారినందరినీ ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించాలి. అలాగే ప్రస్తుతం పూర్తిస్థాయి మానసిక చికిత్సాలయాలు కేవలం హైదరాబాద్, విశాఖపట్నాలలో మాత్రమే ఉన్నాయి. వీటిని పెంచాల్సిన అవసరం ఉంది. జిల్లా, మండల స్థాయి ఆసుపత్రులలో మానసిక చికిత్స అందించడానికి కనీస సదుపాయాలు కల్పించాలి.


మానసిక రుగ్మతలతో బాధపడేవారికి పౌర హక్కులు ఉంటాయనే స్పృహ మన సమాజంలో కరువైంది. ఈ పరిస్థితి మారినప్పుడు  మాత్రమే ఈ దేశంలో మానసిక రుగ్మతలతో బాధపడే నిరాశ్రయులకు న్యాయం జరుగుతుంది. దేశంలో నిరాశ్రయులుగా సంచరిస్తున్న మానసిక రోగులందరికీ చికిత్స అందించి, కోలుకున్నవారిని తిరిగి తమ కుటుంబంతో కలిసి జీవించడానికి అవకాశం కల్పించినప్పుడే మన రాజ్యాంగ నిర్ణేతలు ఆశించిన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.


‘అస్వస్థతకు గురైన వ్యక్తికి వైద్య సహాయం నిరాకరించినట్లయితే, ఏ సమాజమూ చట్టబద్ధంగా తనను తాను నాగరిక సమాజమని చెప్పుకోజాలదని’ జాతీయ ఆరోగ్య సేవ మార్గదర్శకుడు, ఇంగ్లాండ్ దేశ లేబర్ పార్టీ నాయకుడు ‘అనియూరిన్ బెవన్’ చెప్పిన మాటలు పాలకులకు శిరోధార్యం కావాలి.

చక్రధర్ బుద్ధ 

వెంకట కృష్ణ కగ్గా

Read more