మహా వేగం

ABN , First Publish Date - 2022-05-21T06:39:41+05:30 IST

మహా వేగం

మహా వేగం
మహానాడు వేదిక ఏర్పాట్లలో నిమగ్నమైన కూలీలు

కదిలిన కేడర్‌, నేతల్లో ఉత్సాహం

ఊపందుకున్న పనులు 

12 నియోజకవర్గాల్లో సమీకరణకు నేతల ప్రయత్నాలు

నేడు మంగళగిరిలో ఉమ్మడి జిల్లా నేతల సమావేశం 

మహానాడు ఏర్పాట్లల్లో వేగం పెరిగింది. తొలిసారిగా ఒంగోలులో నిర్వహిస్తుండటంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం నెలకొంది.  దీంతో మరింత ఉత్సాహంగా ఆ పార్టీ నేతలు మహానాడు మలిరోజు జరిగే బహిరంగసభకు జనసమీకరణ ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు కార్యక్రమం జరిగే ప్రాంతంలో భూమి చదును చేసే పనులు పూర్తయ్యాయి. ప్రతినిధుల సభ, బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన వేదికల ఏర్పాటుకు నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ముఖ్యనాయకుల వసతి ఏర్పాట్లపై ఒకఅవగాహనకు వచ్చారు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో మొత్తం ప్రణాళిక రూపొందించు కునేందుకు శనివారం జిల్లా నేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమావేశం కానున్నారు. సీమ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ చేరిన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం మంగళగిరి లోని కార్యాలయానికి వచ్చి పార్టీ రూపొందించిన ప్రణాళికకు తుది మెరుగులు దిద్దనున్నారు.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

రాష్ట్రప్రభుత్వం మినీ స్టేడియం ఇచ్చేందుకు అడ్డంకులు సృష్టించిన నేపథ్యంలో మండవారిపాలెం రైతులు ముందుకు రావటంతో వారి పొలాల్లో మహానాడు నిర్వహణకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఆ మేరకు మూడురోజుల కిందట భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. గత రెండు రోజులుగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ ఆధ్వర్యంలో ఆ భూమి చదును చేసే కార్యక్రమం వేగంగా సాగింది. ఒకవైపు ప్రతినిధులు మరోవైపు బహిరంగ సభకు వచ్చే ప్రజలు వెళ్లేందుకు అనువైన రహదారుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. యావత్తు పార్టీ నాయకులు, కార్యకర్తల,  ప్రజలు ఇబ్బందుల్లేకుండా అటు ప్రతినిధుల సభ.. ఇటు బహిరంగ సభకు హాజరయ్యేందుకు జాతీయ రహదారి నుంచి నేరుగా వచ్చే మార్గాలను చదును చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌ మాత్రం మండవవారిపాలెం నుంచి నేరుగా ప్రతినిధుల సభ జరిగే వేదికకు చేరుతుంది. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సహకరించకపోయినా ఇబ్బందులు లేకుండా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


స్థ్ధానికంగా సమావేశాలు

ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు మహానాడుకు ప్రజలు భారీగా హాజరయ్యేందుకు చర్యలు చేపట్టారు. తొలిరోజు ప్రతినిధుల సమావేశానికి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, మండల స్థాయిలో పార్టీ అధ్యక్ష, కార్యదర్శులతోపాటు అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు మాత్రమే హాజరవుతారు. అయితే ఎంత వద్దనుకున్నా ఆ సంఖ్యకు నాలుగు రెట్లు అధికంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఆ పార్టీశ్రేణులు తరలివచ్చే అవకాశం కన్పిస్తోంది. ఆ మేరకు కిందిస్థాయిలో పార్టీశ్రే ణులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు సమావేశాలు నిర్వహించి 28వ తేదీ జరిగే బహిరంగసభకు భారీగా తరలిరావాలని కోరుతూ నియోజకవర్గ, మండలస్థాయిలో సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఒంగోలులో దామచర్ల జనార్దన్‌ ప్రత్యేక ఆహ్వానపత్రం ద్వారా నగరంలోని ప్రతి ఇంటి వారిని పిలిచే కార్యక్రమానికి శ్రీకారం పలికారు. ఆ మేరకు తెలుగు మహిళలు వినూత్నంగా మండవవారిపాలెం, నగరంలోని కొన్ని డివిజన్లలో ఇంటింటికీ వెళ్లి ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యేలు ఏలూరి, గొట్టిపాటి రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహరెడ్డి, అశోక్‌రెడ్డి, దర్శి, వైపాలెం ఇన్‌చార్జ్‌లు పమిడి రమేష్‌, ఎరిక్షన్‌బాబులు ఇప్పటికే ముఖ్యనేతలకు ఆదేశాలిచ్చి మండలాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు. కందుకూరులో  ఇన్‌చార్జ్‌ నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే శివరాంతో కలిసి జనసమీకరణ ప్రయత్నాలు ప్రారంభించారు. కొండపి నియోజకవర్గ విస్తృత సమావేశాన్ని ఆదివారం ఏర్పాటుచేశారు ఎమ్మెల్యే స్వామి, పార్టీ రాష్ట్ర నాయకులు సత్యలు కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.  


భూమి చదును పూర్తి.. వేదిక పనులు మొదలు

భూమి చదును కూడా పూర్తికావటంతో ప్రతినిధుల సభ జరిగే మందిరాన్ని, బహిరంగసభ జరిగే వేదికను, భోజనశాలల వద్ద అవసరమైన ఏర్పాట్లను చేసేందుకు ఎంపిక చేసిన నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ప్రభుత్వం మినీస్టేడియం ఇచ్చేందుకు నిరాకరించినందున వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా తొలిరోజు ప్రతినిధుల సభ జరిగేందుకు అనువైన వేదికను, మందిరాన్ని నిర్మిస్తున్నారు. తీవ్రమైన వేసవి ప్రభావంతో ప్రతినిధులకు ఇబ్బందిలేకుండా ఫ్యాన్లు, కూలర్లతో పాటు ఏసీలు కూడా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. నిర్ణీత కార్యక్రమం ప్రకారం అయితే ఉదయం 8గంటల నుంచి రాత్రి 8 వరకు సమావేశం జరుగుతుంది. అందువలన ఇటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నర్‌ ప్రతి ఒక్కరికీ ఇబ్బందిలేకుండా స్టాల్స్‌ ఏర్పాటుకు సిద్ధం చేశారు. శంకుస్థాపన రోజు అచ్చెన్నాయుడు వచ్చిపోగా అంతకుముందు రోజు పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, శుక్రవారం రోజు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆ స్థలాన్ని పరిశీలించారు.


బస ఏర్పాట్లపై స్పష్టత

రాష్ట్రస్థాయిలో టీడీపీ ముఖ్య నాయకులతో పాటు 175 నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకత్వం మొత్తం ఒంగోలుకు తరలిరానుండటంతో బస కీలకమైంది. అయితే ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి సత్య ముందుచూపుతో ఒంగోలులోని ప్రధానమైన హోటళ్లు, లాడ్జీల్లోని గదులు, కళ్యాణమండపాలను, ప్రైవేట్‌ గెస్ట్‌హౌస్‌లకు అడ్వాన్స్‌లు చెల్లించి రిజర్వు చేశారు. విషయం తెలుసుకున్న అధినేత చంద్రబాబు సత్యాను అభినందించి ఒంగోలులో ఆయన రిజర్వు చేసిన గదులు రాష్ట్ర పార్టీ పరిధిలోకి తీసుకున్నారు. ఒంగోలులో అవకాశం ఉన్న మంచి లాడ్జీల్లోని గదులు గెస్ట్‌హౌస్‌లను రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పొలిట్‌ బ్యూరో సభ్యులు, ప్రధానంగా మహానాడు నిర్వహణకు సంబంధించి ఏర్పాటుచేసిన ఆయా కమిటీల్లోని ముఖ్యులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ బాధ్యతను రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్వహిస్తుంది. అలాగే అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని నియోజకవర్గాల వారీ హాజరయ్యే ప్రతినిధులకు ఒంగోలులోని కళ్యాణమండపాల్లో బస ఏర్పాటుచేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రతినిధులకు గుంటూరు. చిలకలూరిపేటల్లో బస ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత ఆదేశించారు. చిత్తూరు, కడప జిల్లాల వారికి నెల్లూరు, కావలి తదితర ప్రాంతాల్లో బస ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 26వ తేదీ రాత్రికి ఆయా ప్రాంతాలకు ప్రతినిధులు చేరి ఉదయాన్నే సిద్ధమై మహానాడు వేదికకు చేరాలని తిరిగి రాత్రికి ఆ ప్రాంతాలకు వెళ్లి బసచేయాలని 28వతేదీ కార్యక్రమానికి అక్కడ  నుండే రావాలని ఆదేశించారు. 




Updated Date - 2022-05-21T06:39:41+05:30 IST