Metro Rail: ఊపందుకున్న మెట్రో పనులు

ABN , First Publish Date - 2022-07-23T18:10:27+05:30 IST

బెంగళూరు శివారులోని దేవనహళ్లి వద్ద ఉన్న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని(Airport) అనుసంధానం చేసేలా బెంగళూరు మెట్రో రైల్‌

Metro Rail: ఊపందుకున్న మెట్రో పనులు

- విమానాశ్రయానికి 57 కిలో మీటర్ల మార్గం

- నిర్మాణానికి రూ.14,788 కోట్ల ఖర్చు

- మొత్తం 30 స్టేషన్లు


బెంగళూరు, జూలై 22 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు శివారులోని దేవనహళ్లి వద్ద ఉన్న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని(Airport) అనుసంధానం చేసేలా బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ చేపట్టిన కొత్త ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. సెంట్రల్‌ సిల్క్‌బోర్డ్‌ నుంచి విమానాశ్రయం వరకు 57 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గంలో మొత్తం 30 స్టేషన్‌లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ మార్గం నిర్మాణానికి రూ.14,788 కోట్లు ఖర్చు కాగలవని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ రైలు మార్గం నిర్మాణం కోసం చేపట్టిన భూస్వాధీన ప్రక్రియ పూర్తి కావస్తోందని, 94 శాతం ప్రక్రియ పూర్తయ్యిందని బీఎంఆర్‌సీఎల్‌(Bmpcl) ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం మీడియాకు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలనుంచి 298 ప్రాంతాల్లో స్థలం అవసరాన్ని గుర్తించామని, ఇందులో 281 ప్రాంతాల్లో స్థల స్వాధీనం ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ భూములను మెట్రో రైల్‌(Metro Rail) నిర్మాణాల కోసం ఇంజనీరింగ్‌ విభాగానికి ఇప్పటికే బదిలీ చేశామన్నారు. కేఆర్‌పురం - హెబ్బాళ్‌ మధ్య కొన్ని పెద్ద పెద్ద చెట్లను వేరొకచోటుకు తరలించే ప్రక్రియ ఇంకా చేపట్టాల్సి ఉందన్నారు. ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రైలు మార్గాన్ని మొత్తం రెండు దశలుగా విభజించారు. 2 ఏలో 18 కిలోమీటర్ల మా ర్గం, 13 స్టేషన్‌లు ఉంటాయి. 2 బీలో 38 కిలోమీటర్ల మార్గం 17 రైల్వే స్టేషన్‌లు(Railway Stations) ఉంటాయని అధికారులు తెలిపారు. 2ఏ మెట్రో మార్గం సిల్క్‌బోర్డు నుంచి ప్రారంభం కానుంది. ఈ మార్గంలో హెచ్‌ఎ్‌సఆర్‌ లే అవుట్‌, అగర, ఇబ్బలూరు, బెళ్ళందూరు, కాడుబీసనహళ్ళి, కోడిబీసనహళ్ళి, మారతహళ్ళి, ఇస్రో, దొడ్డనెక్కుంది, డీఆర్‌డీఓ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, సరస్వతీనగర్‌, కేఆర్‌ పురం స్టేషన్‌లు ఉంటాయి. 2బీ మెట్రో మార్గం కస్తూరినగర్‌తో ప్రారంభమవుతుంది. ఈ మార్గంలో హొరమావు, హెచ్‌ఆర్‌బీఆర్‌ లే అవుట్‌, కల్యాణనగర్‌, హెచ్‌బీఆర్‌ లే అవుట్‌, నాగవార, వీరణ్ణపాళ్య, కెంపాపుర, హెబ్బాళ్‌, కొడిగేహళ్లి, జక్కూరు క్రాస్‌, యలహంక, బాగలూరు క్రాస్‌, ఎంబస్సీ బులెవార్డ్‌, దొడ్డజాల, ఎయిర్‌పోర్ట్‌ సిటీ, కెంపేగౌడ ఇంటర్నేషనల్‌ టర్మినల్‌ వస్తాయని అధికారులు తెలిపారు. కాగా ఈ రెండు మార్గాల పనులకు సంబంధించి మొత్తం 5 ప్యాకేజీలుగా ఖరారు చేసి దశలవారీగా పూర్తి చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-23T18:10:27+05:30 IST