Jammu and Kashmir : సామాన్యులపై దాడులను ఆపేందుకు అత్యున్నత స్థాయి భేటీ ఈ నెల 3న

ABN , First Publish Date - 2022-06-03T01:00:52+05:30 IST

జమ్మూ-కశ్మీరులో సామాన్యులపై ఉగ్రవాద దాడులను ఆపేందుకు

Jammu and Kashmir : సామాన్యులపై దాడులను ఆపేందుకు అత్యున్నత స్థాయి భేటీ ఈ నెల 3న

న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరులో సామాన్యులపై ఉగ్రవాద దాడులను ఆపేందుకు అనుసరించవలసిన వ్యూహాన్ని రచించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం శుక్రవారం జరుగుతుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి ఈ కేంద్ర పాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద్ కుమార్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తదితరులు  హాజరవుతారు. 


ఇటీవల సామాన్యులపై ఉగ్రవాద దాడులు పెరుగుతుండటంతో అజిత్ దోవల్ గురువారం అమిత్ షాతో అత్యవసరంగా సమావేశమయ్యారు. సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


జమ్మూ-కశ్మీరులోని ఉగ్రవాద శక్తులు సామాన్యులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలనే విధానాన్ని అనుసరిస్తున్నట్లు నిఘా సమాచారం అందినట్లు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ముప్నుపై ఏ విధంగా స్పందించాలో జూన్ 3న జరిగే అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయిస్తారని తెలిపాయి. 


వలస కూలీలపైనా, కశ్మీరీ పండిట్లపైనా ఉగ్రవాదులు దాడులు చేయడం గత ఏడాది ప్రారంభమైంది. 2021 అక్టోబరులో ఐదు రోజుల్లో ఏడుగురు సామాన్యులను హత్య చేశారు. వీరిలో ఒకరు కశ్మీరీ పండిట్, ఒకరు సిక్కు, ఇద్దరు నాన్ లోకల్ హిందువులు. దీంతో తాము కశ్మీరు నుంచి వెళ్ళిపోతామని కశ్మీరీ పండిట్లు చెప్పారు ఇటీవల బుడ్గాం, కుల్గాం జిల్లాల్లో టీచర్లు, ప్రభుత్వోద్యోగులను ఉగ్రవాదులు హత్య చేస్తున్నారు. 


ఇదిలావుండగా, ఉగ్రవాదులను కట్టడి చేయడం కోసం ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను రంగంలోకి దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సైన్యం, పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశాలు రావచ్చునని కూడా చెప్తున్నారు. 


Updated Date - 2022-06-03T01:00:52+05:30 IST