పాఠశాలల విలీనం ఆపాల్సిందే!

ABN , First Publish Date - 2022-07-07T06:32:31+05:30 IST

మండలంలోని దోసూరు ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం పాఠశాల వద్ద ఆందోళన చేశారు.

పాఠశాలల విలీనం ఆపాల్సిందే!
బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడి ప్రాథమిక పాఠశాలలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

తల్లిదండ్రులు డిమాండ్‌

పిల్లలతో కలిసి స్కూళ్ల వద్ద ధర్నా

విద్యార్థులను బడికి పంపేది లేదని విస్పష్టం

యథావిధిగా కొనసాగించకపోతే టీసీలు ఇవ్వాలని డిమాండ్‌



ప్రాథమిక పాఠశాలల విలీనంపై ప్రజల నుంచి నానాటికీ వ్యతిరేకత పెరుగుతున్నది. నూతన విద్యావిధానం పేరుతో ఉన్నత పాఠశాలలకు ఒక కిలోమీటరు పరిధిలో వున్న ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను హైస్కూళ్లకు తరలించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లలు రోజూ అంతదూరం ఎలా వెళ్లివస్తారంటూ అధికారులను నిలదీస్తున్నారు. విలీన ప్రక్రియను ఆపకపోతే పిల్లలను బడికి పంపేది లేదని, అవసరమైతే టీసీలు తీసేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. 



అచ్యుతాపురం, జూలై 6: మండలంలోని దోసూరు ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం పాఠశాల వద్ద ఆందోళన చేశారు. 3, 4, 5 తరగతుల్లో 25 విద్యార్థులు వున్నారు. ఉన్నత పాఠశాలకు ఒకటి నుంచి ఒకటిన్నర కిలోమీటర్‌ దూరంలో నివాసాలు వున్నాయని, చిన్నారులు రోజూ అంతదూరం వెళ్లి రావడం కష్టమని వాపోయారు. ప్రాథమిక పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని, లేదంటే పిల్లలకు టీసీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో బి.చిన్నారి, సీహెచ్‌.వరలక్ష్మి, ఎం.ముత్యాలమ్మ, పి.ఉమ తదితరులు పాల్గొన్నారు. కాగా నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పూడిమడక పంచాయతీ కొండపాలెం ప్రాథమిక పాఠశాల వద్ద టీడీపీ నాయకులు మేరుగు బాపునాయుడు, పొన్నమళ్ల కొండబాబు, మేరుగు మహేశ్‌, దోని కాసుబాబు, ఉమ్మిడి కొండయ్య, చేపల బాలకృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. 


దిబ్బిడిలో...

బుచ్చెయ్యపేట: మండలంలోని దిబ్బిడి ప్రాథమిక పాఠశాల 3, 4, 5 తరగతులను జడ్పీ హైస్కూల్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం విద్యార్థులు, పేరెంట్స్‌ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు ఆందోళన చేశారు. కేబీ రోడ్డు ఎప్పుడూ వాహనాలతో రద్దీగా వుంటుందని, హైస్కూల్‌కి వెళ్లి వచ్చే క్రమంలో తమ పిల్లలకు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇళ్లల్లో అయినా వుంచుకుంటామే తప్ప జడ్పీ హైస్కూల్‌కి పంపేది లేదని తెగేసి చెప్పారు. ఈ కార్యక్రమంలో జి.సుధారాజు, టి.రాజు, బి.నాయుడు, సిహెచ్‌.రాంబాబు, వి.సోమేశ్వరరావు ఎం.అచ్చెయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. 


గెడ్డపాలెంలో....

ఎస్‌. రాయవరం: మండలంలోని గెడ్డపాలెం యూపీ పాఠశాలలో 6, 7, 8 తరగతులను సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న వమ్మవరం జడ్పీ పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈవో మూర్తి పాఠశాలకు చేరుకున్నారు. నూతన విద్యా విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కొన్ని తరగతులను సమీపంలో వున్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నదని చెప్పారు. అందువల్ల గెడ్డపాలెం పాఠశాలలో 6,7,8 తరగతులను కొనసాగించడం వీలుకాదని స్పష్టం చేశారు. ఎంఈవో వివరణతో సంతృప్తి చెందని తల్లిదండ్రులు, ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని, అప్పటి వరకు పిల్లలను వమ్మవరం జడ్పీ ఉన్నత పాఠశాలకు పంపేది లేదని స్పష్టం చేశారు.

కశింకోటలో.. 

కశింకోట: బయ్యవరంలోని ప్రాథమిక పాఠశాల 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలకు తరలించవద్దంటూ తల్లిదండ్రులు బుధవారం ఎంఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హైస్కూల్‌లో సరిపడ వసతి లేదని, పైగా కిలోమీటరు కన్నా ఎక్కువ దూరంలో వున్న ఉన్నత పాఠశాలకు రోజూ వెళ్లి రావడం కష్టమని అన్నారు. తరగతుల తరలింపు ఆపాలని, లేదంటే పిల్లలను బడికి పంపేది లేదని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎం.వెంకటి, జె.జానకిరామయ్య, జి.మంగ, అనంతలక్ష్మి, కొండల ఈశ్వరమ్మ, ఎం.నూకఅప్పారావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T06:32:31+05:30 IST