ప్రాణం నిలబెట్టాలన్న గుండె తపనకు మెట్రో ఊపిరి!

ABN , First Publish Date - 2022-09-27T09:25:29+05:30 IST

ఓ శరీరం నుంచి వేరువడిన గుండె, మరో ప్రాణాన్ని నిలబెట్టడం ఎప్పుడెప్పుడా అంటూ కొట్టుకుంది.

ప్రాణం నిలబెట్టాలన్న గుండె తపనకు మెట్రో ఊపిరి!

  • కామినేని ఆస్పతిల్రో 33 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌ 
  • అపోలోలో మరో వ్యక్తి గుండె మార్పిడి.. సక్సెస్‌
  • నాగోలు నుంచి జూబ్లీహిల్స్‌ దాకా రైల్లో తరలింపు
  • 21 కి.మీ దూరం.. 25 నిమిషాల్లోనే పూర్తి

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఓ శరీరం నుంచి వేరువడిన గుండె, మరో ప్రాణాన్ని నిలబెట్టడం ఎప్పుడెప్పుడా అంటూ కొట్టుకుంది. దాదాపుగా ఊపిరొదిలిన వ్యక్తి నుంచి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న మరొకరి హృదయంలోకి చేరి అతడికి ఊపిరిపోసింది. ఈ క్రమంలో ఉప్పల్‌ మ్యాచ్‌ చూసి బయటకొచ్చిన క్రికెట్‌ అభిమానుల హోరుతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ సమస్య నెలకొన్న వేళ తన లయ దెబ్బతినకుండా ఉండేందుకు మెట్రోరైల్‌లో సురక్షితంగా ప్రయాణించింది. ఫలితం.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో ఓ 32 ఏళ్ల వ్యక్తి గుండె మార్పిడి ఆపరేషన్‌ విజయవంతమైంది. వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మట్టంపల్లికి చెందిన 33 ఏళ్ల వ్యక్తికి మెదడుకు తీవ్ర గాయమైంది. ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించగా ఆరోగ్యం విషమించి బ్రెయిన్‌డెడ్‌ అయ్యారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆయన కిడ్నీలు, గుండె, కాలేయం, కార్నియాను వైద్యులు సేకరించారు. మరోవైపు.. మూత్రపిండాలు, గుండె దెబ్బతిని చికిత్స పొందు తున్న 32 ఏళ్ల వ్యక్తికి శస్త్రచికిత్స చేసేందుకు జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో ఏర్పాట్లు జరిగాయి. 


ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంటకు ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌ అపోలో దాకా గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేశారు. కామినేని నుంచి నాగోల్‌ మెట్రో స్టేషన్‌కు అంబులెన్స్‌ ద్వారా 3 నిమిషాల్లోనే గుండెను తరలించారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రోస్టేషన్‌ వరకు 21 కిలోమీటర్ల దూరం. మధ్యలో 17 స్టేషన్లు. అయితే రైలు ఎక్కడా ఆగలేదు. ఫలితంగా నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు 25 నిమిషాల్లోనే చేర్చారు. అక్కడి నుంచి అపోలో ఆస్పత్రికి మూడు నిమిషాల్లో తరలించారు. మొత్తం తరలింపు ప్రక్రియ 30 నిమిషాల్లో పూర్తయింది. అనంతరం కిడ్నీ మార్పిడి కూడా పూర్తి చేశారు. కాగా, బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి సేకరించిన మిగిలిన అవయవాల్లో మరో కిడ్నీని నిమ్స్‌ ఆస్పత్రిలోని ఓ బాధితుడికి అమర్చారు. కార్నియాను సరోజినిదేవి కంటి ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-09-27T09:25:29+05:30 IST