జుట్టు పీక్కోవాల్సిందే..

Dec 5 2021 @ 23:45PM

తెలుగు, ఇంగ్లీషు మీడియం సెక్షన్లు కలిపేస్తారట..

ఉపాధ్యాయుల కొరత అధిగమించే తాజా ఫార్ములా

విలీన హైస్కూళ్లలో 756 మంది టీచర్లకు విధులు

తరగతి గదుల సంఖ్యకు సరిపడా నియామకం

మరో వివాదాస్పద నిర్ణయం దిశగా విద్యా శాఖ


ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 5 : ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీప హైస్కూళ్లల్లోకి తరలించడానికి చేస్తున్న ప్రయ త్నాలు క్షేత్ర స్థాయిలో విఫలమవుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సమగ్ర ప్రణాళిక, మౌలిక వసతులను పట్టించుకోకుండా.. ప్రాథమిక విద్యార్థులకు బోధించేందుకు ఏర్పడిన టీచర్ల కొరతను అధిగమించేందుకు మరో వివాదాస్పద నిర్ణయం దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. దీనిపై రాత పూర్వక ఆదేశాలు లేకుండా సూచనలు పంపింది. తాజా సంస్క రణలు అమలైతే ఇకపై హైస్కూళ్లల్లో తరగతి గదుల సంఖ్యకనుగుణంగా మాత్రమే టీచర్లు ఉంటారు. మరోవైపు ఉపాధ్యాయులు ఎవరూ ఖాళీగా ఉండకుండా వారికి వర్క్‌ లోడు పెంచాలన్న లక్ష్యంలో భాగంగా గరిష్టంగా 42 పిరియడ్‌లు ఉండేలా యోచిస్తున్నారు. 15 ఏళ్ల క్రితం హైస్కూళ్లల్లో ప్రవేశపెట్టిన ఆంగ్ల, తెలుగు మాధ్యమ సెక్షన్లను విలీనం చేసి, ఆ మేరకు ఒకే సెక్షన్‌గా నిర్వహించాలని మౌఖిక ఆదేశాలు జారీచేసింది. 


      టీచర్లకు డిప్యుటేషన్‌ ఆర్డర్లు !

జిల్లాలో తొలి విడతగా 222 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీప 202 హైస్కూళ్లలోకి తరలించారు. ఆ మేరకు ఈ పాఠశాలల్లో సంబంధిత తరగతులు చదివే 13 వేల మంది బాల బాలికలను సర్దుబాటు చేశారు. కానీ, 70 శాతం హైస్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు సరిపడినన్ని తరగతి గదులు లేవు. ఈ సమస్యను పరిష్కరించకుండానే ఇప్పుడు ఆయా స్కూళ్లల్లో టీచర్లను డిప్యూటేషన్లపై వేయడానికి సంకల్పించారు. ఆ ప్రకారం సంబంధిత హైస్కూళ్లకు కొత్తగా 756 మంది ఉపాధ్యాయులు అవసరమవు తారని లెక్క వేశారు. ఈ కొరతను భర్తీ చేయడానికి తొలుత స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధి, ఆ తదుపరి మండల పరిధి, ఆ తరువాత పొరుగు మండలాల పరిధిలోని హైస్కూళ్ల నుంచి టీచర్లను విలీన హైస్కూళ్లకు సర్దుబాటు చేయడానికి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆంగ్ల, తెలుగు మాధ్యమ సెక్షన్లను విలీనం చేసి, మొత్తం విద్యార్థులను ప్రతీ 40 మందికి ఒక సెక్షన్‌గా విభజించి సబ్జెక్టు టీచర్ల ప్యాట్రన్‌ను నిర్దేశించారు. దీంతో ఆంగ్ల, తెలుగు మాధ్యమాల విద్యార్థులు ఒకే తరగతి గదిలో ఉంటారు. బోధన ఏదో ఒక మాధ్యమంలో మాత్రమే ఉండడం వల్ల విద్యార్థులు అయోమయానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఉన్నతాధికారులు పంపిన మౌఖిక ఆదేశాల ప్రకారం సోమవారంలోగా ఆంగ్ల, తెలుగు మాధ్యమ సెక్షన్లను కలిపేసి, సర్‌ప్లస్‌ టీచర్లను గుర్తించి, వారు విలీన హైస్కూళ్లల్లో డిప్యుటేషన్లపై విధులు నిర్వహించేలా ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంది. దీనిపై జిల్లా విద్యాశాఖ ఆదివారం ఒక్క   రోజులోనే కసరత్తు పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. మరోవైపు టీచర్లను కదపడానికి ఎటువంటి సమస్యలు వస్తాయోనని భయ పడుతున్నారు. దీంతో నిమిత్తం లేకుండా కసరత్తు పూర్తిచేసి ఎంత మంది టీచర్లకు డిప్యూటేషన్‌ ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుందో వివరాలు తీసుకుని సోమ వారం అమరావతిలో నిర్వహించనున్న సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు.


      తెలుగు మాధ్యమ విద్యార్థులకు ముప్పే

జిల్లాలో ఆంగ్ల, తెలుగు మాధ్యమాల బోధనకు వేర్వేరు సెక్షన్లతో 246 సక్సెస్‌ హైస్కూళ్లు, కేవలం తెలుగు మాధ్యమానికి పరిమితమైన 129 నాన్‌ సక్సెస్‌ హైస్కూళ్లు ఉన్నాయి. వీటిలో ఆంగ్ల, తెలుగు మాధ్యమ సెక్షన్లను కలిపేయడం వల్ల ఇప్పటికిప్పుడు 9, 10 తరగతులు చదివే 54 వేల మంది బాల బాలికలు అయోమయానికి గురవుతారని ఆందోళన వ్యక్తమవుతోంది. మరో నాలుగు నెలల్లో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు జరగనుండగా, ఇప్పుడు ఆంగ్ల, తెలుగు సెక్షన్లను కలిపి బోధించడం వల్ల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గందరగోళంలో పడే ప్రమాదం ఉంది. ఇక టీచర్‌ తెలుగు మాధ్యమంలో బోధిస్తే పరీక్షలు ఆంగ్ల మాధ్యమంలో రాసేదెలా అనే సమస్య వస్తుంది. మిగతా 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ఇదే సమస్య ఎదురవుతుంది.Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.