విద్యార్థులకు విలీనం కష్టాలు

ABN , First Publish Date - 2022-08-14T06:47:20+05:30 IST

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను కిలోమీటరు దూరంలో గల ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశంలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు.

విద్యార్థులకు విలీనం కష్టాలు

జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశంలో సభ్యుల ఆందోళన

ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

నాడు-నేడు కింద రూ.కోట్లు చేసి బాగుచేసిన పాఠశాలలు నిరుపయోగంగా మారాయి

గోపాలపట్నం బాలిక పాఠశాలలో ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై చైర్‌పర్సన్‌ ఆగ్రహం

హెచ్‌ఎం, ఎంఈవోలపై చర్యలకు ఆదేశం

బియ్యం కార్డుల నుంచి మృతుల వివరాలు తొలగింపులో జాప్యంపై నిలదీత

వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల్లో గిరిజనులకు అన్యాయం

సభ్యులు ఆవేదన


విశాఖపట్నం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను కిలోమీటరు దూరంలో గల ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశంలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో 1, 2,4 స్థాయీ సంఘ సమావేశాలు చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగాయి. విద్యా శాఖపై చర్చ సందర్భంగా నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ మాట్లాడుతూ తమ మండలంలో పలుచోట్ల ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను సమీపంలో ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో విద్యార్థులు అక్కడకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నాడు-నేడు కింద రూ.కోట్లు ఖర్చు చేసి బాగుచేసిన పాఠశాలలు విలీనం కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తూ...ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయాలని కోరారు. దీనిపై జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర మాట్లాడుతూ మూడు నుంచి ఐదో తరగతి చదివే పిల్లలు పక్క ఊరికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. విలీనంపై రెండు నెలల క్రితం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించినప్పుడు అందరం వ్యతిరేకించామని గుర్తుచేశారు. విశాఖ డీఈవో చంద్రకళ మాట్లాడుతూ విలీనంపై అభ్యంతరాలు ఉన్నచోట జాయింట్‌ కలెక్టర్‌, డీఈవో, సమగ్ర శిక్ష అభియాన్‌ ఏపీసీలతో కూడిన కమిటీ పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేసిందన్నారు. నాడు-నేడు కింద పాఠశాలల్లో చేపడుతున్న పనుల శంకుస్థాపనలో ప్రొటోకాల్‌ పాటించడం లేదని జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరంలోని గోపాలపట్నం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శిలాఫలకంపై బయట వ్యక్తుల పేర్లు వేసి పరువు తీశారని డీఈవో చంద్రకళ, సమగ్రశిక్షా అభియాన్‌ ఈఈ నరసింహరావులను నిలదీశారు. జడ్పీ చైర్‌పర్సన్‌, నగర మేయర్‌, మంత్రుల పేర్లు లేకుండా సంబంధం లేని వ్యక్తుల పేర్లను శిలాఫలకంపై ఎలా వేస్తారని మండిపడ్డారు. ఎంఈవో, పాఠశాల హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి డీఈవో చంద్రకళ వివరణ ఇస్తూ శంకుస్థాపనకు సంబంధించి తమకు సమాచారం లేదని, శిలాఫలకంపై పేర్ల గురించి తెలుసుకున్న వెంటనే మార్చి కొత్తది ఏర్పాటుచేశామన్నారు. ఎంఈవో, హెచ్‌ఎంకు షోకాజ్‌ ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ  నాడు-నేడు పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలపై తమ కార్యాలయంతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు మత్స్యలింగం మాట్లాడుతూ ఏజెన్సీ విద్యార్థులకు కేజీబీవీ, జూనియర్‌ కళాశాలలు, రెసిడెన్సియల్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాలని కోరారు. 

పౌర సరఫరాల శాఖపై చర్చ సందర్భంగా చైర్‌పర్సన్‌ సుభద్రతోపాటు సభ్యులు మాట్లాడుతూ బియ్యం కార్డుల నుంచి మృతిచెందిన వ్యక్తుల పేర్లు, వివాహమైన ఆడపిల్లల పేర్లు తొలగించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు.   బియ్యం కార్డుల నుంచి పేర్లు తొలగింపునకు ఎంత సమయం పడుతుందని జడ్పీ ఇన్‌చార్జి సీఈవో మేకా విజయకుమార్‌ మాట్లాడుతూ ప్రశ్నించగా...సచివాలయాల సిబ్బందికి అవగాహన లేకపోవడంతో జాప్యం జరుగుతుందని జిల్లా పౌర సరఫరాల అధికారి సూర్యప్రకాష్‌ అంగీకరించారు. ఎస్‌. రాయవరం, దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యులు కాకర దేవి, సత్యం మాట్లాడుతూ ఆరు నెలల నుంచి మృతుల వివరాలు తొలగించకపోవడంతో అదే ఇళ్లలో అర్హులైన వృద్ధులు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారన్నారు. సహకార శాఖపై చర్చలో జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో రైతులకు సహకార బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంటి యజమాని చనిపోతే కుటుంబ సభ్యులకు వైఎస్సార్‌ బీమా పరిహారం రావడం లేదని పలువురు సభ్యులు ప్రస్తావించగా...చైర్‌పర్సన్‌ సుభద్ర ఏకీభవిస్తూ ఏజెన్సీలో కూడా పలువురికి రాలేదన్నారు. దీనిని అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ సువర్ణ వివరణ ఇస్తూ 2019 నుంచి ఈ పథకం నిలిపివేశామని, అయితే పరిహారం కోసం అర్హులైన వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు. త్వరలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై చర్చ సందర్భంగా హుకుంపేట, జి.మాడుగుల జడ్పీటీసీలు మత్స్యలింగం, డాక్టర్‌ ఎం.వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఇటీవల చేపట్టిన పోస్టుల భర్తీకి సంబంధించి గిరిజనులకు సకాలంలో సమాచారం అందలేదని ఆరోపించారు. గడువు తీరిన తరువాత సమాచారం రావడం వల్ల గిరిజనులు అన్యాయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేయగా చైర్‌పర్సన్‌ వారితో ఏకీకభవిస్తూ భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. కాగా జడ్పీ వైస్‌ చైర్మన్‌ తుంపాల తాతారావు అధ్యక్షతన మూడు, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ అధ్యక్షతన ఐదు, రావికమతం జడ్పీటీసీ సభ్యురాలు తలారి రమణమ్మ అధ్యక్షతన ఆరో స్థాయీ సంఘ సమావేశం జరిగింది. సమావేశాలకు పలువురి సభ్యులతోపాటు సాంఘిక సంక్షేమ జేడీ రమణమూర్తి, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మైథిలి, అల్లూరి జిల్లా హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు, సమగ్రశిక్షా అభియాన్‌ ఏపీసీ శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T06:47:20+05:30 IST