సమస్యలు పట్టని విలీనం

ABN , First Publish Date - 2022-08-14T06:52:39+05:30 IST

విద్యార్థులు ఈ ఏడాది ఏప్రిల్‌ చివరి వరకూ ఆయా పాఠశాలల్లో చదువుకున్నారు. వేసవి సెలవులు తర్వాత తిరిగి పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ వారు వెళ్లే పాఠశాలలు మారిపోయాయి. దీంతో వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇదీ జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి.

సమస్యలు పట్టని విలీనం

  • ప్రభుత్వ పాఠశాలల విలీనంతో విద్యార్థులు సతమతం
  • దూరం భారంతో పెరుగుతున్న రవాణా ఖర్చులు
  • అయోమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు
  • విలీనంపై జిల్లాస్థాయి కమిటీ: డీఈవో

కాకినాడ రూరల్‌, ఆగస్టు 13: విద్యార్థులు ఈ ఏడాది ఏప్రిల్‌ చివరి వరకూ ఆయా పాఠశాలల్లో చదువుకున్నారు. వేసవి సెలవులు తర్వాత తిరిగి పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ వారు వెళ్లే పాఠశాలలు మారిపోయాయి. దీంతో వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇదీ జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. విలీనం పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలిస్తున్నారు. దీంతో ఏ పాఠశాలకు వెళ్లాలో తెలియక విద్యార్థుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. చాలా గ్రామాల్లో విద్యార్థులు పాఠశాలకోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. కొన్నిచోట్ల వాగులు, వంకలు, రైల్వేగేట్లు, ఫ్లైఓవర్‌ ఇలా ఎన్నో అవరోధాలను అధిగమించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడానికే పాఠశాలలను విలీనం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాలు మాత్రం పాఠశాలలను మూసివేయడం లేదని పక్క స్కూల్లో విలీనం చేశామని చెబుతున్నాయి. నూతన విద్యావిధానం, రేషనలైజేషన్‌ పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పలుచోట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన కూడా చేశారు.

250 మీటర్లనుంచి మొదలు

మొదట్లో 250 మీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలను విలీనం చేయాలని ప్రతిపాదించిన ప్రభుత్వం ఆ తర్వాత ఒక కిలోమీటరుకు పరిధి పెంచింది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై విద్యారంగ నిపుణులను కానీ, ఉపాధ్యాయ సంఘాలను కానీ సంప్రదించకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. దూరంగాఉన్న పాఠశాలలకు పంపేందుకు ఇష్టం లేక తల్లిదండ్రులు ఆడపిల్లల చదువులు మధ్యలోనే ఆపేసే పరిస్థితి నెలకొందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రవాణాచార్జీలు సైతం భారం కానున్నాయని కొంతమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సమస్యలు పట్టించుకోరా..?

పాఠశాలల మధ్య దూరం చూస్తున్న ప్రభుత్వం విద్యార్థుల ఇళ్ల దూరాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం లేదని, విలీనం చేస్తున్న చోట అదనపు తరగతి గదులు ఉన్నాయా? ఉపాధ్యాయులు సరిపడా ఉన్నారా? లేరా? సౌకర్యాలు ఏమున్నాయనే దానిపై ఆరా తీయకపోవడం శోచనీయం. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లోని పరిస్థితులను తెలుసుకోకపోవడం, సరైన కార్యాచరణ లేకపోవడం, కొన్నిపాఠశాలల్లో తరగతి గదులు విద్యార్థులకు సరిపడా లేకపోవడం వంటి సమస్యల కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిళ్లకు తలొగ్గి కొన్ని పాఠశాలల విలీనాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి జిల్లాస్థాయిలో కమిటీని నియమించింది. తరగతుల నిర్వహణకు సరిపడా తరగతి గదులు లేకపోవడంతో పలు పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో చేసేదేమీ లేక పలు పాఠశాలల్లో విడతల వారీగా రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సమస్యల కారణంగా విద్యాశాఖ ప్రభుత్వ ఆదేశాల మేరకు విలీనాన్ని రద్దు చేయాలనే సమస్యపై వినతులను స్వీకరించేందుకు నిర్ణయించింది.

 జిల్లాలో ఇదీ పరిస్థితి

కాకినాడ జిల్లాలోని 21 మండలాల్లో ముందుగా మూడు ప్రాథమికోన్నత, 162 ప్రాథమిక పాఠశాలలను 95 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. తర్వాత 12 ప్రాథమిక పాఠశాలలను 10 ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేయగా మొత్తం 177 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విద్యాశాఖ విలీనం చేసింది.

విలీనంపై వినతులు స్వీకరిస్తున్నాం: డీఈవో

విలీనానికి సంబంధించిన సమస్యలపై ఆయా మండలాల అధికారులనుంచి వినతులు స్వీకరిస్తున్నాం. ఇందుకోసం జిల్లాస్థాయిలో జేసీ, జడ్పీ సీఈవో, ఆర్జేడీ, డీఈవో, ఆర్డీవోలతో కూడిన కమిటీని నియమించారు. వినతులపై సమీక్షించి కమిటీ నివేదికను త్వరలో ప్రభుత్వానికి పంపిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటాం.

Updated Date - 2022-08-14T06:52:39+05:30 IST