సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం.. కుమారుడు జైన్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2022-03-02T13:14:02+05:30 IST

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు, 26 ఏళ్ల జైన్‌ నాదెళ్ల కన్నుమూశారు.

సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం.. కుమారుడు జైన్‌ కన్నుమూత

సత్య నాదెళ్లకు పుత్రశోకం

మస్తిష్క పక్షవాతంతో పుట్టినప్పటి నుంచి వీల్‌చైర్‌లోనే జైన్‌

జైన్‌ మృతికి సంతాపం తెలిపిన మైక్రోసాఫ్ట్‌ 

న్యూఢిల్లీ, మార్చి 1: మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు, 26 ఏళ్ల జైన్‌ నాదెళ్ల కన్నుమూశారు. పుట్టుకతోనే కండరాలకు సంబంధించిన రుగ్మత ‘మస్తిష్క పక్షవాతం’ (సెరెబ్రల్‌ పల్సీ) తో బాధపడుతున్న జైన్‌.. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఆరోగ్యం విషమించి మృతిచెందారు. ఈవిషయాన్ని మైక్రోసాఫ్ట్‌ సంస్థ తమ ఎగ్జిక్యూటివ్‌ సిబ్బందికి ఈ-మెయిల్‌ ద్వారా వెల్లడిస్తూ, జైన్‌ మృతికి సంతాపాన్ని ప్రకటించింది. సత్య నాదెళ్ల, అను దంపతుల పెద్ద కుమారుడు జైన్‌ 1996లో జన్మించారు. సెరెబ్రల్‌ పల్సీ కారణంగా పుట్టినప్పటి నుంచే జైన్‌ వీల్‌ చైర్‌కు పరిమితమయ్యారు. దీంతో సత్య నాదెళ్ల కుటుంబం ఎంతగానో కుంగిపోయింది. అయితే ఆ బాధను దిగమింగుకొని.. తన కొడుకు లాంటి వారి కోసం వినూత్న పరికరాల ఆవిష్కరణపై సత్య నాదెళ్ల దృష్టిపెట్టారు.

ఈనేపథ్యంలో ఆయన 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. దివ్యాంగులు సులువుగా ఉపయోగించుకునేలా మైక్రోసాఫ్ట్‌ ఉత్పత్తుల్లో అనేక కొత్త మార్పులు తెచ్చారు. కాగా, సత్య నాదెళ్లకు కుమారుడితో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సత్య నాదెళ్ల కుమారుడి మరణంతో.. ఆయన స్వగ్రామమైన అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురంలో విషాదం అలుముకుంది.  


జైన్‌ పుట్టిన రోజున ఏం జరిగిందంటే..

సత్య నాదెళ్ల ‘హిట్‌ రీఫ్రెష్‌’ పేరుతో కొన్నేళ్ల క్రితం ఓ పుస్తకాన్ని రాశారు. ‘జైన్‌ జన్మించిన సమయంలో మాకు ఎదురైన అనుభవాలు జీవితాన్నే మార్చేశాయి’ అంటూ ఆయన ఆ పుస్తకంలో చెప్పుకొచ్చారు. ఆ అనుభవాల గురించి పుస్తకంలో సత్య నాదెళ్ల వివరిస్తూ.. ‘‘తొలి సంతానం కోసం అను, నేను (సత్య నాదెళ్ల) ఎంతో ఆశగా ఎదురుచూశాం. గర్భవతిగా ఉన్న అనుకు 36వ వారంలో ఓ రాత్రి ఊహించని ఘటన ఎదురైంది. శిశువులో ఇదివరకు మాదిరి కదలికలు లేవని ఆమె గుర్తించింది. గర్భంలో ఉన్నప్పుడు ఊపిరి పీల్చుకోవడంలో సమస్య తలెత్తడం వల్లే జైన్‌ ఆరోగ్యానికి హాని కలిగిందని తెలుసుకున్నాం. ఇక మా అబ్బాయి వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి వస్తుందని గ్రహించాం’’ అని ఆయన చెప్పుకొచ్చారు.


జైన్‌ చాలాకాలం పాటు సెరెబ్రల్‌ పల్సీ చికిత్సపొందిన సియాటిల్‌ చిల్ర్డెన్స్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రేటివ్‌ బ్రెయిన్‌ రిసెర్చ్‌కు రూ.113 కోట్ల(15 మిలియన్‌ డాలర్లు) విరాళాన్ని సత్య నాదెళ్ల అందించారు. సెరెబ్రల్‌ పల్సీ అనేది శారీరక, మానసిక రుగ్మ త. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1,000 మంది పిల్లల్లో ఇద్దరు లే దా ముగ్గురిని ఇది కబళిస్తోంది. దీని బారినపడిన వారిలో మెదడు శాశ్వతంగా దెబ్బతినడం, అసాధారణమైన ఎదుగుదల వంటి సమస్యలు తలెత్తుతాయి. 

Updated Date - 2022-03-02T13:14:02+05:30 IST