మీటర్లు రైతులకు ఉరితాళ్లు

ABN , First Publish Date - 2022-05-21T07:15:27+05:30 IST

వ్యవసాయ పంపుసెంట్లకు విద్యుత మీటర్లు బిగించడమంటే రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించడమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

మీటర్లు రైతులకు ఉరితాళ్లు
ఎడ్ల బండిపై నారాయణ, జగదీశ తదితరుల నిరసన ప్రదర్శన

దేశం అదానీ, అంబానీకి ధారాదత్తం

మోదీ కాళ్లతో చెబితే జగన తలతో చేస్తున్నాడు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

అనంతపురం రూరల్‌, మే 20: వ్యవసాయ పంపుసెంట్లకు విద్యుత మీటర్లు బిగించడమంటే రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించడమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వ్యవసాయ పంపుసెంట్లకు మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీపీఐ జిల్లా సమితి, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని తాడిపత్రి బస్టాండ్‌ నుంచి పవర్‌ ఆఫీస్‌ వరకు ఎద్దుల బండిపై నిరసన ప్రదర్శన చేశారు. అన్నదాతల పట్ల ముఖ్యమంత్రి జగన తన వైఖరిని మార్చుకోకపోతే వారి ఆగ్రహానికి బంగాళాఖాతంలో మునిగిపోతాడని నారాయణ హెచ్చరించారు. రైతాంగాన్ని ఆత్మహత్యకు పురికొల్పేలా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను సీపీఐ పూర్తిగా వ్యతిరేకిస్తోందని అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత మీటర్లు బిగించే రైతు వ్యతిరేక కార్యక్రమం దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడా అమలు కాలేదని గుర్తు చేశారు. కమలనాథులు కాళ్ళతో చెబితే జగన తలతో చేస్తున్నాడని విమర్శించారు. 


దేశం తాకట్టు..

ప్రధాని మోదీ అంబానీ, అదానీ కంపెనీలకు దేశాన్ని దోచిపెడుతున్నాడని నారాయణ మండిపడ్డారు. విద్యుత అవసరాలకు అవసరమైన బొగ్గును ప్రతి రాష్ట్రం దిగుమతి చేసుకునేలా నిబంధనలు పెట్టారని అన్నారు. ప్రపంచ దేశాల్లో బొగ్గు గనులు, దేశంలోని ఓడరేవులు అదాని చేతిలో ఉన్నాయని, అదానీ వ్యాపారాన్ని పెంచేకే ప్రధాని ఇలా చేశారని ఆరోపించారు. రాష్ట్రాల ఆదాయాన్ని దెబ్బకొట్టే రీతిలో కేంద్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని విమర్శించారు. విద్యుత ఉత్పత్తి కేంద్రాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, సిమెంట్‌, స్టీల్‌ పరిశ్రమలను ప్రధాని మోదీ అంబానీ, అదానీలకు అప్పజెప్పి భారత ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేశాడని దుమ్మెత్తిపోశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీశ, శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌, అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T07:15:27+05:30 IST