మేరీమాత విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2022-08-13T06:07:50+05:30 IST

మేరీమాత విగ్రహం ధ్వంసం

మేరీమాత విగ్రహం ధ్వంసం
ఆర్‌సీఎం చర్చి వద్ద ధ్వంసమైన మేరీమాత విగ్రహం

మచిలీపట్నంలో ఉద్రిక్తత

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 12 : మచిలీపట్నంలో ఆర్‌సీఎం చర్చి వద్ద మేరీమాత విగ్రహాన్ని గురువారం రాత్రి కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో శుక్రవారం నగరంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ కార్యాలయం, పలు పోలీస్‌ స్టేషన్లు, పోలీస్‌ క్వార్టర్ల పక్కనే ఉన్న ఆర్‌సీఎం చర్చిలో ఈ సంఘటన జరగడంపై క్రైస్తవులు మండిపడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ నిరసన చేపట్టారు. దీంతో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు సంఘటనాస్థలం వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. మత పెద్దలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ జాషువా మాట్లాడుతూ నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. కాగా, మేరీమాత విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు ఎండీ ఇలియాస్‌ పాషా, కార్పొరేటర్‌ దేవరపల్లి అనిత, చిన్నం సురేష్‌, పిప్పళ్ల వెంకట కాంతారావు, పీవీ ఫణికుమార్‌, వసంతకుమారిలు ఎస్‌ఐ నాగకల్యాణికి ఫిర్యాదు చేశారు. 

దోషులను అరెస్టు చేయాలి : మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

మేరీమాత విగ్రహం ధ్వంసం చేసిన నిజమైన దోషులను అరెస్టు చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్‌ చేశారు. మేరీమాత విగ్రహం వద్ద కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో పవిత్ర స్థలాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆయన మండిపడ్డారు. 

సంయమనం పాటించాలి : జనసేన 

క్రైస్తవ సోదరులు సంయమనం పాటించాలని, తిరిగి అదే స్థలంలో మేరీమాత విగ్రహం పునఃప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలని జనసేన నాయకుడు లంకిశెట్టి బాలాజీ కోరారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-08-13T06:07:50+05:30 IST