YS Jagan చేసిన ఆ ఒక్క ప్రకటనతో రద్దు..!

ABN , First Publish Date - 2021-11-23T05:42:52+05:30 IST

YS Jagan చేసిన ఆ ఒక్క ప్రకటనతో రద్దు..!

YS Jagan చేసిన ఆ ఒక్క ప్రకటనతో రద్దు..!

  • ఎంటీఎంసీ.. రద్దు?
  • మూణ్ణాళ్ల ముచ్చటగా కార్పొరేషన్‌
  • మున్సిపాల్టీలుగా మంగళగిరి, తాడేపల్లి 
  • విలీన గ్రామాలన్నీ తిరిగి సీఆర్‌డీఏ పరిధిలోకి
  • వికేంద్రీకరణ బిల్లుల ఉపసంహరణతో పూర్వస్థితి
  • కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ

 

గుంటూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల పేరుతో తీసుకొచ్చిన వికేంద్రీకరణ బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ఉపసంహరించుకోవడంతో మంగళగిరి తాడేపల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌(ఎంటీఎంసీ) రద్దు కానుంది.  కార్పొరేషన్‌ ఏర్పాటుకు విలీనం చేసిన గ్రామాలన్నీ తిరిగి ఏపీసీఆర్‌డీఏ పరిధిలోకి రానున్నాయి. దీంతో మంగళగిరి, తాడేపల్లి తిరిగి పురపాలకసంఘాలుగా మారనున్నాయి. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లోనే మునిసిపల్‌ పరిపాలన శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


ఏపీసీఆర్‌డీఏని విచ్ఛిన్నం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం తొలుత అమరావతి రాజధాని నగరంలోని నవులూరు, యర్రబాలెం, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాలను తొలగించింది. తొలుత మంగళగిరి మునిసిపాలిటీలో నవులూరు, ఆత్మకూరు, యర్రబాలెం, బేతపూడి, చినకాకాని, పెదవడ్లపూడి, నిడమర్రు, నూతక్కి, కాజా, చినవడ్లపూడి, రామచంద్రాపురం గ్రామాలను విలీనం చేసింది. ఆ తర్వాత తాడేపల్లి మునిసిపాలిటీలోకి కొలనుకొండ, కుంచనపల్లి, ఉండవల్లి, గుండిమెడ, చిర్రావూరు, మల్లెంపూడి, ఇప్పటం, పెనుమాక, పాతూరు, వడ్డేశ్వరంలను కలిపింది. దీంతో ఆ రెండు మునిసిపాలిటీల విస్తీర్ణం పెరిగింది. ఈ రెండు మునిసిపాలిటీలను విలీనం చేసి మంగళగిరి తాడేపల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌ని ఈ ఏడాది మార్చి 24న ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్‌కి మునిసిపల్‌ కమిషనర్‌ని కూడా నియమించింది. ప్రభుత్వం తీసుకొన్న కార్పొరేషన్‌ ఏర్పాటు నిర్ణయాన్ని ఎక్కువమంది వ్యతిరేకించారు. అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేయడానికే ఈ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని అప్పట్లో ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసులు కూడా వేశారు. 


దీనిపై ప్రభుత్వాన్ని కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసి విచారణ జరుపుతున్నది. కాగా సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వం వికేంద్రకరణ బిల్లులను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఈ దృష్ట్యా ఏపీసీఆర్‌డీఏ తిరిగి అమలులోకి వచ్చినట్లైంది. దాంతో మంగళగిరి తాడేపల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు కోసం రాజధాని నుంచి వేరు చేసిన గ్రామాలన్నీ తిరిగి అమరావతి పరిఽధిలోకి వచ్చినట్లే. దాంతో జనాభా సంఖ్య భారీగా తగ్గిపోతుంది. ఈ కారణంగా మంగళగిరి తాడేపల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌ రద్దు అయినట్లేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతున్నది. దాంతో ఈ కార్పొరేషన్‌ పరిస్థితి మూణ్ణాళ్ల ముచ్చటగా మారనుంది.

Updated Date - 2021-11-23T05:42:52+05:30 IST