మెతుకుసీమలో సిరుల పంట

ABN , First Publish Date - 2021-06-24T05:08:33+05:30 IST

మెతుకుసీమ పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. అన్నం మెతుకులకు చిరునామాగా నిలిచిన ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ధాన్యపు సిరుల పంట పండింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరగడమే ఇందుకు నిదర్శనం. మూడు జిల్లాల్లో రూ.2 కోట్ల విలువైన 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.

మెతుకుసీమలో సిరుల పంట
సిద్దిపేటలోని ఓ మిల్లులో గుట్టలా పేర్చిన ధాన్యం బస్తాలు

ఉమ్మడి మెదక్‌ జిల్లాకు పూర్వవైభవం

కాసులు కురిపించిన వరిసాగు

మూడు జిల్లాల్లో 11.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

రాష్ట్రంలో ఐదో స్థానంలో సిద్దిపేట.. ఏడో స్థానంలో మెదక్‌

రైతుల ఖాతాల్లో రూ.2 వేల కోట్లకుపైగా జమ


మెతుకుసీమ పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. అన్నం మెతుకులకు చిరునామాగా నిలిచిన ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ధాన్యపు సిరుల పంట పండింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు  జరగడమే ఇందుకు నిదర్శనం. మూడు జిల్లాల్లో రూ.2 కోట్ల విలువైన 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూన్‌ 23 : ఉమ్మడి జిల్లాలో ఈసారి సుమారు 5 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. దాదాపు 13 నుంచి 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందు కోసం సిద్దిపేట జిల్లాలో 405 కొనుగోలు కేంద్రాలు, మెదక్‌ జిల్లాలో 350 కేంద్రాలు, సంగారెడ్డి జిల్లాలో 144 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ నెల నుంచి జూన్‌ 15వ తేదీ వరకు ధాన్యం సేకరించారు. 


11.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం..

సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 5,28,179 టన్నుల ధాన్యం సేకరించి రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచింది. ఇక ఏడో స్థానంలో ఉన్న మెదక్‌ జిల్లాలో 4,26,020 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. సంగారెడ్డి జిల్లాలో 1,76,672 టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా రాష్ట్రంలో 21వ స్థానంలో ఉన్నది. మొత్తంగా 11.30 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగానే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. ఐకేపీ, పీఏసీఎస్‌, మార్కెట్ల ద్వారా ఇదంతా కొనుగోలు చేయగా ఇంకా రైతుల వద్ద తిండిగింజల కోసం నిల్వ ఉన్న ధాన్యం 2 లక్షల టన్నుల వరకు ఉంటుంది. యాసంగి సీజన్‌లో ఈస్థాయి కొనుగోళ్లు జరగడం మెతుకుసీమ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా రైతుల ఖాతాల్లో రూ.2 వేల కోట్లకు పైగానే డబ్బు జమ చేయగా ఇది కూడా రికార్డే. 


మిల్లులు, గోదాములు ఫుల్‌

అనూహ్య స్థాయిలో ధాన్యం దిగుబడి రావడంతో మిల్లులకు తరలించారు. మిల్లుల్లో నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా లేక మిల్లుల ఆవరణలో ధాన్యం నిల్వ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మర పట్టించే వరకు ధాన్యాన్ని సంరక్షించడంలో మిల్లర్లు సతమతమయ్యే పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా విషయానికొస్తే లక్షా 96 వేల టన్నుల సామర్థ్యం ఉన్న 56 గోదాములు ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ నిండిపోయాయి. ధాన్యాన్ని నిల్వ చేయడానికి మార్కెట్లలోని షెడ్లు, ఇతర ప్రైవేట్‌ గోదాములను కూడా వినియోగించక తప్ప లేదు. మళ్లీ వానకాలం సీజన్‌ మొదలైంది. మూణ్నాలుగు నెలల్లో ఈ పంట కూడా చేతికొస్తే ధాన్యాన్ని నిల్వ చేయడం కష్టతరంగా మారుతుందని తర్జనభర్జన పడుతున్నారు. అప్పటిలోగా మిల్లర్లను అప్రమత్తం చేసి మర పట్టించాలని చర్యలు చేపడుతున్నారు. 


కాళేశ్వరం.. కలిసొచ్చిన కాలం

కాళేశ్వరం ఎత్తిపోతల జలాలతోపాటు కాలం కలిసి రావడంతో సాగునీటి వనరులు ఉమ్మడి జిల్లాలో సమృద్ధిగా ఉన్నాయి. కాళేశ్వరం ద్వారా సిద్దిపేట జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్లు నిర్మించారు. ఇక కొండపోచమ్మ సాగర్‌ నుంచి హల్దీవాగు ద్వారా మెదక్‌ జిల్లాకు గోదావరి జలాలను తరలించారు. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సగటున 1400 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాములు మత్తళ్లు దూకాయి. ఇప్పటికీ చెరువులన్నీ నీళ్లతో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలతోపాటు భూ ఉపరితల జలవనరుల ప్రభావం వరిసాగుకు అనుకూలంగా మారింది. ఈ ఫలితంగానే పంట దిగుబడి  పెరిగింది.


వ్యవసాయంలో కొత్త విప్లవం

కోటి ఎకరాల పచ్చని మాగాణి కావాలె నా తెలంగాణ అంటూ సమైక్యపాలనలో పాడుకున్న పాటలను నిజం చేసుకున్నాం. బుక్కెడు బువ్వకు, గుక్కెడు నీళ్లకు గోసపడిన మెతుకుసీమ గాథను చూసి బాధపడ్డాం. నేడు ఎటుచూసినా పచ్చని పొలాలు, గోదావరి జలాలు కనిపిస్తున్నాయి. భూ ఉపరితల జలవనరులు ఉప్పొంగడం వల్లే ధాన్యపు సిరులు కురిశాయి. ప్రతీ ఎకరాకు నీరందేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన యజ్ఞం ఫలించింది. ఇప్పటికే కోనసీమను మించిపోయేలా మెతుకుసీమ రైతులు విజయం సాధిస్తున్నారు. వ్యవసాయంలో కొత్త విప్లవం మొదలైంది. వరిసాగుతోపాటు నూతన విధానాలు, ఆయిల్‌పామ్‌, సెరీకల్చర్‌, ఇతర ఆదాయం వచ్చే పంటల వైపు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. భూమికి బరువయ్యే విధంగా పండిన ధాన్యాన్ని చూసి ఆనందభాష్పాలు వచ్చాయి. 

- హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి



Updated Date - 2021-06-24T05:08:33+05:30 IST