నిరీక్షణ!

ABN , First Publish Date - 2021-03-06T04:19:15+05:30 IST

ధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. సమూల మార్పులు తీసుకొచ్చాం. మెనూ సక్రమంగా అమలు చేస్తున్నాం’..ఇలా ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమవుతోంది. కానీ నెలల తరబడి భోజన బిల్లులు చెల్లించకపోవడంతో నిర్వాహకులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. కోట్లాది రూపాయలు పెండింగ్‌లో ఉండడం, అప్పులు చేసి

నిరీక్షణ!




ఐదు నెలలుగా నిలిచిన ‘భోజన’ బిల్లులు

జిల్లా వ్యాప్తంగా చెల్లించాల్సింది రూ.5.80 కోట్లు

ఆందోళనలో ఏజెన్సీ నిర్వాహకులు

భోజనం నాణ్యతపై ప్రభావం

పట్టించుకోని యంత్రాంగం

(కలెక్టరేట్‌)

‘మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. సమూల మార్పులు తీసుకొచ్చాం. మెనూ సక్రమంగా అమలు చేస్తున్నాం’..ఇలా ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమవుతోంది. కానీ నెలల తరబడి భోజన బిల్లులు చెల్లించకపోవడంతో నిర్వాహకులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. కోట్లాది రూపాయలు పెండింగ్‌లో ఉండడం, అప్పులు చేసి పెట్టుబడి పెడుతుండడంతో పారదర్శకత కొరవడుతోంది. దాని ప్రభావం విద్యార్థులకు పెట్టే భోజనంపై పడుతోంది. నాణ్యత కొరవడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. రోజుకు సగటున 1,79,000 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 4,388 మంది ఏజెన్సీ సభ్యులు భోజనం తయారు చేస్తున్నారు. ప్రతినెలా రూ.2 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో గత ఏడాది మార్చి 22 నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. ఆంక్షల సడలింపులో భాగంగా నవంబరు నుంచి తెరచుకున్నాయి. అప్పటి నుంచి పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఐదు నెలలవుతున్నా బిల్లులు మాత్రం చెల్లించలేదు. వాస్తవానికి ఒక నెలకు సంబంధించి నిర్వాహకులు పెట్టుబడి పెడితే ఆ తరువాత నెల బిల్లులు చెల్లించేవారు. కానీ ఐదు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి చలనం లేకపోవడంతో నిర్వాహకులు భోజనం తయారీకి నిరాసక్తత చూపుతున్నారు. జిల్లావ్యాప్తంగా రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉంది.  


ఫ ఇవేనా సమూల మార్పులు?

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంతకు ముందున్న ఆహార మెనూను మార్చారు. అంతవరకూ బాగానే ఉంది కానీ బిల్లుల చెల్లింపులో మొండిచేయి చూపడం విమర్శలకు తావిస్తోంది.  కనీసం జీతాలనైనా చెల్లించాలని నిర్వాహకులు కోరుతున్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి సివిల్‌  సప్లయ్స్‌ డిపోల ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నారు.  కూర, రసంతో పాటు ఇతర ఆహార పదార్థాల తయారీ సామగ్రి, కూరగాయలు, వంట చేయడానికి గ్యాస్‌ తదితర వాటికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. కానీ ఐదు నెలలుగా బిల్లులు లేక చేతిచమురు వదిలించుకోవాల్సి వస్తోందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్‌ బిల్లులతో పాటు జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. ఇదే విషయంపై జిల్లా  భోజనం పఽథకం సంచాలకులు ఏఏ జ్యోతి  వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా నవంబరు నుంచి బిల్లులు నిలిచిపోయిన మాట వాస్తవమేనన్నారు. జిల్లావ్యాప్తంగా రూ.5.80 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించామని...వచ్చిన వెంటనే ఖాతాల్లో నిధులు జమ చేస్తామని చెప్పారు. 




Updated Date - 2021-03-06T04:19:15+05:30 IST