ప్రధాన మెట్రోస్టేషన్లలో ‘తల్లిపాల గదులు’

ABN , First Publish Date - 2022-06-10T14:34:20+05:30 IST

‘చెన్నై మెట్రో రైల్‌’ ఆధ్వర్యంలోని అన్ని ప్రధాన మెట్రో రైల్వే స్టేషన్లలో తల్లిపాల గదులు’ (బ్రెస్ట్‌ ఫీడింగ్‌ రూమ్స్‌) ఏర్పాటు చేయాలని అధికారులు

ప్రధాన మెట్రోస్టేషన్లలో ‘తల్లిపాల గదులు’

చెన్నై, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ‘చెన్నై మెట్రో రైల్‌’ ఆధ్వర్యంలోని అన్ని ప్రధాన మెట్రో రైల్వే స్టేషన్లలో తల్లిపాల గదులు’ (బ్రెస్ట్‌ ఫీడింగ్‌ రూమ్స్‌) ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే చెన్నై విమానాశ్రయ మెట్రో స్టేషన్‌లో ఈ గదిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి మంగళవారం ప్రారంభించారు. త్వరలోనే ఎగ్మూర్‌, ఆలందూర్‌, తిరుమంగళగం స్టేషన్లలోనూ తల్లిపాల గదిని ఏర్పాటు చేసేందుకు అధికారులు ముమ్మరంగా సన్నాహాలు చేపట్టారు. విమానాశ్రయ మెట్రోరైల్‌ స్టేషన్‌లో ప్రత్యేక ఏర్పాటు చేసిన తల్లిపాల గదికి ఏసీ పెట్టారు. పసికందుకు పడుకుని పాలు పట్టేందుకు అనువుగా ఒక మంచం, దిండు, పసిబిడ్డకు దుస్తులు, డైపర్‌ వంటివి మార్చేందుకు అనువైన టేబుల్‌, మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్‌ కూడా ఏర్పాటు చేశారు. నగరంలోని సుదూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు మెట్రోరైళ్లు అనువుగా వున్నాయి. చెమట చిందకుండా, తక్కువ మొత్తం చార్జీతో, త్వరితగతిన ప్రయాణం కావడంతో ప్రయాణికులు సైతం మెట్రోరైళ్లనే ఆశ్రయిస్తున్నారు. అందుకే ఇటీవలి కాలంలో అన్ని మెట్రోరైళ్లకు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ రైల్వే స్టేషన్లలో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని ప్రధాన మెట్రోరైల్వే స్టేషన్లలో తల్లీబిడ్డలకు అనువుగా తల్లిపాల కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.

Updated Date - 2022-06-10T14:34:20+05:30 IST