గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2021-02-28T05:21:50+05:30 IST

జిల్లాలోని విద్యుత వినియోగదారుల నుంచి కరెంటు బిల్లులు వసూలు చేసేందుకు గాను మీటరు రీడింగ్‌లను కాంట్రాక్టర్లకు అప్పగిస్తుంటారు. దీనికోసం ఏటా టెండర్లు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాలో 8,22,320 విద్యుత కనెక్షన్లున్నాయి.

గోల్‌మాల్‌
కడప విద్యుత కార్యాలయం

మీటరు రీడింగ్‌ టెండర్లలో మతలబు

యూనిట్‌ విలువపై తగ్గించి టెండర్లు

అలాగైతే మీటరు రీడింగ్‌ ఉద్యోగుల వేతనాల్లో కోత

పొరుగు జిల్లాలో ఇలాంటి టెండర్లు రద్దు

కడపలో చక్రం తిప్పిన ఓ ఉద్యోగి


ఏదైనా కాంట్రాక్టరు ఓ పనిచేస్తే కాసింత మిగలాలని అనుకుంటాడు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా తక్కువకే పనిచేస్తానంటే అందులో నాణ్యతకు తిలోదకాలివ్వాల్సి ఉంటుంది.. లేదా అతని దగ్గర పనిచేసే కార్మికుల వేతనాల్లో కోత పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి విద్యుత మీటరు రీడింగ్‌ టెండర్లలో చోటు చేసుకున్నట్లు విమర్శలున్నాయి. వత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా కావాల్సిన వారికి టెండర్లు కట్టబెట్టార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


కడప, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని విద్యుత వినియోగదారుల నుంచి కరెంటు బిల్లులు వసూలు చేసేందుకు గాను మీటరు రీడింగ్‌లను కాంట్రాక్టర్లకు అప్పగిస్తుంటారు. దీనికోసం ఏటా టెండర్లు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాలో 8,22,320 విద్యుత కనెక్షన్లున్నాయి. నెలనెలా బిల్లు వసూలు కోసం ఈ మీటర్ల నుంచి విద్యుత రీడింగ్‌ తీసి వినియోగదారులకు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు గాను కాంట్రాక్టరుకు ఒక్కో మీటరు రీడింగ్‌ సర్వీసుకు పట్టణాల్లో రూ.5.49, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.68 చెల్లిస్తారు. టెండర్ల ద్వారా మీటరు రీడింగ్‌ తీసే బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పచెబుతుంటారు. 2020-21 సంవత్సరానికి గాను గత ఏడాది జూలైలో టెండర్లు ఆహ్వానించారు. అప్పట్లో టెండర్లు ఖరారై ఉంటే ఆగస్టు 1 నుంచి ఈ ఏడాది జూలై 31 వరకు కాంట్రాక్టర్లకు టెండరు దక్కేది. అయితే చాలా కాలం పాటు ఆ టెండర్లను ఖరారు చేయకుండా జాప్యం చేశారు. చివరకు శనివారం ఖరారు చేశారు. 


టెండర్లలో మతలబు

ఒక్కో మీటరుకు రీడింగ్‌ తీసేందుకు గాను విద్యుతశాఖ గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.68, పట్టణ ప్రాంతాల్లో రూ.5.49 చెల్లిస్తారు. ఇందులోనే మీటరు రీడింగ్‌ తీసే ఉద్యోగికి ఒక్కో మీటరుకు రూ.3.60 ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఉద్యోగికి పీఎఫ్‌, ఈఎ్‌సఐ చెల్లించాలి. రీడింగ్‌ పేపరు, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఉద్యోగి పరిధిలో ఉండే విద్యుత సర్వీసులను బట్టి రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు ఆదాయం ఉంటుంది. కాగా ఇంతకుముందు వరకూ విద్యుతశాఖ సూచించిన యూనిట్‌ విలువపై 0 నుంచి 5 శాతం వరకు పెంచి టెండరు దాఖలు చేసేవారు. అయితే ఈ సారి టెండర్లలో విద్యుతశాఖ సూచించిన యూనిట్‌ విలువ కన్నా తక్కువకు కొందరు టెండర్లు దాఖలు చేశారు. అయితే అనంతపురం, కర్నూలు, తిరుపతిలో తక్కువకు టెండర్లు వేస్తే అక్కడ రద్దు చేశారని తెలిసింది. నెల్లూరులో అయితే తక్కువకు టెండర్‌ వేసిన వారిని ఇనవాలిడ్‌ కింద పెట్టారని సమాచారం. కడపలో మాత్రం తక్కువకు టెండర్లు వేసిన వారికే మీటర్‌ రీడింగ్‌ తీసే బాధ్యతలు అప్పగించారు. ఇలా తక్కువకు దాఖలు చేస్తే రీడింగ్‌ తీసే ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో కోత పెట్టాల్సి వస్తుందని కొందరు ఆరోపిస్తున్నారు. లేదూ సిబ్బందిని తగ్గించాల్సి ఉంటుందని అంటున్నారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ టెండర్లలో గోల్‌మాల్‌ జరిగిందని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యహారంపై ఏపీఎస్పీడీసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, విజిలెన్స జాయింట్‌ మేనేజింగ్‌ డైరక్టరుకు ఫిర్యాదు చేశారు. టెండర్ల గోల్‌మాల్‌లో ఓ ఉద్యోగి కీలకంగా వ్యవహరించి పైరవీలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఆ ఉద్యోగి కొందరితో కుమ్మక్కై ఉన్నతాధికారులపై వత్తిడి తెచ్చారని తెలిసింది.


పారదర్శకంగా నిర్వహించాం: ఎస్‌ఈ

ఈ విషయంపై ఎస్‌ఈ శ్రీనివాసులును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా మీటరు రీడింగ్‌ల టెండర్లను పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. టెక్నాలజీ పెరగడంతో ఖర్చు తక్కువగా ఉంటుందన్నారు. పొరుగు జిల్లాల్లో  తక్కువ శాతానికి వేసిన టెండర్లను రద్దు చేసిన విషయం ప్రస్తావించగా ఆ సంగతి తమకు తెలియదన్నారు.

Updated Date - 2021-02-28T05:21:50+05:30 IST