వైరస్ ప్రభావం ఈ రోగులపై ఎక్కువగా..

ABN , First Publish Date - 2020-04-10T17:48:55+05:30 IST

కరోనా వైరస్‌ వల్ల ఎవరికి ఎక్కువగా ముప్పు ఉంటుందనే విషయంలో పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు వృద్ధులకు, మరీ ముఖ్యంగా హృద్రోగ సమస్యలు

వైరస్ ప్రభావం ఈ రోగులపై ఎక్కువగా..

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: కరోనా వైరస్‌ వల్ల ఎవరికి ఎక్కువగా ముప్పు ఉంటుందనే విషయంలో పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు వృద్ధులకు, మరీ ముఖ్యంగా హృద్రోగ సమస్యలు ఉన్నవారికి కొవిడ్‌ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని అందరూ విశ్వసిస్తున్నారు. మానసిక రోగుల్లో కూడా ఈ వైరస్‌ అధికంగా ప్రభావం చూపే అవకాశం ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ జామా సైకియాట్రీలో ప్రచురించిన అధ్యయనం.. కొవిడ్‌ లాంటి వ్యాధులు వచ్చినప్పుడు మానసిక రోగులకు మరిన్ని సమస్యలు ఎదురవుతాయని, వీరికి చికిత్స కోసం సైకియాట్రిక్‌ ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలని సూచించింది. కనీస అవసరాలైన ఆహారం తీసుకోవడం, మందులు వేసుకోవడం కూడా వారికి ఇబ్బందిగా ఉంటుందని పేర్కొంది.


అందువల్ల వీరి నుంచి కరోనా ఇతరులకు వ్యాపించే అవకాశాలు కూడా ఎక్కువని తెలిపింది. వ్యాధి తీవ్రమైతే స్కిజోఫ్రీనియా, బైపోలార్‌ డిజార్డర్‌, డిప్రెషన్‌ తీవ్రం కావచ్చు. సాధారణ మనుషుల్లోనే కరోనా వ్యాప్తి, తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో... తమ పనులు తాము చేసుకోలేని మానసిక రోగులకు రిస్క్‌ మరింత ఎక్కువని అధ్యయనం వెల్లడించింది. స్కిజోఫ్రీనియా వంటి మానసిక రోగాలున్నవారిలో ధూమపానం అలవాటు కూడా ఎక్కువగా ఉంటుంది. మధుమేహం, హైపర్‌ టెన్షన్‌, హృద్రోగాలు కూడా అధికంగానే ఉంటాయి. అందువల్ల కొవిడ్‌ వారిలో తీవ్ర ప్రభావం చూపించవచ్చు. అన్నిటికి మించి.. గత అనుభవాల వల్ల వైద్యం అంటే మానసిక రోగుల్లో ఒక విధమైన వ్యతిరేక భావం ఉంటుంది. కరోనా లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయించుకోవడానికి, చికిత్సకు సహకరించకపోవచ్చు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వీరికి కరోనా సోకకుండా మానసిక చికిత్సాలయాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. గ్రూప్‌ థెరపీలు రద్దు చేయడం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధ్యయనం పేర్కొంది.

Updated Date - 2020-04-10T17:48:55+05:30 IST